NEET abolition bill: తమిళనాట నీట్ రద్దు కోసం న్యాయపోరాటం
ABN , Publish Date - Apr 10 , 2025 | 04:40 AM
తమిళనాడు రాష్ట్రంలో నీట్ రద్దు కోసం న్యాయపోరాటం అవసరమని అఖిలపక్ష సమావేశం నిర్ణయించింది. సీఎం స్టాలిన్ నాయకత్వంలో జరిగిన సమావేశానికి అన్నాడీఎంకే, బీజేపీ హాజరుకాలేదు.

చెన్నై, ఏప్రిల్ 9 (ఆంధ్రజ్యోతి): తమిళనాట నీట్ పరీక్షల రద్దు కోసం న్యాయపోరాటం జరపాలని రాష్ట్ర సీఎం స్టాలిన్ అధ్యక్షతన జరిగిన అఖిలపక్ష సమావేశం తీర్మానించింది. బుధవారం సాయంత్రం జరిగిన ఈ సమావేశంలో స్టాలిన్ ప్రసంగిస్తూ.. తొలిసారిగా 2021 సెప్టెంబర్ 13న నీట్ పరీక్షల రద్దు ముసాయిదా చట్టాన్ని రూపొందించి రాష్ట్రపతి పరిశీలనకు పంపామని, ఆ బిల్లును రాష్ట్ర గవర్నర్ రాష్ట్రపతి ఆమోదం కోసం పంపుతారని ఎదురు చూశామని, అయితే ఆ బిల్లును రాష్ట్రపతికి పంపకుండా పెండింగ్‌లో ఉంచారని వివరించారు. ఆ తర్వాత 2022 ఫిబ్రవరి 5న అఖిలపక్ష సమావేశం జరిపి, ఆ ముసాయిదా చట్టాన్ని అసెంబ్లీలో అదే నెల 8న మళ్లీ ఆమోదింపజేసి రాష్ట్రపతి ఆమోదం కోసం పంపినా ఫలితం లేకపోయిందన్నారు. కాగా, అఖిలపక్ష సమావేశానికి ప్రధాన ప్రతిపక్షమైన అన్నాడీఎంకే, బీజేపీ సమావేశాన్ని బహిష్కరించాయి.