Air India Flight: చెన్నై హైదరాబాద్ విమానంలో సాంకేతిక లోపం
ABN , Publish Date - Oct 20 , 2025 | 04:02 AM
చెన్నై నుంచి హైదరాబాద్‌కు బయలుదేరిన ఎయిరిండియా విమానంలో సాంకేతికలోపం తలెత్తడంతో అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు...
చెన్నై/శంషాబాద్ రూరల్, అక్టోబరు 19 (ఆంధ్రజ్యోతి): చెన్నై నుంచి హైదరాబాద్‌కు బయలుదేరిన ఎయిరిండియా విమానంలో సాంకేతికలోపం తలెత్తడంతో అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. 104 మంది ప్రయాణికులు, ఐదుగురు విమాన సిబ్బందితో ఎయిరిండియా విమానం ఆదివారం ఉదయం 10.45 గంటలకు చెన్నై విమానాశ్రయం నుంచి బయలుదేరింది. రన్‌వేను దాటి నింగిలోకి ఎగిరేందుకు సిద్ధమవుతుండగా విమాన ఇంజన్‌లో సాంకేతికలోపం తలెత్తినట్టు పైలెట్లు గుర్తించి ఏటీసీ అధికారులకు సమాచారమిచ్చారు. వారి ఆదేశం మేరకు పైలెట్ విమానాన్ని తిరిగి ఎయిర్‌పోర్ట్‌లోనే ల్యాండింగ్ చేశారు. సాంకేతిక లోపాన్ని సరిచేశాక మధ్యాహ్నం 12 గంటలకు విమానం హైదరాబాద్‌కు బయలుదేరింది. ఇక భువనేశ్వర్ నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు రావాల్సిన విమానం నాలుగున్నర గంటలు ఆలస్యం కావడంతో ఎయిర్‌పోర్టులో ప్రయాణికులు అందోళనకు దిగారు. ఇదిలా ఉండగా.. ఆదివారం ఉదయం 6.30 గంటలకు శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి తిరుపతి వెళ్లాల్సిన స్పైస్‌జెట్ విమానం సాంకేతిక లోపం కారణంగా రద్దయింది. మరోవైపు, న్యూఢిల్లీ నుంచి నాగాలాండ్‌లోని దిమాపూర్‌కు ఆదివారం వెళ్లిన ఇండిగో విమానానికి ముప్పు తప్పింది. ఆ విమానం న్యూఢిల్లీలో బయలుదేరడానికి సిద్ధమవుతున్న సమయంలో ఓ ప్రయాణికుడు తీసుకెళ్తున్న పవర్ బ్యాంక్‌లో మంటలు కనిపించాయి. అప్రమత్తంగా ఉన్న సిబ్బంది సెకన్ల వ్యవధిలో వాటిని అదుపులోకి తీసుకొచ్చారు.