Tamil Nadu Teacher: బాలికకు గది బయట పరీక్ష
ABN , Publish Date - Apr 11 , 2025 | 05:51 AM
తమిళనాడులో ఓ పాఠశాలలో ఉపాధ్యాయులు రుతుక్రమంలో ఉన్న దళిత బాలికను ఎండలో కూర్చోపెట్టి పరీక్ష రాయించారు. దీనిపై సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయిన వీడియోతో ప్రభుత్వ చర్యలు ప్రారంభమయ్యాయి
‘రుతుక్రమం’లో ఉందని ఎండలో మెట్లపై కూర్చోపెట్టి రాయించిన ఉపాధ్యాయులు
చెన్నై, ఏప్రిల్ 10 (ఆంధ్రజ్యోతి): ఆ ఉపాధ్యాయులు ఓ బాలికను మానసిక క్షోభకు గురిచేశారు. రుతుక్రమంలో ఉందని తరగతి గది బయట, ఎండలో కూర్చోపెట్టి పరీక్ష రాయించారు. తమిళనాడులో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావ డంతో ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. ఆ పాఠశాల ప్రిన్సిపాల్‌ను సస్పెండ్ చేసింది. కోయంబత్తూరు జిల్లా సెంగోట్టుపాళయంలోని స్వామి చిద్భవానంద మెట్రిక్యులేషన్ హయ్యర్ సెకండరీ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న ఓ దళిత బాలిక ఈనెల 5న పుష్పవతి అయింది. వార్షిక పరీక్షలు ఉండడంతో బాలిక 7న పరీక్ష రాసేందుకు పాఠశాలకు వెళ్లగా ఉపాధ్యాయ బృందం ఆమెను తరగతి గది బయటే కూర్చోబెట్టి పరీక్ష రాయించింది. పరీక్ష తర్వాత విద్యార్థిని ఇంటికెళ్లి రోదిస్తూ తల్లిదండ్రులకు విష యం చెప్పింది. వారు ఆమెకు సర్దిచెప్పి 9న మళ్లీ పాఠశాలకు పంపారు. కొద్దిసేపటి తర్వాత బాలిక తల్లి పాఠశాలకు వెళ్లి చూడగా, ఆ బాలిక తరగతి గది మెట్లపై, ఎండలో కూర్చుని పరీక్ష రాస్తోంది. దీన్ని ఆమె తల్లి వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పెట్టింది. దాంతో దేశవ్యాప్తంగా ఈ వ్యవహారం చర్చనీయాంశమైంది. గురువారం సాయంత్రం ఈ ఘటనపై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి అన్బిల్ మహేష్ స్పందించారు. బాధ్యులైన పాఠశాల ప్రిన్సిపాల్‌ను సస్పెండ్ చేసినట్టు ప్రకటించారు.