Supreme Court: వరవరరావు పిటిషన్ స్వీకరణకు సుప్రీంకోర్టు నిరాకరణ
ABN , Publish Date - Sep 20 , 2025 | 04:27 AM
బెయిల్ షరతుల్లో మార్పులు చేయాలంటూ ప్రముఖ కవి వరవరరావు దాఖలు చేసిన పిటిషన్‌ను స్వీకరించేందుకు శుక్రవారం సుప్రీంకోర్టు నిరాకరించింది....
న్యూఢిల్లీ, సెప్టెంబరు 19 (ఆంధ్రజ్యోతి): బెయిల్ షరతుల్లో మార్పులు చేయాలంటూ ప్రముఖ కవి వరవరరావు దాఖలు చేసిన పిటిషన్‌ను స్వీకరించేందుకు శుక్రవారం సుప్రీంకోర్టు నిరాకరించింది. భీమా కోరేగాం అల్లర్ల కేసులో అరెస్టయిన ఆయనకు అనారోగ్య కారణాల దృష్ట్యా గతంలో షరతులతో సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. గ్రేటర్ ముంబయి దాటి బయిటకు వెళ్లాలంటే ముందుగా ట్రయల్ కోర్టు అనుమతి తీసుకోవాలన్నది అందులో ఒకటి. ఈ నిబంధనను సడలించాలని ఆయన పిటిషన్ దాఖలు చేశారు. పరిశీలించిన జస్టిస్ జె.కె.మహేశ్వరి, జస్టిస్ విజయ్ బిష్ణోయ్‌ల ధర్మాసనం దీనిని స్వీకరించడానికి ఇష్టం చూపించలేదు. వరవరరావు తరఫున సీనియర్ న్యాయవాది ఆనంద్ గ్రోవర్ వాదనలు వినిపిస్తూ 85 ఏళ్ల వయసు కావడంతో ఆయన ఆరోగ్యం క్షీణిస్తోందని తెలిపారు. గతంలో ఆయన బాగోగులను భార్య చూసేవారని, ప్రస్తుతం ఆమె హైదరాబాద్‌లో ఉంటున్నారని చెప్పారు. ఆయనను చూసేవారు ఎవరూ లేరని తెలిపారు. కేసు విచారణ ఇప్పట్లో ముగిసే సూచనలు కనిపించడం లేదని అందువల్ల ఆయన ముంబయి దాటి వెళ్లేందుకు అవకాశం కలిగించాలని కోరారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ ‘‘ముంబయిలోనే వైద్యం అందుతుంది. ఆయన ఆరోగ్యంపై ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంటుంది. కావాలనుకుంటే ముంబయిలోని ట్రయల్ కోర్టుకే వెళ్లండి. మాకు ఇంట్రెస్ట్ లేదు’’ అని పేర్కొంది. హైదరాబాద్‌కు ఆయనను తరలించేందుకు తగిన కారణాలు కనిపించడం లేదని అభిప్రాయపడింది. షరతుల్లో మార్పులు చేయడంపై విచారణ జరపలేమని తెలిపింది.