Technical Glitch at Delhi Airport: ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో సాంకేతిక సమస్య..వందల విమానాలు ఆలస్యం
ABN , Publish Date - Nov 08 , 2025 | 02:09 AM
ఏ విమానం ఎప్పుడొస్తుందో తెలియదు.. వచ్చిన విమానం ఎప్పుడు బయల్దేరుతుందో తెలియదు.. బోర్డింగ్ పాస్‌లలు ఇచ్చే గేట్ల వద్ద వందలాది ప్రయాణికులు..
ఏఎంఎ్‌సఎ్‌సలో సమస్యవల్లే: నిపుణులు
శంషాబాద్ రూరల్, నవంబరు 7 (ఆంధ్రజ్యోతి): ఏ విమానం ఎప్పుడొస్తుందో తెలియదు.. వచ్చిన విమానం ఎప్పుడు బయల్దేరుతుందో తెలియదు.. బోర్డింగ్ పాస్‌లలు ఇచ్చే గేట్ల వద్ద వందలాది ప్రయాణికులు.. గంటలకొద్దీ నిరీక్షణ.. నిరీక్షించలేక ప్రయాణికుల్లో అసహనం.. ఇవీ ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో శుక్రవారం కనిపించిన దృశ్యాలు! రోజుకు 1500కు పైగా విమానాల రాకపోకలతో.. దేశంలోనే అత్యంత రద్దీ కలిగిన విమానాశ్రయంగా పేరొందిన ఢిల్లీ ఎయిర్‌పోర్టులో తీవ్ర గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ‘ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ)’లో సాంకేతిక సమస్య కారణంగా వందలాది విమానాలు ఆలస్యమయ్యాయి. దేశీ, అంతర్జాతీయ సర్వీసులన్నీ కలిపి 800కు పైగా విమానాలపై ఈ ప్రభావం పడినట్టు సమాచారం. ఇండిగో, ఎయిరిండియా, ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్, స్పైస్‌జెట్, ఆకాశ ఎయిర్.. ఇలా అన్ని సంస్థలూ తమ విమానాలు ఆలస్యమైనట్టు ప్రకటించాయి. ఈ సమస్య ప్రభావం దేశంలోని ఇతర నగరాల్లోని ఎయిర్‌పోర్టులపైనా తీవ్రంగా పడుతోంది. రాజధాని నుంచి రావాల్సిన విమానాలు ఆలస్యం అవుతుండడంతో.. జైపూర్, లఖ్‌నవూ, ముంబై, వారాణసీ తదితర విమానాశ్రయాల్లోనూ పలు సర్వీసుల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. దీంతో ఆయా విమానాశ్రయాల అధికారులు.. ఈ ఆలస్యం గురించి ప్రయాణాకులకు ముందుగానే సమాచారం అందిస్తున్నారు. శంషాబాద్ విమానాశ్రయంలో 60కిపైగా సర్వీసులపై ఈ ప్రభావం పడింది.
ఇదీ సమస్య...
విమానాల రాకపోకలకు అత్యంత కీలకమైన ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ డేటాకు సంబంధించి ‘ఆటోమేటిక్ మెసేజ్ స్విచింగ్ సిస్టమ్ (ఏఎంఎ్‌సఎ్‌స’’లో సాంకేతిక సమస్య ఏర్పడడమే ఢిల్లీ ఎయిర్‌పోర్టులో ఈ గందరగోళానికి కారణమని విమానాశ్రయాల ప్రాధికార సంస్థ (ఏఏఐ) తెలిపింది. గురువారం సాయంత్రం నుంచీ.. ఈ సమస్య కారణంగా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్లకు.. విమానాల ప్రణాళికలు ఆటోమేటిగ్గా రావట్లేదు. దీంతో వారు తమకు అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఫ్లైట్ ప్లాన్స్‌ను మాన్యువల్‌గా సిద్ధం చేయాల్సి వస్తోంది. అందుకు ఎక్కువ సమయం పడుతుండడంతో విమానాలు బయల్దేరడం బాగా ఆలస్యమవుతోంది. ప్రముఖ ఫ్లైట్ ట్రాకింగ్ వెబ్‌సైట్ ‘ఫ్లైట్‌రేడార్24.కామ్’ ప్రకారం.. ఈ సమస్య కారణంగా ఢిల్లీ ఎయిర్‌పోర్టులో 300కు పైగా విమానాలు ఆలస్యమయ్యాయి.
మాల్‌వేరే కారణమా?
ఢిల్లీ ఎయిర్‌పోర్టులో ప్రస్తుత సమస్యకు సాంకేతిక సమస్యలే కారణమని అధికారులు చెబుతున్నప్పటికీ.. ఏటీసీ ఆటోమేషన్ సాఫ్ట్‌వేర్‌లో ఎవరో కావాలనే మాల్‌వేర్‌ను ప్రవేశపెట్టడం వల్లే ఇలా జరిగిందని, ఇది లక్ష్యిత దాడేనని విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ ‘సీఎన్‌ఎన్-న్యూ్‌స 18’ వెబ్‌సైట్ ఒక కథనాన్ని ప్రచురించింది. ఆ మాల్‌వేర్ సిస్టమ్ ఇంటర్‌ఫే్‌సలను,, రేడార్ సింక్రనైజేషన్ మాడ్యూళ్లను లక్ష్యంగా చేసుకుంటున్నట్టుగా ఆ వర్గాలు పేర్కొన్నట్టు అందులో వివరించింది. ఇటీవలికాలంలో సాఫ్ట్‌వేర్‌ను అప్‌డేట్ చేయకపోవడం, రియల్‌టైమ్ బ్యాకప్ లేకపోవడం వల్ల పరిస్థితి ఇంకా దారుణంగా తయారైనట్టు వెల్లడించింది.