Share News

Supreme Court: ఒకేరోజు, ఒకే అంశంపై..రెండు చోట్ల విచారణా?

ABN , Publish Date - Oct 11 , 2025 | 02:39 AM

తమిళగ వెట్రి కళగం టీవీకే అధినేత విజయ్‌ ప్రచారం సందర్భంగా ఇటీవల కరూర్‌లో జరిగిన తొక్కిసలాట వ్యవహారంపై మద్రాస్‌ హైకోర్టు రెండు బెంచ్‌లు...

Supreme Court: ఒకేరోజు, ఒకే అంశంపై..రెండు చోట్ల విచారణా?

  • రెండు బెంచ్‌ల నుంచి విరుద్ధ ఆదేశాలా?

  • మద్రాస్‌ హైకోర్టుకు సుప్రీం కోర్టు ప్రశ్నలు

చెన్నై, అక్టోబరు 10(ఆంధ్రజ్యోతి): ‘తమిళగ వెట్రి కళగం’ (టీవీకే) అధినేత విజయ్‌ ప్రచారం సందర్భంగా ఇటీవల కరూర్‌లో జరిగిన తొక్కిసలాట వ్యవహారంపై మద్రాస్‌ హైకోర్టు రెండు బెంచ్‌లు చేపట్టిన విచారణల పట్ల సుప్రీంకోర్టు శుక్రవారం ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఒకే అంశంపై, ఒకేరోజు హైకోర్టు రెండు చోట్ల ఎలా విచారణ చేపట్టిందని ప్రశ్నించింది. ఘటన కరూర్‌లో జరిగినందున హైకోర్టు మదురై డివిజన్‌ బెంచ్‌ విచారణ చేపడుతుండగా, అదే అంశంపై మద్రాస్‌ హైకోర్టు సింగిల్‌ జడ్జి ఎలా విచారణ చేపట్టారని అడిగింది. రాజకీయ పార్టీలు ప్రచార సభ నిర్వహించేందుకు ప్రామాణిక నిబంధనలు రూపొందించేలా ఆదేశాలు జారీ చేయాలని అభ్యర్థిస్తే.. సింగిల్‌ జడ్జి ఆ అభ్యర్థనను దాటి సిట్‌ను ఎలా ఏర్పాటు చేశారని ప్రశ్నించింది. సింగిల్‌ జడ్జి ‘సిట్‌’ దర్యాప్తునకు ఆదేశిస్తే, మదురై డివిజన్‌ బెంచ్‌.. పోలీసుల దర్యాప్తులో జోక్యం చేసుకునేందుకు నిరాకరించిందని గుర్తుచేసింది.

కనీసం మా వాదనలు వినలేదు!

కరూర్‌ దుర్ఘటనపై విచారణకు మద్రాస్‌ హైకోర్టు సిట్‌ ఏర్పాటు చేయడాన్ని సవాల్‌ చేస్తూ టీవీకే దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. టీవీకే తరఫున సీనియర్‌ న్యాయవాదులు గోపాల్‌ సుబ్రమణ్యం, ఆర్యమసుందరం వాదనలు వినిపించారు. సింగిల్‌ జడ్జి కనీసం తమ వాదనలు వినకుండా పార్టీకి, విజయ్‌కు వ్యతిరేకంగా తీవ్ర వ్యాఖ్యలు చేశారని పేర్కొన్నారు. అంతేగాక అభ్యర్థనలో లేని విషయాన్ని ప్రస్తావనకు తీసుకువచ్చి సిట్‌ ఏర్పాటు చేశారని వివరించారు. ఘటన జరిగిన వెంటనే విజయ్‌ ఎలాంటి విచారం వ్యక్తం చేయకుండా అక్కడి నుంచి వెళ్లిపోయారన్న హైకోర్టు వ్యాఖ్యలు తప్పని, పరిస్థితులు మరింత దిగజారకుండా పోలీసులు వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోవాలని బలవంతం చేశారని ఆర్యమసుందరం కోర్టుకు తెలిపారు. మరోవైపు, తమిళనాడు ప్రభుత్వం తరఫున సీనియర్‌ న్యాయవాదులు ముకుల్‌ రోహిత్గీ, పి.విల్సన్‌ వాదనలు వినిపించారు. సిట్‌ ఏర్పాటుతో ప్రభుత్వానికి సంబంధం లేదని, అది కేవలం హైకోర్టు నిర్ణయమేనని తెలిపారు.

Updated Date - Oct 11 , 2025 | 02:39 AM