Supreme Court: వారి వివరాలు ఇవ్వండి
ABN , Publish Date - Oct 08 , 2025 | 03:49 AM
బిహార్ తుది ఓటర్ల జాబితా నుంచి తొలగించిన 3.66 లక్షల మంది ఓటర్ల వివరాలను గురువారంలోగా ఇవ్వాలని సుప్రీంకోర్టు ఎన్నికల కమిషన్‌ను ఆదేశించింది....
బిహార్ తుది ఓటర్ల జాబితా నుంచి తొలగించిన 3.66 లక్షల మంది పేర్లను రేపట్లోగా ఇవ్వండి
చేర్చిన పేర్లు గతంలో తొలగించినవా.. కొత్తవా?
ఆ వివరాలు వెల్లడించి గందరగోళం తొలగించండి
ఎన్నికల కమిషన్‌కు సుప్రీం కోర్టు ఆదేశం
న్యూఢిల్లీ, అక్టోబరు 7: బిహార్ తుది ఓటర్ల జాబితా నుంచి తొలగించిన 3.66 లక్షల మంది ఓటర్ల వివరాలను గురువారంలోగా ఇవ్వాలని సుప్రీంకోర్టు ఎన్నికల కమిషన్‌ను ఆదేశించింది. ముసాయిదా జాబితాతో పోలిస్తే తుది జాబితాలో ఓటర్ల సంఖ్య పెరిగిన విషయాన్ని ప్రస్తావిస్తూ... అందులో చేర్చిన పేర్లు గతంలో తొలగించినవా లేక కొత్త ఓటర్లవా అని ప్రశ్నించింది. ఈ విషయంలో గందరగోళం నెలకొందని, దాన్ని తొలగించాలంటే కొత్తగా చేర్చిన పేర్లను వెల్లడించాలని కూడా స్పష్టం చేసింది. బిహార్‌లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్)ను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్‌మాల్యా బాగ్చీల ధర్మాసనం మంగళవారం విచారణను కొనసాగించింది. ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత ముఖ్యమని, ముసాయిదా ఓటర్ల జాబితా నుంచి తొలగించిన 65 లక్షల మంది వివరాలను కూడా సంబంధిత కార్యాలయాల్లో ఓటర్లకు అందుబాటులో ఉంచాలని ఆదేశించిన విషయాన్ని గుర్తుచేసింది. కాగా, తుది జాబితాలో చేర్చిన పేర్లు చాలావరకు కొత్త ఓటర్లవేనని ఈసీ తరఫున న్యాయవాది రాకేశ్ ద్వివేది తెలిపారు. తొలగించిన ఓటర్ల నుంచి ఇప్పటివరకు ఎలాంటి ఫిర్యాదులు రాలేదన్నారు. ఎన్నికల కమిషన్ ఆగస్టు 1న బిహార్ ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రచురించింది. ఎస్‌ఐఆర్ అనంతరం వివిధ కారణాలతో 65 లక్షల పేర్లను తొలగించామని, రాష్ట్రంలో మొత్తం ఓటర్ల సంఖ్య 7.24 కోట్లుగా పేర్కొంది. ఎస్‌ఐఆర్‌కు ముందు రాష్ట్రంలో ఓటర్ల సంఖ్య 7.89 కోట్లుగా ఉంది. ఓట్ల తొలగింపుపై ప్రతిపక్షాల నుంచి నిరసనలు వెల్లువెత్తాయి. పలువురు సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. తొలగించిన ఓటర్ల వివరాలను వెల్లడించాలని కోర్టు ఆదేశించింది. ఎన్నికల కమిషన్ సెప్టెంబరు 30న తుది జాబితాను ప్రకటించింది. ఇందులో 21.53 లక్షల పేర్లను చేర్చగా.. 3.66 లక్షల పేర్లను తొలగించింది. దాంతో ముసాయిదా జాబితాలో కంటే ఓటర్ల సంఖ్య 17.87 లక్షలు పెరిగి.. 7.42 కోట్లకు చేరింది.