Share News

Supreme Court: రిజర్వేషన్లు 50శాతం దాటొద్దు!

ABN , Publish Date - Nov 18 , 2025 | 04:01 AM

మహారాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు యాభై శాతం దాటరాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఓబీసీ రిజర్వేషన్లకు సంబంధించి గతంలో తాము ఇచ్చిన తీర్పును మహారాష్ట్ర అధికారులు తప్పుగా అన్వయించారని......

Supreme Court: రిజర్వేషన్లు 50శాతం దాటొద్దు!

  • మహారాష్ట్ర స్థానిక సంస్థలపై సుప్రీంకోర్టు

  • తదుపరి విచారణ 19వ తేదీకి వాయిదా

న్యూఢిల్లీ, నవంబరు 17: మహారాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు యాభై శాతం దాటరాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఓబీసీ రిజర్వేషన్లకు సంబంధించి గతంలో తాము ఇచ్చిన తీర్పును మహారాష్ట్ర అధికారులు తప్పుగా అన్వయించారని వ్యాఖ్యానించింది. వచ్చే ఏడాది జనవరిలో నిర్వహించబోయే మహారాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓబీసీ రిజర్వేషన్లు సహా అన్ని రిజర్వేషన్లు యాభై శాతం దాటకుండా చూడాలని జస్టిస్‌ సూర్యకాంత్‌, జస్టిస్‌ జోయ్‌మాల్య బాగ్చీలతో కూడిన ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. బాంటియా కమిషన్‌ సిఫార్సుల మేరకు ఓబీసీ రిజర్వేషన్లను పెంచి అమలు చేయాలని మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో దాన్ని అడ్డుకోవాలంటూ దాఖలైన పిటిషన్లను సోమవారం సుప్రీంకోర్టు విచారించింది. గతంలో మహారాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓబీసీలకు 27 శాతం రిజర్వేషన్లు కల్పించగా సుప్రీంకోర్టు దాన్ని కొట్టేసింది. ఓబీసీ రిజర్వేషన్లను ఖరారు చేయడానికి ‘ట్రిపుల్‌ టెస్ట్‌’ పేరుతో మూడు షరతులు విధించింది. 1) రాష్ట్ర ప్రభుత్వం ఇదే అంశం మీద డెడికేటెడ్‌ కమిషన్‌ ఏర్పాటు చేయాలి. కమిషన్‌ ఓబీసీల వెనుకబాటుతనం మీద ప్రతీ స్థానిక సంస్థ స్థాయిలో విశ్వసనీయమైన డేటాను సేకరించాలి. 2) ఆ డేటా ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం ఓబీసీ కోటాను నిర్ణయించాలి. 3) కోటాను నిర్ణయించే క్రమంలో మొత్తం రిజర్వేషన్లు 50 శాతం దాటకూడదు. సుప్రీంకోర్టు ఆదేశాన్ని అనుసరించి మహారాష్ట్ర ప్రభుత్వం బాంటియా కమిషన్‌ వేసింది. కమిషన్‌ సూచన మేరకు రిజర్వేషన్లు ఖరారు చేసింది. దాన్ని అమలు చేసే క్రమంలో రిజర్వేషన్లు 50 శాతం దాటాయంటూ ఇతరులు వేసిన పిటిషన్లు సుప్రీంకోర్టులో విచారణకు వచ్చాయి. రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్‌ రాజ్యాంగ పరిధిలోనే ఉన్నట్లు ఎలా చెప్పగలరని సుప్రీంకోర్టు మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. రిజర్వేషన్లు 50 శాతం దాటకూడదు కదా? అని రాష్ట్ర ప్రభుత్వం తరఫున వాదిస్తున్న సొలిసిటర్‌ జనరల్‌ జనరల్‌ తుషార్‌ మెహతాకు గుర్తు చేసింది. రేపట్నుంచే నామినేషన్లు మొదలవుతాయని తుషార్‌ మెహతా ప్రస్తావించారు. ఎన్నికల షెడ్యూల్‌పై తమకు అవగాహన ఉందని, దాని పేరుతో రాజ్యాంగ వ్యవస్థలను పలుచన చేయలేమని జస్టిస్‌ సూర్యకాంత్‌ వ్యాఖ్యానించారు.


ముందు 50 శాతానికి మించి రిజర్వేషన్లు ఖరారు చేస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి ప్రాతిపదిక అయిన బాంటియా కమిషన్‌ నివేదికను తాము అధ్యయనం చేయాల్సి ఉందని చెప్పారు. ఎన్నికల ప్రక్రియను అడ్డుకోవడం తమ ఉద్దేశం కాదని, అయితే, 50 శాతం సీలింగ్‌ను దాటితే ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. గతంలో మహారాష్ట్ర అంతటా జనాభా విస్తరణ తీరును పట్టించుకోకుండా 27 శాతం రిజర్వేషన్లను ప్రకటించారని, దాన్ని తాము కొట్టేశామని గుర్తు చేశారు. బాంటియా నివేదికకు ముందు, తర్వాత ఓబీసీ రిజర్వేషన్ల మీద రాష్ట్ర ప్రభుత్వ విధానంలో మార్పును నివేదిక రూపంలో సమర్పిస్తామని తుషార్‌ మెహతా ఽసుప్రీంకోర్టుకు విన్నవించారు. ఏ మార్పులు చేసినా రాజ్యాంగ ధర్మాసనం నిర్దేశించిన 50 శాతం గీత దాటకుండా చూడాల్సిందేనని జస్టిస్‌ సూర్యకాంత్‌ స్పష్టం చేశారు. ‘‘ఎలాగైనా ఎన్నికలు జరిగేలా చూస్తాం కానీ రాజ్యాంగ ధర్మాసనం తీర్పును ఉల్లంఘించేందుకు అనుమతించం’’ అని చెప్పారు. బాంటియా కమిషన్‌ నివేదిక ట్రిపుల్‌ టెస్ట్‌కు లోబడి ఉందా? లేదా చూస్తామని ప్రకటించారు. ఇక్కడ ఓబీసీ రిజర్వేషన్లనే చర్చిస్తున్నప్పటికీ మొత్తం వర్టికల్‌ రిజర్వేషన్లు 50 శాతం దాటడానికి వీల్లేదని జస్టిస్‌ బాగ్చీ తేల్చిచెప్పారు. శుక్రవారం(21వ తేదీ) వరకు విచారణను వాయిదా వేయాలని సొలిసిటర్‌ జనరల్‌ కోరారు. అప్పటికి నామినేషన్ల ప్రక్రియ పూర్తవుతుందని, దాన్ని వాయిదా వేస్తే విచారణను వాయిదా వేస్తామని జస్టిస్‌ సూర్యకాంత్‌ మెలిక పెట్టారు. ఈ మధ్యకాలంలో జరిగే ప్రక్రియ మొత్తం సుప్రీంకోర్టు తుది ఆదేశాలకు లోబడి ఉంటుందని మహారాష్ట్ర ప్రభుత్వం తరఫున సొలిసిటర్‌ జనరల్‌ హామీ ఇచ్చారు. దాంతో విచారణను బుధవారం(19వ తేదీ) వరకు వాయిదా వేశారు. ఇటీవలే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓబీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ జీవో జారీ చేయగా హైకోర్టు జీవోపై స్టే ఇచ్చింది. స్టే నిర్ణయంలో జోక్యం చేసుకోవడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. దాంతో తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు ఆగిపోయాయి.

Updated Date - Nov 18 , 2025 | 04:01 AM