Share News

Government Schools: టీచర్లు 1000.. విద్యార్థులు 0

ABN , Publish Date - Oct 27 , 2025 | 01:29 AM

ప్రభుత్వ విద్య ప్రతి ఒక్కరికీ అందుబాటులోకి రావాలని ఓవైపు అందరూ కోరుకుంటుంటే.. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులే చేరని పరిస్థితి మరోవైపు నెలకొంటోంది...

Government Schools: టీచర్లు 1000.. విద్యార్థులు 0

  • తెలంగాణలో 2వేల స్కూళ్లలో జీరో ఎన్‌రోల్‌మెంట్‌

  • 2024-25 విద్యా సంవత్సరం గణాంకాల్లో వెల్లడి

న్యూఢిల్లీ, అక్టోబరు 26: ప్రభుత్వ విద్య ప్రతి ఒక్కరికీ అందుబాటులోకి రావాలని ఓవైపు అందరూ కోరుకుంటుంటే.. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులే చేరని పరిస్థితి మరోవైపు నెలకొంటోంది. 2024-25 విద్యా సంవత్సరంలో దేశ వ్యాప్తంగా 7,993 ప్రభుత్వ పాఠశాలల్లో ఒక్క విద్యార్థి కూడా చేరలేదని కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అయితే ఈ పాఠశాలల్లో ఏకంగా 20,817 మంది ఉపాధ్యాయులు నియమితులైనట్లు తెలిపింది. ఇందులో విద్యార్థులు ఒక్కరు కూడా చేరని (జీరో ఎన్‌రోల్‌మెంట్‌) స్కూళ్లు దేశంలోనే అత్యధికంగా పశ్చిమబెంగాల్‌లో 3,812 ఉండగా, ఆ తరువాత స్థానంలో తెలంగాణలో 2,245 జీరో ఎన్‌రోల్‌మెంట్‌ స్కూళ్లు ఉన్నాయి. ఇక ఇలాంటి స్కూళ్లలో పనిచేసే ఉపాధ్యాయుల సంఖ్య కూడా అత్యధికంగా (17,965) బెంగాల్‌లోనే ఉంది. ఈ విషయంలోనూ తెలంగాణ రాష్ట్రం 1,016 మంది ఉపాధ్యాయులతో రెండోస్థానంలో ఉంది. కాగా, విద్యార్థులు చేరని స్కూళ్లలో తెలంగాణ తరువాతి స్థానాల్లో వరుసగా హరియాణా, మహారాష్ట్ర, గోవా, అసోం, హిమాచల్‌ప్రదేశ్‌ ఛత్తీ్‌సగఢ్‌, నాగాలాండ్‌, సిక్కిం, త్రిపుర ఉన్నాయి. అయితే 2023-24 విద్యాసంవత్సరంలో దేశవ్యాప్తంగా ఇలాంటి స్కూళ్లు 12,954 ఉండగా, 2024-25 నాటికి ఇవి సుమారు 5వేలు తగ్గిపోవడం కొంత ఊరటగా భావిస్తున్నారు. అయితే కేంద్రపాలిత ప్రాంతాల్లో జీరో ఎన్‌రోల్‌మెంట్‌ స్కూళ్లే లేకపోవడం గమనార్హం. ఢిల్లీలోనూ ఇలాంటి ప్రభుత్వ పాఠశాల ఒక్కటి కూడా లేదు.

Updated Date - Oct 27 , 2025 | 01:29 AM