Share News

Supreme Court: ఆ సైన్యాధికారి తొలగింపు సబబే!

ABN , Publish Date - Nov 26 , 2025 | 04:12 AM

తమ రెజిమెంటుకు సంబంధించిన హిందూ ఆలయంలో జరిగే వారాంతపు పూజలో ఇతర సైనికులతో కలిసి పాల్గొనటానికి నిరాకరించిన క్రైస్తవ మతానికి చెందిన ఓ సైన్యాధికారిని సైన్యం నుంచి తొలగించటాన్ని సుప్రీంకోర్టు సమర్థించింది. దీనివల్ల సదరు రెజిమెంటులో....

Supreme Court: ఆ సైన్యాధికారి తొలగింపు సబబే!

  • పూజలో పాల్గొనేందుకు నిరాకరించిన క్రైస్తవ సైన్యాధికారి డిస్మి్‌సపై సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ, నవంబరు 25: తమ రెజిమెంటుకు సంబంధించిన హిందూ ఆలయంలో జరిగే వారాంతపు పూజలో ఇతర సైనికులతో కలిసి పాల్గొనటానికి నిరాకరించిన క్రైస్తవ మతానికి చెందిన ఓ సైన్యాధికారిని సైన్యం నుంచి తొలగించటాన్ని సుప్రీంకోర్టు సమర్థించింది. దీనివల్ల సదరు రెజిమెంటులో ఉండాల్సిన ఐక్యత దెబ్బతింటుందని, ప్రవర్తన మార్చుకోవాలని సీనియర్‌ అధికారులు పలుమార్లు చేసిన హెచ్చరికలను పెడచెవిన పెట్టటాన్ని.. తీవ్రమైన క్రమశిక్షణా రాహిత్యంగా అభివర్ణించింది. ‘మీ ఉద్యోగానికి సంబంధించిన ఇతర అంశాల్లో మీరు ఎంత ప్రతిభావంతులైనా కావొచ్చు. కానీ, భారతీయ సైన్యం అంటేనే సెక్యులరిజానికి ప్రతీక. మీ సొంత సైనికుల భావోద్వేగాలను గౌరవించటంలో మీరు విఫలమయ్యారు’ అని వ్యాఖ్యానించింది. శామ్యూల్‌ కమలేశన్‌ అనే సైన్యాధికారిని ఆర్మీ నుంచి తొలగించిన అంశంపై సీజేఐ జస్టిస్‌ సూర్యకాంత్‌, జస్టిస్‌ జోయ్‌మాల్యా బాగ్చిలతో కూడిన ధర్మాసనం మంగళవారం విచారణ జరిపింది. శామ్యూల్‌ కమలేశన్‌ 2017లో సైన్యంలో చేరారు. తదనంతర కాలంలో ఆయనకు ఒక స్క్వాడ్రన్‌ ట్రూప్‌ లీడర్‌ బాధ్యతలు అప్పగించారు. వారి రెజిమెంట్‌ ఉండే ప్రాంతంలో ఒక గురుద్వారా, ఒక ఆలయం ఉన్నాయి. వారాంతాల్లో జరిగే ఆధ్యాత్మిక పరేడ్‌లలో శామ్యూల్‌ తన సైనికులతో కలిసి పాల్గొనేవారు. అయితే, ఆలయంలో జరిగే మంగళహారతి, పూజ వంటి కార్యక్రమాల్లో పాలుపంచుకోకుండా ఆలయం బయట ఉండిపోయేవారు. దీనిపై ఆయన పైఅధికారులు పలుమార్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. తర్వాత ఆయనను విధుల నుంచి తొలగించారు. ఈ ఉత్తర్వులను శామ్యూల్‌ ఢిల్లీ హైకోర్టులో సవాల్‌ చేయగా.. ఉన్నతాధికారుల నిర్ణయాన్ని హైకోర్టు సమర్థించింది. దీంతో, శామ్యూల్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. విచారణ సందర్భంగా సీజేఐ జస్టిస్‌ సూర్యకాంత్‌ స్పందిస్తూ.. ‘ఈ విధమైన ప్రవర్తన ద్వారా మీరు ఏ సంకేతం ఇస్తున్నారు? నాయకులు ఒక సమున్నత ఉదాహరణగా నిలవాలి. కానీ, మీరు మీ సైనికులనే అవమానిస్తున్నారు’ అని పేర్కొన్నారు. శామ్యూల్‌ కమలేశన్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది గోపాల్‌ శంకర్‌నారాయణన్‌ వాదనలు వినిపిస్తూ.. తన క్లయింట్‌ రెజిమెంటులో జరిగే దీపావళి, హోలీ వంటి పండుగల్లో పాల్గొంటారని, సర్వధర్మస్థల్‌ (అన్ని మతాల ప్రార్థనాస్థలం) వద్ద జరిగే కార్యక్రమాల్లోనూ పాలుపంచుకుంటారని తెలిపారు. ప్రస్తుతం పోస్టింగు ఉన్న ప్రాంతంలో సర్వధర్మస్థల్‌ లేకపోవటంతో.. ఆలయం బయట జరిగే కార్యక్రమాల్లో పాల్గొనటానికి సిద్ధంకానీ, లోపల జరిగే పూజల్లో మాత్రం పాల్గొననని, తన మతభావనకు అది విరుద్ధమని తెలిపారని పేర్కొన్నారు. ఆర్టికల్‌ 25 ప్రకారం శామ్యూల్‌ తన మతాన్ని పాటించే హక్కును కలిగి ఉంటారని, ఆర్మీ అధికారి అయినంత మాత్రాన దానిని కోల్పోరన్నారు.

Updated Date - Nov 26 , 2025 | 04:12 AM