Supreme Court on Kangana Ranauts Tweet: రీట్వీట్‌కు మసాలా పెట్టారుగా!
ABN , Publish Date - Sep 13 , 2025 | 03:42 AM
మీరు చేసింది కేవలం ట్వీట్‌ను రీట్వీట్ చేయడం కాదు. దానికి మసాలా జోడించారు అని శుక్రవారం బాలీవుడ్ నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్‌ను ఉద్దేశించి...
కంగనా రనౌత్‌పై సుప్రీంకోర్టు వ్యాఖ్య
క్వాష్ పిటిషన్ ఉపసంహరణ
న్యూఢిల్లీ, సెప్టెంబరు 12: ‘‘మీరు చేసింది కేవలం ట్వీట్‌ను రీట్వీట్ చేయడం కాదు. దానికి మసాలా జోడించారు’’ అని శుక్రవారం బాలీవుడ్ నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్‌ను ఉద్దేశించి సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. తనపై నమోదైన పరువు నష్టం దావాను కొట్టివేయాలని కోరుతూ ఆమె దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై విచారణ సందర్భంగా ఈ వ్యాఖ్య చేసింది. 2020-21లో జరిగిన రైతుల ఉద్యమం సందర్భంగా ఆమె మహీందర్ కౌర్ (73) అనే వృద్ధురాలిని ఉద్దేశించి చేసిన ట్వీట్ వివాదాస్పదమయింది. ఇంతకుముందు పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)కు వ్యతిరేకంగా ఢిల్లీలోని షహీన్‌బాగ్‌లో జరిగిన ఆందోళనలో కూడా కౌర్ పాల్గొన్నారంటూ.. ‘షహీన్‌బాగ్‌లో పాల్గొన్న దాదీ కూడా ఈమే. వంద రూపాయలకు దొరుకుతుంది’ అని ఎక్స్‌లో పోస్టు చేశారు. అయితే, తానెప్పుడూ షహీన్‌బాగ్ ఉద్యమంలో పాల్గొనలేదని పేర్కొంటూ మహీందర్ కౌర్ కంగనపై పరువు నష్టం దావా వేశారు. దీనిని కొట్టివేయాలని కోరుతూ కంగనా దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌ను కింది కోర్టులు అంగీకరించకపోవడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కంగన తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ ‘షహీన్‌బాగ్‌లో పాల్గొన్న దాదీ కూడా ఈమే’ అంటూ తొలుత ఒకరు చేసిన ట్వీట్‌ను చాలా మంది రీట్వీట్ చేశారని, కంగనా కూడా రీట్వీట్ చేశారని చెప్పారు. దీనిపై జస్టిస్ మెహతా స్పందిస్తూ రీట్వీట్‌లో ‘వంద రూపాయలకు దొరుకుతంద’ంటూ మసాలా జోడించారని, అదే ఇప్పుడు పరువు నష్టానికి కారణమైందని తెలిపారు.