Supreme Court: అహ్మదాబాద్ ప్రమాదానికి పైలెట్‌ను నిందించలేం
ABN , Publish Date - Nov 08 , 2025 | 02:07 AM
అహ్మదాబాద్ ఎయిరిండియా విమాన ప్రమాదానికి సంబంధించి.. పైలెట్‌ను నిందించలేమంటూ సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది...
న్యూఢిల్లీ, నవంబరు 7: అహ్మదాబాద్ ఎయిరిండియా విమాన ప్రమాదానికి సంబంధించి.. పైలెట్‌ను నిందించలేమంటూ సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఈ ప్రమాదంలో మరణించిన ప్రధాన పైలెట్ సుమిత్ సభర్వాల్ తండ్రి దాఖలు చేసిన పిటిషన్‌పై శుక్రవారం విచారణ చేపట్టిన ధర్మాసనం.. కేంద్రం, డీజీసీఏలకు నోటీసులు జారీ చేసింది. ఈ ఏడాది జూన్ 12న అహ్మదాబాద్ నుంచి లండన్ బయల్దేరిన ఎయిరిండియా విమానం టేకాఫ్ అయిన కొద్ది క్షణాల్లోనే ఓ భవనంపై కూలిపోవడంతో ప్రధాన పైలెట్ సుమిత్ సహా 260 మంది మృతి చెందారు. దీనిపై కోర్టు పర్యవేక్షణలో స్వతంత్ర దర్యాప్తు జరిపి ప్రమాదానికి కారణాలు తేల్చాలంటూ సుమిత్ తండ్రి పుష్కరాజ్ సభర్వాల్, భారత పైలెట్ల సమాఖ్య సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. వీటిపై విచారణ చేపట్టిన జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్‌మాల్య బాగ్చిల ధర్మాసనం.. ‘ఈ ప్రమాదం జరగడం చాలా దురదృష్టకరం. మీ (పుష్కరాజ్) కుమారుడిని నిందిస్తున్న భారాన్ని మీరు మోయకూడదు. అతడిని ఎవరూ నిందించలేరు. విదేశీ మీడియా నివేదికలపై చింతించాల్సిన అవసరం లేదు. పైలెట్ తప్పిదం కారణంగానే ప్రమాదం జరిగిందని దేశంలో ఎవరూ భావించడం లేదు. ప్రాథమిక దర్యాప్తులో ఇద్దరు పైలెట్ల మధ్య జరిగిన సంభాషణ మాత్రమే బయటికొచ్చింది’ అని పేర్కొంది. దీనిపై స్పందన తెలియజేయాలంటూ కేంద్రం, డీజీసీఏ, ఇతర అధికారులకు ధర్మాసనం నోటీసులు జారీ చేసింది.