Car Prices to Drop Soon: కార్ల ధరలు..తగ్గింపు షురూ
ABN , Publish Date - Sep 06 , 2025 | 04:26 AM
జీఎస్టీ తగ్గింపు ప్రయోజనాలను వినియోగదారులకు అందించేందుకు ఆటోమొబైల్ కంపెనీలు సిద్ధమయ్యాయి..
వివిధ మోడళ్ల కార్లపై తగ్గబోయే ధరలను ప్రకటించిన టాటా మోటార్స్
రూ.65వేల నుంచి రూ.1.55 లక్షల వరకు మిగులు
న్యూఢిల్లీ, సెప్టెంబరు 5: జీఎస్టీ తగ్గింపు ప్రయోజనాలను వినియోగదారులకు అందించేందుకు ఆటోమొబైల్ కంపెనీలు సిద్ధమయ్యాయి. ఈ నెల 22వ తేదీ నుంచి ఏయే మోడళ్ల ధరలు ఎంత వరకు తగ్గుతాయో చెబుతూ.. ముందస్తుగా బుకింగ్స్ రాబట్టుకునే ప్రయత్నాలు ప్రారంభించాయి. ముందుగా ధరల తగ్గింపునకు టాటా మోటార్స్ శ్రీకారం చుట్టింది. తమ కార్ల ధరలు మోడల్‌ను బట్టి రూ.65,000 నుంచి రూ.1.55 లక్షల వరకు తగ్గుతాయని ప్రకటించింది. జీఎస్టీ పన్ను ప్రయోజనాన్ని పూర్తిగా కొనుగోలుదారులకు బదిలీ చేయాలనే ప్రభుత్వ ఉద్దేశానికి తాము కట్టుబడి ఉన్నట్టు టాటా మోటార్స్ (పాసింజర్ వెహికల్స్) ఎండీ శైలేశ్ చంద్ర తెలిపారు. కర్వ్ మోడల్‌పై రూ.65 వేల వరకు, టియాగోపై రూ.75 వేలు, టిగోర్‌పై రూ.80 వేలు, పంచ్‌పై రూ.85 వేలు, ఆలో్ట్రజ్‌పై రూ.1.10 లక్షలు, హారియర్‌పై రూ.1.40 లక్షలు, సఫారీపై రూ.1.45 లక్షలు, నెక్సాన్‌పై రూ.1.55 లక్షల వరకు ధరల తగ్గింపు ఉంటుందని వెల్లడించారు. మరోవైపు టాటా మోటార్స్ బాటలోనే మిగతా కార్ల కంపెనీలు, ద్విచక్ర వాహనాల కంపెనీలు కూడా ధరల తగ్గింపును ప్రకటించేందుకు కసరత్తు చేస్తున్నట్టు తెలిసింది. త్వరలోనే మోడళ్ల వారీగా తగ్గింపు ప్రయోజనం ఎంత ఉంటుందనేది వెల్లడించే అవకాశం ఉన్నట్టు సమాచారం. దీనితో పండుగకు కొత్త కారు, ద్విచక్రవాహనం కొనాలని భావిస్తున్న వారికి.. ఏయే వాహనాలు ఎంతెంత ధరకు వస్తాయనే స్పష్టత వచ్చే అవకాశం ఉంది.