TCS Layoffs: రెండేళ్ల జీతమిచ్చి.. ఉద్యోగుల తొలగింపు
ABN , Publish Date - Oct 04 , 2025 | 03:04 AM
దేశంలోని అతి పెద్ద ఐటీ సేవల సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) ‘సిబ్బంది పునర్వ్యవస్థీకరణ కార్యక్రమం...
దేశంలోనే అతి పెద్ద ఐటీ దిగ్గజం టీసీఎ్‌సలో లే ఆఫ్‌లు
ఉద్యోగులు సంస్థలో పనిచేసిన కాలాన్ని బట్టి తొలగింపు ప్యాకేజీగా ఆర్నెల్ల నుంచి రెండేళ్ల వేతనం
న్యూఢిల్లీ, అక్టోబరు 3: దేశంలోని అతి పెద్ద ఐటీ సేవల సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) ‘సిబ్బంది పునర్వ్యవస్థీకరణ కార్యక్రమం’ కింద.. ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ చేపట్టింది. సంస్థ అవసరాలకు అనుగుణమైన నైపుణ్యాలు లేని, నైపుణ్యాలను పెంచుకోని ఉద్యోగులను ఇంటికి పంపిస్తోంది. ఇలా తొలగించే ఉద్యోగులకు 3నెలల వేతనాన్ని ‘నోటీస్ పే’గా అందిస్తోంది. దానికి అదనంగా... ఉద్యోగులు టీసీఎ్‌సలో ఎంతకాలంగా పనిచేస్తున్నారనే అంశం ఆధారంగా ఆరు నెలల నుంచి రెండేళ్ల వేతనాన్ని తొలగింపు ప్యాకేజీ కింద ఇస్తోంది. ఏ ప్రాజెక్టులోనూ లేనివారికి/ఎనిమిది నెలలకు పైగా బెంచ్‌పై ఉన్నవారికి కేవలం మూడు నెలల వేతనం మాత్రమే ఇచ్చి సాగనంపుతోంది. 10 నుంచి 15 ఏళ్లు సంస్థలో పనిచేసినవారికి ఏడాదిన్నర వేతనం.. 15 ఏళ్లకు పైగా సంస్థలో ఉన్నవారికి రెండేళ్ల వేతనం ఇస్తోంది. పదవీ విరమణ వయసుకు దగ్గరలో ఉన్నవారికి ‘టీసీఎస్ కేర్స్’ పథకం కింద ముందే పదవీ విరమణ చేసే అవకాశాన్ని కల్పిస్తోంది. అందులో భాగంగా వారికి పూర్తిస్థాయి పదవీ విరమణ ప్రయోజనాలు, బీమా, అదనంగా తొలగింపు ప్యాకేజీ కింద ఆర్నెల్ల నుంచి రెండేళ్ల వేతనాన్ని అందిస్తోంది. నానాటికీ పెరుగుతున్న ఏఐ ప్రభావం, క్లైంట్ల డిమాండ్ల మేరకు.. 2025-26 ఆర్థిక సంవత్సరంలో తన సిబ్బందిలో 2ు మందిని (దాదాపు 12 వేల మందిని) తగ్గించుకోనునున్నట్టు ఈ ఏడాది జూలైలో ప్రకటించిన సంగతి తెలిసిందే.
వివరాలు చెప్పండి..
ప్రపంచవ్యాప్తంగా తన సిబ్బందిని టీసీఎస్ తొలగిస్తున్న నేపథ్యంలో.. అమెరికాలో నియామకాలకు సంబంధించి టీసీఎస్ అనుసరిస్తున్న విధానాలపై యూఎస్ సెనెటర్లు 9 ప్రశ్నలు సంధించారు. ఈమేరకు సెనెట్ జ్యుడిషియరీ కమిటీ చైర్మన్ చార్లెస్ గ్రాస్‌లే, ర్యాంకింగ్ మెంబర్ రిచర్డ్ డర్బిన్ టీసీఎస్ సీఈవో కె.కృత్తివాసన్‌కు సెప్టెంబరు 24న లేఖ రాశారు. ఇటీవలికాలంలో అమెరికాలోని జాక్సన్ విల్లేలో దాదాపు 60 మంది ఉద్యోగులను టీసీఎస్ తొలగించిన విషయాన్ని అందులో పేర్కొన్నారు. 2025లో టీసీఎస్ సంస్థ 5,505 మంది హెచ్-1బీ ఉద్యోగులను నియమించుకోవడానికి అనుమతి పొందిన నేపథ్యంలో.. ఒకవైపు అమెరికన్లను తొలగిస్తూ.. ఇలా హెచ్-1బీ ఉద్యోగుల కోసం వేలాది పిటిషన్లు దాఖలు చేయడమేమిటని ప్రశ్నించారు. టీసీఎస్ తన కార్యాలయాల్లో ఉద్యోగాలకు తగిన అర్హతలున్న అమెరికన్ ఉద్యోగులను గుర్తించలేకపోవడం నమ్మదగినదిగా లేదని వ్యాఖ్యానించారు. వయసు మళ్లిన అమెరికన్ ఉద్యోగులను తొలగించి.. వారి స్థానాలను దక్షిణాసియా దేశాలకు చెందినవారిని హెచ్-1బీ వీసాలపై తెచ్చి భర్తీ చేస్తోందన్న ఆరోపణలు టీసీఎ్‌సపై ఉన్నాయి. దీనిపై ‘ఈక్వల్ ఎంప్లాయ్‌మెంట్ ఆపర్చునిటీ కమిషన్’ దర్యాప్తు జరుపుతోంది. ఇలాంటి సమయంలో.. అమెరికన్లను హెచ్-1బీ వీసాపై వచ్చినవారితో భర్తీచేయడం సంస్థకు ఏవిధంగానూ మేలు చేయదని సెనెటర్లు తమ లేఖలో పేర్కొన్నారు. హెచ్-1బీ వీసాపై తెచ్చినవారితో అమెరికన్ ఉద్యోగుల స్థానాన్ని భర్తీ చేస్తున్నారా? హెచ్-1బీ వీసాలపై వచ్చినవారికి అమెరికన్ ఉద్యోగులకు చెల్లించే వేతనాల్లో తేడాలు ఎంత? వంటి ప్రశ్నలు అడిగి.. 10వ తేదీలోగా వాటికి పూర్తివివరాలతో సమాధానాలు ఇవ్వాలని కోరారు.