Supreme Court Orders Removal of Stray Dogs: జనసమ్మర్థ ప్రాంతాల్లో వీధి కుక్కలు కనపడొద్దు!
ABN , Publish Date - Nov 08 , 2025 | 02:12 AM
వీధి కుక్కల నియంత్రణ వ్యవహారంలో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. పౌరుల భద్రత, చిన్నారులు, వృద్థులు, అనారోగ్యానికి గురైన వారి రక్షణకు అత్యంత ప్రాధాన్యంఇస్తూ....
ఆస్పత్రులు, బస్టాండ్లు, రైల్వే స్టేష్టన్లు, విద్యాసంస్థలు, క్రీడా ప్రాంగణాల్లో జాడ ఉండొద్దు
2 వారాల్లో ఆ ప్రాంతాల్లో ఫెన్సింగ్ వేయండి
అక్కడి కుక్కల్ని స్టెరిలైజ్ చేసి షెల్టర్లకు తరలించండి
అమలుపై సీఎ్‌సలు 3 వారాల్లో నివేదిక ఇవ్వాలి
రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
న్యూఢిల్లీ, నవంబరు 7 (ఆంధ్రజ్యోతి): వీధి కుక్కల నియంత్రణ వ్యవహారంలో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. పౌరుల భద్రత, చిన్నారులు, వృద్థులు, అనారోగ్యానికి గురైన వారి రక్షణకు అత్యంత ప్రాధాన్యంఇస్తూ దేశంలోని అన్ని రాష్ట్రాలకు మార్గదర్శకాలు జారీ చేసింది. విద్యాసంస్థలు, బస్‌స్టేషన్లు, రైల్వే స్టేషన్లు, క్రీడా సముదాయాలు, ఇతర బహిరంగ ప్రదేశాల నుంచి వీధి కుక్కలను షెల్టర్లకు తరలించాలని ఆదేశించింది. వీధి కుక్కలను పట్టుకుని సంతానోత్పత్తి నియంత్రణ శస్త్రచికిత్స చేసిన తర్వాత కూడా తిరిగి అదే ప్రదేశంలో వదిలి పెట్టరాదని ఆదేశించింది. అలాగే, జాతీయ రహదారులు, ఎక్స్‌ప్రెస్ వేలపై పశువుల విచ్చలవిడి సంచారంపైనా సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. ఆలనా పాలనా లేకుండా రోడ్లపై సంచరించే పశువులను తక్షణమే గోశాలలకు తరలించాలని ఆదేశించింది. రాష్ట్ర ప్రభుత్వాలు, జాతీయ రహదారుల శాఖ, స్థానిక సంస్థలు, హైవే గస్తీ బృందాలు పకడ్బందీగా ఈ ఆదేశాలను అమలు చేయాలని స్పష్టం చేసింది. తమ ఆదేశాలను అమలు చేయడంలో విఫలమైతే రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించింది. దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన వీధి కుక్కల నియంత్రణకు సంబంధించి జస్టిస్ విక్రమ్‌నాథ్, జస్టిస్ సందీప్ మెహతా, జస్టిస్ ఎన్‌వీ అంజారియాలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం శుక్రవారం కీలక ఉత్తర్వులు జారీ చేసింది.
ప్రతి మూడు నెలలకు ఒకసారి తనిఖీ చేయండి
దేశవ్యాప్తంగా కుక్కకాటు ఘటనలు ఆందోళనకరంగా మారాయని ధర్మాసనం ఆందోళన వ్యక్తం చేసింది. ప్రజల భద్రతే తమకు ముఖ్యమని తేల్చి చెప్పింది. ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థలు, ఆస్పత్రులు, ప్రజా క్రీడా సముదాయాలు, బస్టాండ్‌లు, డిపోలు, రైల్వేస్టేషన్లను గుర్తించాలని రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. రెండు వారాల్లో ఈ ప్రక్రియను పూర్తి చేసి వీధి కుక్కలు చొరబడకుండా పకడ్బందీగా ఫెన్సింగ్ లేదా ఇతర భద్రతా ఏర్పాట్లు చేయాలని స్పష్టం చేసింది. స్థానిక మున్సిపాలిటీలు, పంచాయతీలు ఆయా ప్రాంగణాల నుంచి వీధి కుక్కలను తక్షణమే పట్టుకోవాలని చెప్పింది. యానిమల్ బర్త్ కంట్రోల్(ఏబీసీ) నిబంధనల ప్రకారం వాటికి వ్యాక్సినేషన్, స్టెరిలైజేషన్ చేయించాలని ఆదేశించింది. స్టెరిలైజేషన్ తర్వాత తిరిగి అదే ప్రాంతంలో వదిలి పెట్టకూడదని స్పష్టం చేసింది. వాటిని తప్పకుండా షెల్టర్ హోంలకు తరలించాల్సిందేనని చెప్పింది. జాతీయ రహదారులు, ఎక్స్‌ప్రె్‌సవేలు, ఇతర ప్రధాన రహదారులపై సంచరించే పశువులను గోశాలలకు లేదా షెల్టర్ హోంలకు తరలించాలని, వాటికి పునరావాసం కల్పించాలని తెలిపింది. దీనికోసం ప్రత్యేకంగా ‘హైవే పెట్రోల్’ బృందాలు, ఫిర్యాదుల కోసం హెల్ప్‌లైన్ నంబర్లను ఏర్పాటు చేయాలని ఆదేశించింది. ప్రతి మూడు నెలలకు ఒకసారి అధికారులు నిర్దేశిత జన సమర్థ ప్రాంతాలను తనిఖీ చేసి, అక్కడ కుక్కలు లేవని నిర్థారించుకోవాలని తెలిపింది. కుక్కలను తొలగిస్తే కొత్త కుక్కలు ఆ ప్రదేశాన్ని ఆక్రమిస్తాయని, ఇది ఏబీసీ నిబంధనలకు విరుద్థమంటూ లేవనెత్తిన అభ్యంతరాలను ధర్మాసనం పరిగణనలోకి తీసుకోలేదు. తమ ఆదేశాలు అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులదేనని మరోసారి స్పష్టం చేసింది. ఫెన్సింగ్, తనిఖీలపై మూడు వారాల్లోగా, రోడ్లపై పశువుల తొలగింపుపై ఎనిమిది వారాల్లోగా అన్ని రాష్ట్రాల ప్రభుత్వ కార్యదర్శులు సమగ్ర నివేదికలు దాఖలు చేయాలని ఆదేశించింది.