Supreme Court Strikes Down: కోర్టు తీర్పులకు విరుద్ధంగా చట్టాలా?
ABN , Publish Date - Nov 20 , 2025 | 04:28 AM
కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ట్రైబ్యునళ్ల సంస్కరణల చట్టం-2021ను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సర్వోన్నత న్యాయస్థానం బుధవారం కీలక తీర్పు వెలువరించింది...
అలా చేయడానికి వీల్లేదు
కోర్టు తీర్పులను పార్లమెంటు పక్కన పెట్టలేదు
ట్రైబ్యునళ్ల సంస్కరణల చట్టం విషయంలో కేంద్ర ప్రభుత్వ తీరుపై సుప్రీంకోర్టు అసంతృప్తి
చట్టంలో కీలక నిబంధనలను కొట్టివేస్తూ తీర్పు
గతంలోనూ కేంద్రంపై జస్టిస్ గవాయ్ ఫైర్
న్యూఢిల్లీ, నవంబరు 19: కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ట్రైబ్యునళ్ల సంస్కరణల చట్టం-2021ను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సర్వోన్నత న్యాయస్థానం బుధవారం కీలక తీర్పు వెలువరించింది. ట్రైబ్యునల్ సభ్యులు, ప్రిసైడింగ్ అధికారుల నియామకాలు, పదవీకాలం, సర్వీసు షరతులకు సంబంధించి ఈ చట్టంలోని కొన్ని కీలక నిబంధనలను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం రద్దు చేసింది. అవన్నీ పాతవేనని, చిన్నచిన్న మార్పులతో కేంద్రం వాటిని మళ్లీ ప్రవేశపెట్టిందని పేర్కొంది. చట్టంలో చిన్న చిన్న మార్పులు చేయడం ద్వారా కోర్టు తీర్పులను పార్లమెంటు పక్కనపెట్టడానికి వీల్లేదని వ్యాఖ్యానించింది. కోర్టు వరసగా ఇచ్చిన తీర్పుల అమలు విషయంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు సరికాదంటూ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ‘ట్రైబ్యునళ్ల స్వతంత్రతకు సంబంధించి కోర్టు రూపొందించిన సూత్రాలను కేంద్ర ప్రభుత్వం అమలు చేయకపోగా... వాటిలో స్వల్ప మార్పులు చేసి, చట్టాన్ని అమలు చేయాలనుకోవడం దురదృష్టకరం’ అని జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కె.వినోద్‌చంద్రన్‌ల ధర్మాసనం 137 పేజీల తీర్పులో వ్యాఖ్యానించింది. ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తూ మద్రాస్ బార్ అసోసియేషన్ సహా పలువురు దాఖలు చేసిన పిటిషన్ల విచారణ సందర్భంగా గతంలో కేంద్ర ప్రభుత్వ తీరుపై సీజేఐ జస్టిస్ గవాయ్ తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. కేసు విచారణను విస్తృత ధర్మాసనానికి బదిలీ చేయాలని అటార్నీ జనరల్ అభ్యర్థించగా.. సీజేఐ తీవ్రంగా స్పందించారు. కేసు విచారణ తుది దశలో ఉండగా, ఇలా అడగడమంటే తన బెంచ్ నుంచి తప్పించుకొనే ఎత్తుగడేనని అన్నారు. అనంతరం విచారణను వాయిదా వేయాలని అదనపు సొలిసిటర్ జనరల్ కోరగా.. తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ‘నేను పదవీ విరమణ చేసేవరకు ఈ కేసులో తీర్పు రాకూడదని కోరుకుంటున్నారా?. అటార్నీ జనరల్‌కు చివరి అవకాశం ఇస్తాం. ఆ రోజు రాకపోతే కేసును ముగించేస్తాం’ అని కూడా హెచ్చరించారు. ఈ క్రమంలో బుధవారం ట్రైబ్యునళ్ల సంస్కరణల చట్టం-2021లోని కీలక నిబంధనలను కొట్టివేస్తూ తీర్పు ఇచ్చారు.
ఈ చట్టంలో కేంద్రం తీసుకొచ్చిన కొత్త నిబంధనలు న్యాయవ్యవస్థ స్వతంత్రతతోపాటు అధికార వికేంద్రీకరణ సూత్రాలను ఉల్లంఘించేలా ఉన్నాయని ధర్మాసనం పేర్కొంది. అలాంటి నిబంధనలను తిరిగి ప్రవేశపెట్టాల్సిన అవసరం లేదని సీజేఐ జస్టిస్ బి.ఆర్.గవాయ్ వ్యాఖ్యానించారు. ‘‘కేంద్ర ప్రభుత్వ ఆర్డినెన్స్, 2021 చట్టాన్ని మేం సరిచూశాం. గతంలో కోర్టు రద్దు చేసిన నిబంధనలను స్వల్ప మార్పులతో మళ్లీ అమల్లోకి తెచ్చారు. ఇది రాజ్యాంగ విరుద్ధమే అవుతుంది’’ అని పేర్కొన్నారు. పదవీ కాలం, అధికారుల ప్రయోజనాలను పరిరక్షించడం అనేవి న్యాయవ్యవస్థ స్వతంత్రతలో కీలక అంశాలని స్పష్టం చేశారు. ఈ విషయమై గతంలో న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలను పక్కనపెట్టడానికి వీల్లేదని చెప్పారు. ఈ సందర్భంగా ట్రైబ్యునళ్ల సభ్యుల పదవీకాలాలకు సంబంధించి గతంలో ఇచ్చిన న్యాయపరమైన ఆదేశాలను కోర్టు పునరుద్ధరించింది. ఆదాయపు పన్ను అప్పీలేట్ ట్రైబ్యునల్, కస్ట్సమ్, ఎక్సైజ్, సర్వీస్ ట్యాక్స్ అప్పీలేట్ ట్రైబ్యునల్ సభ్యులు 62 ఏళ్లు వచ్చేవరకు పదవిలో కొనసాగవచ్చని తెలిపింది. ఇక, ట్రైబ్యునళ్ల ఛైర్‌పర్సన్లు/అధ్యక్షుల పదవీ విరమణ వయసు 65 ఏళ్ల వరకు ఉంటుందని వెల్లడించింది.
ఇదీ కేసు..’
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ట్రైబ్యునళ్ల్ల సంస్కరణల చట్టం-2021తో ఫిల్మ్ సర్టిఫికేషన్ అప్పీలేట్ ట్రైబ్యునల్‌తో సహా కొన్ని అప్పీలేట్ ట్రైబ్యునళ్లు రద్దయ్యాయి. వీటితోపాటు పలు ట్రైబ్యునళ్ల జ్యుడీషియల్, ఇతర సభ్యుల నియామక నిబంధనల్లో పలు సవరణలు జరిగాయి. అయితే, ఈ చట్ట నిబంధనలను సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో మద్రాస్ బార్ అసోసియేషన్ సహా పలువురు పిటిషన్లు దాఖలు చేశారు. దీనిపై గతంలో విచారణ జరిపిన కోర్టు తీర్పును రిజర్వ్ చేసి బుధవారం వెలువరించింది.