Supreme Court: వాహన ప్రమాదాల్లో క్షతగాత్రులకు
ABN , Publish Date - Apr 10 , 2025 | 04:45 AM
వాహన ప్రమాద బాధితులకు నగదు రహిత వైద్యం కల్పించేందుకు పథకం అమలులో జాప్యం చేస్తుండటంపై సుప్రీంకోర్టు కేంద్రంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నెల 28న మంత్రిత్వ శాఖ కార్యదర్శి స్వయంగా హాజరై వివరణ ఇవ్వాలని ఆదేశించింది.

నగదు రహిత వైద్యం ఇంకెప్పుడు: సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ, ఏప్రిల్ 9: వాహన ప్రమాదాల్లో క్షతగాత్రులకు నగదు రహిత వైద్యం అందించేలా పథకాన్ని రూపొందించే విషయంలో కేంద్రం జాప్యం చేస్తుండటంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై వివరణ ఇవ్వాలంటూ కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ కార్యదర్శికి బుధవారం నోటీసులు జారీ చేసింది. జనవరి 8న తామిచ్చిన ఆదేశాలు అమలు చేయకపోవడంపై జస్టిస్ అభయ్ ఎస్ ఓకా, జస్టిస్ ఉజ్జల్ భూయాన్‌లతో కూడిన ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది. ‘‘గతంలో ఇచ్చిన గడువు మార్చి 15తో తీరిపోయింది. అయినా స్పందించలేదంటే ఇది కోర్టు ఆదేశాలను ధిక్కరించడమే కాదు. చాలా ఉపయోగకరమైన చట్టాన్ని అమలు చేయకుండా ఉండటమే’’ అని ధర్మాసనం మండిపడింది. ఈనెల 28న మంత్రిత్వ శాఖ కార్యదర్శి నేరుగా వచ్చి కోర్టులో వివరణ ఇవ్వాలని బెంచ్ ఆదేశించింది.