Share News

Supreme Court: యాసిడ్‌ దాడుల కేసులపైనిర్లక్ష్యం వ్యవస్థకే సిగ్గుచేటు

ABN , Publish Date - Dec 05 , 2025 | 02:12 AM

యాసిడ్‌ దాడి కేసుల విచారణలో జాప్యంపై గురువారం సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. 16 ఏళ్లుగా బాధితురాలు న్యాయం కోసం కోర్టుల చుట్టూ తిరుగుతుండడంపై....

Supreme Court: యాసిడ్‌ దాడుల కేసులపైనిర్లక్ష్యం వ్యవస్థకే సిగ్గుచేటు

  • దేశ రాజధానిలోనే 16 ఏళ్ల జాప్యమా?

  • సుప్రీంకోర్టు సీరియస్‌

న్యూఢిల్లీ, డిసెంబరు 4 (ఆంధ్రజ్యోతి): యాసిడ్‌ దాడి కేసుల విచారణలో జాప్యంపై గురువారం సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. 16 ఏళ్లుగా బాధితురాలు న్యాయం కోసం కోర్టుల చుట్టూ తిరుగుతుండడంపై తీవ్రంగా స్పందించింది. ఇది దేశానికే సిగ్గుచేటని, ముమ్మాటికీ వ్యవస్థను అపహాస్యం చేయడమేని వ్యాఖ్యానించింది. ఈ నేపథ్యంలో పెండింగ్‌లో ఉన్న యాసిడ్‌ దాడుల కేసులపై నివేదిక ఇవ్వాలని అన్ని హైకోర్టులను ఆదేశించింది. ఢిల్లీలోని రోహిణి ప్రాంతం కోర్టులో పెండింగ్‌లో ఉన్న యాసిడ్‌ దాడి కేసును దృష్టిలో పెట్టుకొని ఈ వ్యాఖ్యలు చేసింది. ఢిల్లీకి చెందిన షహీన్‌ మాలిక్‌ అనే మహిళపై 2009లో యాసిడ్‌ దాడి జరిగింది. దీనిపై రోహిణీ కోర్టులో కేసు నమోదు కాగా, 2013 వరకు ఎలాంటి విచారణ జరగలేదు. 16 ఏళ్ల తరువాత ప్రస్తుతం తుది దశ విచారణ జరుగుతోంది. తన కేసుపై పోరాటం చేస్తుండడంతో పాటు, యాసిడ్‌ దాడి బాధితులను దివ్యాంగులుగా గుర్తించి, సంక్షేమ పథకాలను వర్తింపజేయాలని కోరుతూ ఆమె ప్రజా ప్రయోజన వ్యాజ్యం కూడా దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సూర్యకాంత్‌, జస్టిస్‌ జోయ్‌మాల్య బాగ్చీల ధర్మాసనం దేశ రాజధానిలోనే ఇంతటి నిర్లక్ష్యం చోటుచేసుకోవడంపై అసహనం వ్యక్తం చేసింది. బాధితురాలు స్వయంగా కోర్టుకు హాజరయి తనకు జరిగిన అన్యాయాన్ని వివరించారు.

ఆమె బాధను విన్న సీజీఐ జస్టిస్‌ సూర్యకాంత్‌ విచారణ జరుగుతున్న తీరుపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ‘‘యాసిడ్‌ దాడి అనేది ఎంతో క్రూరమైన నేరం. ఇటువంటి కేసుల్లోనూ జాప్యమంటే.. ఇది వ్యవస్థను అపహాస్యం చేయడమే. అలాంటి వ్యక్తుల (నిందితుల) పట్ల సానుభూతి ఉండకూడదు. ఇటువంటి క్రూరత్వానికి పాల్పడే వ్యక్తులపై ఈ దేశమూ అంతే నిర్దయతో వ్యవహరించాల్సిన అవసరం ఉంది.’’ అని వ్యాఖ్యానించారు. పెండింగ్‌ కేసుల వివరాలను వచ్చే ఏడాది జనవరి 27లోపు ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ సహా దేశంలోని అన్ని హైకోర్టుల రిజిస్ట్రార్‌ జనరళ్లకు నోటీసులు జారీ చేశారు.

Updated Date - Dec 05 , 2025 | 02:12 AM