CM Revanth Reddy: గాంధీ సరోవర్‌కు 98.20 ఎకరాలు
ABN , Publish Date - Sep 11 , 2025 | 04:11 AM
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టనున్న గాంధీ సరోవర్ ప్రాజెక్టుకు రక్షణ శాఖ భూములు కేటాయించాలని కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు సీఎం రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఢిల్లీలో బుధవారం రక్షణ మంత్రిని ఆయన అధికారిక నివాసంలో రేవంత్‌రెడ్డి కలిశారు...
ప్రాజెక్టు కోసం రక్షణ శాఖ భూములను రాష్ట్రానికి బదలాయించండి
రాజ్‌నాథ్‌కు ముఖ్యమంత్రి రేవంత్ వినతి
మూసీ, ఈసా సంగమం వద్ద ప్రాజెక్టు
ధ్యాన గ్రామం, శాంతి విగ్రహం, మ్యూజియం నిర్మిస్తామని వెల్లడి
న్యూఢిల్లీ, సెప్టెంబరు 10 (ఆంధ్రజ్యోతి) : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టనున్న గాంధీ సరోవర్ ప్రాజెక్టుకు రక్షణ శాఖ భూములు కేటాయించాలని కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు సీఎం రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఢిల్లీలో బుధవారం రక్షణ మంత్రిని ఆయన అధికారిక నివాసంలో రేవంత్‌రెడ్డి కలిశారు. మూసీ, ఈసా నదుల సంగమ స్థలిలో గాంధీ సరోవర్ ప్రాజెక్టు చేపట్టనున్నట్టు తెలిపారు. గాంధీసర్కిల్ ఆఫ్ యూనిటీ నిర్మించబోతున్నామని, ఇందుకోసం అక్కడున్న 98.20 ఎకరాల రక్షణ శాఖ భూములను రాష్ట్ర ప్రభుత్వానికి బదలాయించాలని కోరారు. జాతీయ సమైక్యత, గాంధేయ విలువలకు సంకేతంగా గాంధీ సరోవర్ ప్రాజెక్టును చేపట్టినట్లు పేర్కొన్నారు. ఇందులో గాంధీ సిద్ధాంతాలను ప్రచారం చేసే నాలెడ్జి హబ్, ధ్యాన గ్రామం, చేనేత ప్రచార కేంద్రం, ప్రజా వినోద స్థలాలు, శాంతి విగ్రహం, మ్యూజియం నిర్మిస్తామని వివరించారు. సమావేశంలో ఎంపీలు పోరిక బలరాం నాయక్, కడియం కావ్య, చామల కిరణ్ కుమార్‌రెడ్డి పాల్గొన్నారు. అణచివేతపై ధిక్కార పతాక చాకలి ఐలమ్మ: రేవంత్ అణచివేతపై ధిక్కార పతాక చాకలి ఐలమ్మ అని సీఎం రేవంత్ రెడ్డి కొనియాడారు. తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా ఆమె చిత్రపటానికి సీఎం పూలమాల వేసి నివాళులర్పించారు. తెలంగాణ గడ్డపై దొరల అహంకారానికి, నిరంకుశత్వానికి వ్యతిరేకంగా 80 ఏళ్ల క్రితమే జంగ్ సైరన్ మోగించిన యోధురాలు ఐలమ్మ అని పేర్కొన్నారు. సమ్మక్క-సారక్క, చాకలి ఐలమ్మ స్ఫూర్తితోనే తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపొందించామని గుర్తు చేశారు.