Share News

Supreme Court: అక్కడ ఏదో తప్పు జరుగుతోంది!

ABN , Publish Date - Dec 13 , 2025 | 05:13 AM

తమిళనాడులో జరిగిన కరూర్‌ తొక్కిసలాట ఘటన కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కేసుల లిస్టింగ్‌, విచారణ విషయంలో మద్రాస్‌ హైకోర్టులో....

Supreme Court: అక్కడ ఏదో తప్పు జరుగుతోంది!

  • మద్రాస్‌ హైకోర్టులో కేసుల లిస్టింగ్‌, విచారణకు పాటిస్తున్న నియమాలు ఏంటి?

  • సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

న్యూఢిల్లీ, డిసెంబరు 12: తమిళనాడులో జరిగిన కరూర్‌ తొక్కిసలాట ఘటన కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కేసుల లిస్టింగ్‌, విచారణ విషయంలో మద్రాస్‌ హైకోర్టులో ‘ఏదో తప్పిదం’ జరుగుతోందని వ్యాఖ్యానించింది. కోర్టు అనుసరిస్తున్న నియమాలపై పరిశీలన చేస్తామని జస్టిస్‌ జేకే మహేశ్వరి, జస్టిస్‌ విజయ్‌ బిష్ణోయ్‌ల ధర్మాసనం పేర్కొంది. కేసుల లిస్టింగ్‌, విచారణకు సంబంఽధించి అనుసరిస్తున్న నియమాలపై మద్రాస్‌ హైకోర్టు నుంచి సమాధానం కోరింది. మద్రాస్‌ హైకోర్టు రిజిస్ట్రార్‌ జనరల్‌ అందించిన నివేదిక అనంతరం సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ మేరకు వ్యాఖ్యలు చేసింది. విజయ్‌ నేతృత్వంలోని టీవీకే పార్టీకి చెందిన కేసులో మద్రాస్‌ హైకోర్టు రిజిస్ట్రార్‌ను ఇంప్లీడ్‌ చేస్తూ నోటీసులు జారీచేసింది. కరూర్‌ తొక్కిసలాట ఘటనపై సిట్‌ ఏర్పాటుపై మద్రాస్‌ హైకోర్టు ఆదేశాలు ఇవ్వడాన్ని సవాల్‌ చేస్తూ విజయ్‌ పార్టీ సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. దీనిపై అంతకుముందు విచారణ సందర్భంగా సర్వోన్నత న్యాయస్థానం మద్రాస్‌ హైకోర్టు చెన్నై బెంచ్‌ తీరుపై కీలక ప్రశ్నలు, అభ్యంతరాలు లేవనెత్తింది. రోడ్‌షోలు నిర్వహించడానికి మార్గదర్శకాలు కోరుతూ పిటిషన్‌ దాఖలైతే.. సిట్‌తో దర్యాప్తు చేయాలని ఆదేశించడాన్ని తప్పుబట్టింది. అంతేకాకుండా ఈ ఉత్తర్వులు అంతకుముందు సీబీఐ దర్యాప్తునకు మదురై బెంచ్‌ తిరస్కరిస్తూ ఇచ్చిన తీర్పునకు విరుద్ధమని పేర్కొంది. కరూర్‌ తొక్కిసలాట ఘటనపై ఒకే హైకోర్టుకు చెందిన రెండు బెంచ్‌ల నుంచి విరుద్ధమైన తీర్పులు రావడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. సమగ్ర నివేదిక ఇవ్వాలని హైకోర్టును ఆదేశించింది.

Updated Date - Dec 13 , 2025 | 05:13 AM