Supreme Court: మా ఆదేశాలపై ఇంత నిర్లక్ష్యమా?
ABN , Publish Date - Oct 28 , 2025 | 03:45 AM
వీధికుక్కలు స్వైరవిహారం చేస్తున్నా రాష్ట్రప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని సుప్రీంకోర్టు మండిపడింది. వాటిని ఎక్కడికక్కడ పట్టుకుని..
కుక్కలకు ఇంజక్షన్లు వేయించాలన్నాం
ఆగస్టు 22న ఉత్తర్వులిచ్చాం
అధికారులు పేపర్లు చదవడం లేదా?
3వ తేదీన మా ముందుకు రండి
రాష్ట్రాల సీఎ్‌సలకు సుప్రీంకోర్టు ఆదేశం
న్యూఢిల్లీ, అక్టోబరు 27 (ఆంధ్రజ్యోతి): వీధికుక్కలు స్వైరవిహారం చేస్తున్నా రాష్ట్రప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని సుప్రీంకోర్టు మండిపడింది. వాటిని ఎక్కడికక్కడ పట్టుకుని.. స్టెరిలైజ్ ఇంజక్షన్లు చేసి విడిచిపెట్టాలని, దీనిపై అఫిడవిట్లు దాఖలుచేయాలని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతా(యూటీ)లకు ఆగస్టు 22న ఆదేశాలు జారీచేస్తే.. తమిళనాడు, బెంగాల్, ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ తప్ప మిగతా రాష్ట్రాలు, యూటీలేవీ ఇంతవరకు అఫిడవిట్లు వేయకపోవడాన్ని ఆక్షేపించింది. ఆ మిగతా రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులంతా వచ్చే నెల 3వ తేదీన జరిగే విచారణ సందర్భంగా తమ ముందు హాజరుకావాలని ఆదేశించింది. జంతువుల జనన నియంత్రణ (ఏబీసీ) నిబంధనలకు అనుగుణంగా కుక్కల షెల్టర్లు, అందుబాటులో ఉన్న వెటర్నరీ డాక్టర్లు, కుక్కలు పట్టే సిబ్బంది, ప్రత్యేక వాహనాలు, బోన్లు తదితర వివరాలతో అఫిడవిట్ దాఖలుచేయాలని రాష్ట్రాలు, యూటీల పురపాలక అధికారులను ఆగస్టు 22న ఆదేశించింది. ఈ ఆదేశాలు జారీచేశాక కూడా పలు చోట్ల వీధికుక్కల దాడులు జరిగాయని తెలిపింది. ‘గత నెలలో మహారాష్ట్రలోని పుణేలో ఓ చిన్నారిపై దాడిచేశాయి. అంతకు కొన్ని రోజుల ముందు భండారా జిల్లాఓ 20 కుక్కలు ఓ అమ్మాయిపై దాడిచేశాయి. గత వారం కేరళలో కన్నూర్ జిల్లాలో వీధి కుక్కలపై వీధినాటకం ప్రదర్శిస్తున్న వ్యక్తిపైనే దాడిచేశాయి. యూపీలోని లఖ్‌నవూలో ఒకే కుటుంబంలో ముగ్గురిని కరిచాయి. గత 48 గంటల్లో తెలంగాణలోని వరంగల్‌లో కూడా ఇలాంటి ఘటనే జరిగింది. అయినా రాష్ట్రప్రభుత్వాల నుంచి స్పందన లేదు. దేశంలో నిరంతరం పిల్లలు, వృద్ధులు, మహిళలు.. ఇలా అందరిపై కుక్కలు దాడులు చేస్తుంటే.. విదేశాల్లో మన దేశ ప్రతిష్ఠ దెబ్బతింటోంది. మన దేశాన్ని అంతర్జాతీయంగా చెడుగా చిత్రిస్తున్నారు. ఆగస్టు 22న మేమిచ్చిన ఆదేశాలపై విస్తృతంగా ప్రచారం జరిగింది. రెండు నెలలు గడువిచ్చినా స్పందన లేదు. అధికారులు దినపత్రికలు చదవడం లేదా? సోషల్ మీడియాలో చూడడం లేదా? పేరుపేరునా నోటీసులివ్వాలా’ అని ఆగ్రహం వ్యక్తం చేసింది. కనీసం ఆయా రాష్ర్టాల తరఫు న్యాయవాదులు సైతం విచారణ సమయంలో లేకపోవడంపై ధర్మాసనం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. 3వ తేదీన సీఎ్‌సలు తమ ఎదుట హాజరై వివరణ ఇవ్వకుంటే.. బహిరంగంగా కోర్టు నిర్వహిస్తామని హెచ్చరించింది. 3న అఫిడవిట్ వేస్తామని ఢిల్లీ ప్రభుత్వం తరఫు న్యాయవాది తెలుపగా.. సీఎస్ తమ ముందు హాజరు కావలసిందేనని తేల్చిచెప్పింది. ‘ఆయన అఫిడవిట్ వేస్తే వేయనివ్వండి. కానీ మా ఆదేశాలపై ఎందుకు స్పందించలేదో వివరణ ఇవ్వాల్సిందే. ఆయన రాకుంటే ఖర్చులు విధించడంతో పాటు కఠిన చర్యలు ఉంటాయి’ అని పేర్కొంది. కోర్టు ఆదేశాలు వీధికుక్కల పాలిట మరీ క్రూరంగా ఉన్నాయని ఓ న్యాయవాది ప్రస్తావించగా.. మనుషుల పట్ల క్రౌర్యం గురించి ఏం చెబుతారని ధర్మాసనం నిలదీసింది.