Supreme Court Orders: ఆరావళిపై మరింత అధ్యయనం
ABN , Publish Date - Dec 30 , 2025 | 04:02 AM
దేశంలోనే అత్యంత పురాతనమైనఆరావళి పర్వతాలకు సరికొత్త నిర్వచనం ఇస్తూ గత నవంబరు 20వ తేదీన ఇచ్చిన తన సొంత తీర్పును సుప్రీంకోర్టు నిలుపుదల చేసింది..
నవంబరు 20 నాటి తీర్పును నిలిపేసిన సుప్రీం
న్యూఢిల్లీ, డిసెంబరు 29: దేశంలోనే అత్యంత పురాతనమైనఆరావళి పర్వతాలకు సరికొత్త నిర్వచనం ఇస్తూ గత నవంబరు 20వ తేదీన ఇచ్చిన తన సొంత తీర్పును సుప్రీంకోర్టు నిలుపుదల చేసింది. ఆరావళి పర్వతాల ఎత్తు, శ్రేణిపై ప్రభుత్వం నియమించిన కమిటీ నివేదికలోనూ.. దానిపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులోనూ మరింత స్పష్టత అవసరమని సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని సెలవు కాల ధర్మాసనం సోమవారం అభిప్రాయపడింది. ఆరావళి పర్వతాలకు ఇచ్చిన కొత్త నిర్వచనం, దాని వల్ల ఏర్పడే పర్యావరణ ప్రభావంపై మరింత లోతుగా అధ్యయనం చేసేందుకు నిపుణుల కమిటీని నియమించాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. తదుపరి విచారణను వచ్చే ఏడాది జనవరి 21వ తేదీకి వాయిదా వేసింది. గుజరాత్, హరియాణా, రాజస్థాన్, ఢిల్లీలో విస్తరించిన ఆరావళి పర్వతాల్లో మైనింగ్‌కు అనుమతులు ఇచ్చే అంశంపై స్పష్టత కోసం కేంద్రం గతంలో ఉన్నతాధికారులతో ఓ కమిటీని వేసిన విషయం తెలిసిందే. ఆ కమిటీ తన నివేదికలో ఆరావళిలో 100 మీటర్ల కంటే ఎత్తులో ఉన్నవాటిని మాత్రమే ‘కొండలు’ అని నిర్వచనం ఇచ్చింది. 500 మీటర్ల పరిధిలో ఇలాంటి కొండలు రెండు.. అంతకంటే ఎక్కువ ఉంటేనే దానిని ‘ఆరావళి పర్వత శ్రేణి’ అని పిలవాలని సూచించింది. 100 మీటర్లకంటే తక్కువ ఎత్తులో ఉన్న గుట్టల్లో మైనింగ్‌కు అనుమతి ఇచ్చుకోవచ్చని తెలిపింది. ఈ కమిటీ నివేదికకు సుప్రీంకోర్టు ఆమోదం తెలపటంతో పర్యావరణ వేత్తలు, ప్రతిపక్ష పార్టీలు తీవ్ర ఆందోళన వ్యక్తంచేశాయి. ఈ నిర్వచనం వల్ల ఆరావళి పర్వతాల్లో విచ్చలవిడిగా మైనింగ్‌కు అనుమతులు ఇచ్చే ప్రమాదం ఉందని విమర్శలు వచ్చాయి. దీంతో ఈ అంశాన్ని సుమోటో కేసుగా స్వీకరించిన సుప్రీంకోర్టు.. తన ఆదేశాలను తానే నిలిపివేసింది.