వాడని, బయట తిరగని వాహనాలపై పన్ను వేయొద్దు: సుప్రీం
ABN , Publish Date - Sep 01 , 2025 | 06:54 AM
బహిరంగ ప్రదేశాల్లో తిరగని లేదా అసలు వినియోగంలో లేని వాహనాల యజమానులకు మోటారు వాహన పన్ను భారం కాకూడదని సుప్రీం కోర్టు పేర్కొంది. ఆ కాలానికి వారు పన్ను చెల్లించాల్సిన పనిలేదని స్పష్టం చేసింది.
న్యూఢిల్లీ, ఆగస్టు 31: బహిరంగ ప్రదేశాల్లో తిరగని లేదా అసలు వినియోగంలో లేని వాహనాల యజమానులకు మోటారు వాహన పన్ను భారం కాకూడదని సుప్రీం కోర్టు పేర్కొంది. ఆ కాలానికి వారు పన్ను చెల్లించాల్సిన పనిలేదని స్పష్టం చేసింది. 2024 డిసెంబరులో ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన అప్పీల్‌పై సుప్రీం ధర్మాసనం తీర్పు వెలువరించింది. ‘సహజంగా రోడ్లు, హైవేలు వంటి ప్రజా మౌలిక సదుపాయాలున్న పబ్లిక్ ప్లేస్‌ల్లో వాహనాలు వినియోగిస్తున్న వారు దానికోసం పన్ను కట్టాలి. ఒక మోటారు వాహనాన్ని బహిరంగ ప్రదేశాల్లో తిప్పకపోతే, లేదా అసలు వాడుకలో లేకపోతే.. ఆ వ్యక్తి సంబంధిత మౌలిక సదుపాయాల నుంచి ప్రయోజనం పొందుతున్నట్టు కాదు. కాబట్టి ఆ కాలానికి సదరు వ్యక్తిపై మోటారు వాహన పన్ను భారం పడకూడదు’ అని ఆగస్టు 29న ఇచ్చిన తీర్పులో సుప్రీం కోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది.