Bihar Elections: బిహార్ మహాగఠ్‌బంధన్ సీఎం అభ్యర్థిగా తేజస్వీ యాదవ్
ABN , Publish Date - Oct 24 , 2025 | 05:47 AM
బిహార్ మహాగఠ్‌బంధన్ తరఫున సీఎం అభ్యర్ధిగా రాష్ట్రీయ జనతాదళ్ నేత తేజస్వీ యాదవ్ పేరును ఎట్టకేలకు అధికారికంగా ప్రకటించారు. దీంతో పాటు డిప్యూటీ సీఎం అభ్యర్ధిగా వికాస్ శీల్ ఇన్సాన్ పార్టీ(వీఐపీ) అధ్యక్షుడు...
ఉప ముఖ్యమంత్రి అభ్యర్థిగా వీఐపీ అధ్యక్షుడు సహనీ
ప్రకటించిన అశోక్ గహ్లోత్
పట్నా, అక్టోబరు 23: బిహార్ మహాగఠ్‌బంధన్ తరఫున సీఎం అభ్యర్ధిగా రాష్ట్రీయ జనతాదళ్ నేత తేజస్వీ యాదవ్ పేరును ఎట్టకేలకు అధికారికంగా ప్రకటించారు. దీంతో పాటు డిప్యూటీ సీఎం అభ్యర్ధిగా వికాస్ శీల్ ఇన్సాన్ పార్టీ(వీఐపీ) అధ్యక్షుడు ముఖేశ్ సహనీ పేరును కాంగ్రెస్ సీనియర్ నేత అశోక్ గెహ్లాట్ పాట్నాలో ప్రకటించారు. ఈ ఇద్దరి పేర్లపై కాంగ్రెస్ అధిష్ఠానంతో పాటు విపక్ష కూటమి అంగీకారం తెలిపిందని ఆయన వెల్లడించారు. తేజస్వీ గతంలోనే డిప్యూటీ సీఎంగా పనిచేయగా, సహనీ గత ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు.
ఎవరీ ముఖేశ్ సహనీ
వికా్‌సశీల్ ఇన్సాన్ పార్టీ అధ్యక్షుడు ముఖేశ్ సహనీ 2020 అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయేతో కలిసి నలుగురు అభ్యర్థులను ఎమ్మెల్యేలుగా గెలిపించుకున్నారు. అయితే తాను మాత్రం ఓడిపోయారు. అయినా ఆయనకు ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చిన బీజేపీ.. కేబినెట్‌లో మత్స్యశాఖ మంత్రిగా తీసుకుంది. అనంతర పరిణామాల్లో ఆయన పార్టీ ఎమ్మెల్యే ఒకరు చనిపోవడం, మిగతా ముగ్గురు ఎమ్మెల్యేలు బీజేపీలో చేరారు. ఆ తర్వా త సహనీకి బీజేపీ అవకాశం ఇవ్వకపోవడంతో మహాగఠ్‌బంధన్‌తో చేతులు కలిపారు. మరోవైపు.. బిహార్ రాష్ట్ర కాంగ్రెస్ ఇన్‌చార్జి కృష్ణ అల్లవరును వెంటనే తొలగించాలని డిమాండు చేస్తూ గురువారం పట్నాలో స్థానిక నేతలు ఆందో ళనకు దిగారు. దీనిపై స్పందించిన అధిష్ఠానం.. కృష్ణ అల్లవరు యూత్ కాంగ్రెస్ ఇన్‌చార్జిగానూ కొనసాగు తుండగా ఆ బాధ్యతల నుంచి తప్పించింది. కాగా, బిహార్ అసెంబ్లీ ఎన్నికలను ఎన్డీయే వికాసానికి, మహాగఠ్‌బంధన్ వినాశనానికి మధ్య పోరుగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా చెప్పారు. ఔరంగాబాద్‌లో జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ తాను పాట్నాలోనే పుట్టి పెరిగానని, ఆర్జేడీ అవినీతి పాలనను కళ్లారా చూశానన్నారు.
మరో వందేళ్ల దాకా మరచిపోలేరు: మోదీ
న్యూఢిల్లీ, అక్టోబరు 23: మరో వందేళ్ల దాకా బిహార్‌లో ఆర్జేడీ ఆటవిక పాలనను ప్రజలు మరచిపోలేరని ప్రధాని మోదీ చెప్పారు. విపక్షాలది పార్టీల కూటమి కాదని, బెయిల్‌పై బయటకొచ్చిన దోపిడిదార్ల కూటమి అని ఆరోపించారు. యువ సంవాద్ పేరిట ఆయన ఆన్‌లైన్ ద్వారా బిహార్ యువతతో ముచ్చటించారు. కేంద్రంలోనూ, బిహార్‌లోనూ స్థిరమైన ఎన్డీయే ప్రభుత్వాలు ఉండటం వల్లే నిరంతర అభివృద్ధి జరుగుతోందన్నారు. తాజా ఎన్నికలు కొత్త చరిత్రను సృష్టించబోతున్నాయని, ఇందులో యువత కీలక పాత్ర పోషించబోతుందని చెప్పారు. ప్రతి ఇంటికీ వెళ్లి ఓటు హక్కు తప్పకుండా వినియోగించుకోవాలని ఓటర్లకు చెప్పాలని ప్రధాని యువతకు సూచించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల గురించి ఓటర్లకు వివరించాలన్నారు.