Share News

Supreme Court Orders EC: 65 లక్షల మంది పేర్లు వెల్లడించండి

ABN , Publish Date - Aug 15 , 2025 | 04:11 AM

బిహార్‌లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్‌ఐఆర్‌ డ్రైవ్‌ నిర్వహించి తొలగించిన 65 లక్షల మంది ఓటర్ల్ల ..

Supreme Court Orders EC: 65 లక్షల మంది పేర్లు వెల్లడించండి

  • ఓటర్ల జాబితా నుంచి ఎందుకు తొలగించారు?.. కారణాలు చెప్పండి

  • బిహార్‌లో జాబితా నుంచి తొలగించిన ఓటర్ల విషయంలో ఈసీకి సుప్రీం ఆదేశం

  • 19వ తేదీలోగా ఈసీ వెబ్‌సైట్లలో ప్రచురించాలి

  • బ్లాక్‌డెవల్‌పమెంట్‌/పంచాయతీ ఆఫీసుల్లోనూ నోటీసుబోర్డుపై ఆ జాబితాను అతికించాలి

  • మళ్లీ దరఖాస్తు చేసుకునేవారు సమర్పించే పత్రాల్లో ఒకటిగా ఆధార్‌నూ పరిగణించాలి

  • వెబ్‌సైట్‌లో ప్రచురించే జాబితా.. ఓటర్‌ ఐడీతో వెతుక్కోగలిగేలా ఉండాలి: సుప్రీం ధర్మాసనం

  • బిహార్‌లో తొలగించిన ఓటర్లపై సుప్రీం

న్యూఢిల్లీ, ఆగస్టు 14(ఆంధ్రజ్యోతి): బిహార్‌లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌) డ్రైవ్‌ నిర్వహించి తొలగించిన 65 లక్షల మంది ఓటర్ల్ల పేర్లనూ వెల్లడించాలని సుప్రీం కోర్టు ఎన్నికల కమిషన్‌ను ఆదేశించింది. వారిని ఓటర్ల జాబితా నుంచి ఎందుకు తొలగించారో కారణాలు సైతం స్పష్టం చేయాలని జస్టిస్‌ సూర్యకాంత్‌, జస్టిస్‌ బాగ్చీలతో కూడిన ధర్మాసనం నిర్దిష్ట ఆదేశాలు జారీ చేసింది. ఆ వివరాలను.. జిల్లాలవారీగా సంబంధిత జిల్లా ఎన్నికల అధికారుల వెబ్‌సైట్లతోపాటు, బిహార్‌ ఎన్నికల ప్రధాన అధికారి వెబ్‌సైట్‌లో కూడా ఆగస్టు 19లోగా ప్రచురించాలని సూచించింది. ఏ ఓటరును ఎందుకు తొలగించారనే విషయాన్ని.. ఓటర్‌ ఐడీ నంబర్ల సాయంతో తెలుసుకునేలా ఆ డాక్యుమెంట్లు ఉండాలని సుప్రీం తన ఆదేశాల్లో పేర్కొంది. ఎవరైనా ఓటర్ల జాబితాలో తమ పేరు మళ్లీ చేర్చాలంటూ దరఖాస్తు సమర్పించేటప్పుడు.. వారు గుర్తింపు పత్రంగా ఆధార్‌కార్డును కూడా సమర్పించవచ్చని పేర్కొంటూ పేపర్లలో, ఎలకా్ట్రనిక్‌, సోషల్‌ మీడియాలో బహిరంగ నోటీసులు ఇవ్వాలని సూచించింది. ఓటు హక్కుకు సంబంధించి.. ఆమోదించతగ్గ 11 పత్రాల్లో ఆధార్‌ కార్డును కూడా చేర్చాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను వచ్చే బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు.


రాజకీయ పార్టీలకు ఇచ్చాం..

జాబితా నుంచి తొలగించిన ఓటర్ల వివరాలను బూత్‌ల స్థాయిలో రాజకీయ పార్టీల ఏజెంట్లకు ఇప్పటికే ఇచ్చామని ఈసీ తరఫున వాదనలు వినిపించిన రాకేశ్‌ ద్వివేది గురువారం కోర్టుకు తెలపగా.. తమ ఓటు ఉందో లేదో తెలుసుకునేందుకు ఓటర్లు రాజకీయ పార్టీల దగ్గరికి ఎందుకు వెళ్లాలని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ‘‘ఓటర్లు స్థానిక రాజకీయ పార్టీల చుట్టూ తిరగాల్సిన అవసరం లేని యంత్రాంగం మీ వద్ద లేదా? ఇంటర్‌నెట్‌ ద్వారా మీరు ఈ పని ఎందుకు చేయకూడదు?’’ అని జస్టిస్‌ సూర్యకాంత్‌ ఈసీని ప్రశ్నించారు. దీనికి రాకేశ్‌ ద్వివేదీ.. ఓటర్‌ ఐడీ నంబర్‌తో వెతకడం ద్వారా జాబితాలో తమ పేరు ఉన్నదీ లేనిదీ ఓటర్లు తెలుసుకునే వీలుందని జవాబిచ్చారు. దీనికి ధర్మాసనం.. తొలగించినవారి పేర్ల జాబితానే ఎందుకు పెట్టకూడదని ప్రశ్నించింది. ‘‘చనిపోయిన/ఒకచోటు నుంచి మరోచోటుకు వెళ్లిపోయిన/రెండుచోట్ల ఉన్నవారి పేర్లనుఎందుకు పెట్టరు?’’ అని జస్టిస్‌ బాగ్చీ అడిగారు. ‘‘మీరు ఆ వివరాలను బహిరంగపరిస్తే.. ఈసీ మీద ఉన్న అభిప్రాయాలు మారుతాయి’’ అని జస్టిస్‌ సూర్యకాంత్‌ అన్నారు. పారదర్శకత వల్ల ఓటర్లలో విశ్వాసం కలుగుతుందన్నారు. ఓటర్ల జాబితాలో లేనివారి పేర్లు కారణాలతో సహా వెల్లడిస్తే ఓటర్లు పరిష్కార చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందని.. కాబట్టి అందరికీ అర్థమయ్యే భాషలో, సామాన్యులకు అనుకూలంగా ఉండే విధంగా.. తొలగించిన వారి పేర్లు వెల్లడించాలని ఆయన స్పష్టం చేశారు. ఉదాహరణకు.. పూనం దేవి అనే మహిళ పేరు తొలగిస్తే.. తన పేరు ఎందుకు తొలగించారో తెలుసుకునేలా ఆ జాబితా ఉండాలని సూచించారు. ఈసీ అప్‌లోడ్‌ చేసే పత్రాలు ‘సెర్చబుల్‌ ఫార్మాట్‌’లో.. అంటే, ఓటరు గుర్తింపు కార్డడ నంబరుతో వెతుక్కోగలిగేలా ఉండాలని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు గోపాల్‌ శంకరనారాయణన్‌, వృందా గ్రోవర్‌ కోరగా జస్టిస్‌ సూర్యకాంత్‌ అందుకు అంగీకరించారు. అయితే, ఆ విధంగా ఓటర్ల జాబితాను ప్రచురించాల్సిన అవసరం లేదంటూ 2018లో కమల్‌నాథ్‌కేసులో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందని రాకేశ్‌ ద్వివేదీ గుర్తుచేయగా.. డాక్యుమెంట్‌ను అలా వెతుక్కోగలిగేలా రూపొందించడం వల్ల ఏ సమస్యా ఉండదని జస్టిస్‌ సూర్యకాంత్‌ స్పష్టం చేశారు.

ఇవీ ఆదేశాలు..

బిహార్‌లో సమగ్ర ఓటర్ల జాబితాకు సంబంధించి సుప్రీంకోర్టు శుక్రవారం జారీ చేసిన ఆరు నిర్దిష్ట ఆదేశాలు..

1)తొలగించిన 65 లక్షల ఓటర్ల పేర్లను జిల్లా ఎన్నికల అధికారుల వెబ్‌సైట్లలో ప్రదర్శించాలి. వారిని ఓటరు జాబితాలో ఎందుకు చేర్చలేదో ఆ కారణాన్ని నిర్దిష్టంగా పేర్కొనాలి. ఓటర్‌ ఐడీకార్డు నంబర్‌ ద్వారా ఈ సమాచారం తెలుకునేలా ఉండాలి.

2) తొలగించిన 65 లక్షల ఓటర్ల పేర్లను వెబ్‌సైట్‌లో ప్రచురించిన విషయాన్ని.. బిహార్‌లోని ప్రాంతీయ వార్తాపత్రికల ద్వారా ప్రజలకు ప్రజలకు తెలిసేలా చేయాలి. టీవీ, రేడియో చానళ్లలో వెల్లడించాలి. జిల్లా ఎన్నికల అధికారులకు.. అధికారిక సోషల్‌ మీడియా ఖాతా ఉంటే దాని ద్వారా కూడా ఈ విషయాన్ని ప్రజల దృష్టికి తీసుకెళ్లాలి.


3) ఆన్‌లైన్‌లోనే కాక ప్రజలకు మాన్యువల్‌గా కూడా అందుబాటులో ఉండేలా.. ఈ 65 లక్షల ఓటర్ల జాబితాను (తొలగింపునకు కారణాలతో సహా) ప్రతి బూత్‌ స్థాయి అధికారీ.. తమ తమ బ్లాక్‌ డెవల్‌పమెంట్‌/పంచాయతీల్లో నోటీస్‌ బోర్డుపై

అతికించాలి.

4) జాబితాలో తమ పేర్లు లేనివారు ఆధార్‌ కార్డు ప్రతితో ఫిర్యాదు చేయవచ్చని బహిరంగ నోటీసుల్లో పేర్కొనాలి.

5) ముసాయిదా జాబితాలో లేనివారి పేర్లతో కూడిన సాఫ్ట్‌కాపీని రాష్ట్ర ఎన్నికల అధికారులకు సమర్పించాలి. ఈ మొత్తం జాబితాను బిహార్‌ సీఈవో వెబ్‌సైట్‌లో ఉంచాలి.

6) వెబ్‌సైట్‌ జాబితాలో పేర్లను ఎపిక్‌ (ఓటర్‌ గుర్తింపు కార్డు) నంబర్‌ ఆధారంగా వెతుక్కోగలిగేలా ఉండాలి.

ఓడితే చెడ్డవి.. గెలిస్తే మంచివట!

రాజకీయ పార్టీలు ఓడిపోయినప్పుడు ఈవీఎంలు చెడ్డవని తిడుతున్నాయని, గెలిచినప్పుడు మాత్రం మంచివే అంటున్నాయని.. తీవ్ర రాజకీయ వైరుధ్యాలున్న వాతావరణంలో తాము పనిచేయాల్సి వస్తోందని.. తాము తీసుకున్న ప్రతి నిర్ణయాన్నీ కోర్టుల్లో సవాల్‌ చేస్తున్నారని ఈసీ తరఫు న్యాయవాది రాకేశ్‌ ద్వివేదీ కోర్టుకు తెలిపారు. ప్రత్యేక సమగ్ర సవరణ సహా కొన్ని నిర్ణయాలు తీసుకునే అధికారం రాజ్యాంగంలోని 324వ అధికరణం కింద తమకు (ఈసీ) ఉందని ఆయన స్పష్టం చేశారు.

ప్రజాస్వామ్యాన్ని రక్షించిన సుప్రీం

  • ఎంపీ చామల కిరణ్‌ కుమార్‌ రెడ్డి

సుప్రీంకోర్టు తీర్పు ప్రజాస్వామ్యాన్ని రక్షించిందని ఎంపీ చామల కిరణ్‌కుమార్‌ రెడ్డి తెలిపారు. ప్రత్యేక సమగ్ర సవరణ పేరుతో భారత ఎన్నికల సంఘం చేస్తున్న దారుణాన్ని తాము తీవ్రంగా ప్రశ్నించామని ఆయన గుర్తుచేశారు. తొలగించిన 65 లక్షల ఓటర్ల పేర్లను, వారిని తొలగించడానికి గల కారణాలను బహిర్గతం చేయాలని రాహుల్‌ డిమాండ్‌ చేస్తున్నారని.. ఇప్పుడు సుప్రీంకోర్టు సైతం అవే ఆదేశాలు ఇచ్చిందని అన్నారు. పార్లమెంటులో దీనిపై చర్చపెట్టాలంటూ రాహుల్‌ నేతృత్వంలో తాము అడుగుతుంటే.. స్పీకర్‌ వాయిదాలతో కాలం గడుపుతున్నారని మండిపడ్డారు. కానీ, సుప్రీంకోర్టు సరైన తీర్పు ఇచ్చిందన్నారు. రాజ్యాంగబద్ధంగా స్వతంత్రంగా పనిచేయాల్సిన ఎన్నికల కమిషన్‌ ప్రలోభాలకు గురైతే తీరని నష్టం జరుగుతుందని, ఇది కేవలం కాంగ్రెస్‌ పార్టీ సమస్య కాదని, దేశంలోని ప్రతి పౌరుడూ ప్రశ్నించాల్సిన అంశమని పేర్కొన్నారు.

Updated Date - Aug 15 , 2025 | 04:11 AM