Share News

Supreme Court: రాష్ట్ర బార్‌ కౌన్సిళ్ల పదవుల్లోమహిళలకు 30శాతం కోటా

ABN , Publish Date - Dec 09 , 2025 | 03:13 AM

రాష్ట్ర బార్‌ కౌన్సిళ్ల పదవుల్లో 30 శాతాన్ని మహిళా న్యాయవాదులకు కేటాయించాలని సోమవారం సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది.......

Supreme Court: రాష్ట్ర బార్‌ కౌన్సిళ్ల పదవుల్లోమహిళలకు 30శాతం కోటా

  • ఎన్నికల ప్రక్రియ ప్రారంభం దృష్ట్యా ఏపీ, తెలంగాణలకు మినహాయింపు

న్యూఢిల్లీ, డిసెంబరు 8: రాష్ట్ర బార్‌ కౌన్సిళ్ల పదవుల్లో 30 శాతాన్ని మహిళా న్యాయవాదులకు కేటాయించాలని సోమవారం సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ ఏడాది ఇంకా బార్‌ కౌన్సిల్‌ ఎగ్జిక్యూటివ్‌ కమిటీల ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కాని రాష్ట్రాల్లో ఈ ఆదేశాలను అమలు చేయాలని తెలిపింది. ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాల్లో మాత్రం నోటిఫికేషన్‌ ప్రకారం ముందుకు సాగవచ్చని స్పష్టం చేసింది. ఒకవేళ తగినంత మంది మహిళా న్యాయవాదులు లేకున్నా, పోటీ చేయడానికి ఇష్టపడకున్నా అలాంటప్పుడు 20 శాతం పదవులను ఎన్నిక ద్వారా, మిగిలిన 10 శాతం పదవులను కోఆప్షన్‌ ద్వారా నియమించుకోవచ్చంటూ వెసులుబాటు కల్పించింది. మహిళలు ముందుకు రానప్పుడు కోఆప్షన్‌ ద్వారా నియమించుకోవచ్చని పేర్కొంది. కోఆప్షన్‌ ద్వారా నియమించేందుకు ప్రతిపాదించే మహిళా న్యాయవాదుల పేర్లను తొలుత కోర్టు ముందు ఉంచాలని తెలిపింది. ఈ మేరకు సీజేఐ జస్టిస్‌ సూర్యకాంత్‌, జస్టిస్‌ బాగ్చీల ధర్మాసనం ఉత్తర్వులిచ్చింది. తొలుత సీనియర్‌ న్యాయవాది, బార్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా (బీసీఐ) చైర్మన్‌ మనన్‌ కుమార్‌ మిశ్ర మాట్లాడుతూ.. గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా బార్‌ కౌన్సిళ్ల ఎన్నికలు కొన్ని రాష్ట్రాల్లో ప్రారంభమయినట్టు చెప్పారు. దీంతో, ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల కావడంతో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, పంజాబ్‌, హరియాణా, ఉత్తరప్రదేశ్‌, బిహార్‌ ఛత్తీ్‌సగఢ్‌ రాష్ట్రాలకు ఈ ఉత్తర్వులను వర్తింపజేయడం సరికాదని సుప్రీంకోర్టు తెలిపింది. ఇక్కడ నామినేషన్లు సమర్పించిన మహిళలు ఉత్సాహంగా పోటీ చేయాలని, మహిళా ప్రాతినిధ్యం ఉండేలా సభ్యులు కూడా ఓట్లు వేయాలని విజ్ఞప్తి చేసింది.

Updated Date - Dec 09 , 2025 | 03:13 AM