Share News

Supreme Court: అనాథ పిల్లల్లో ఎంతమందికి విద్యను నిరాకరించారు

ABN , Publish Date - Aug 07 , 2025 | 05:50 AM

అనాథ పిల్లలకు విద్యపై సుప్రీం కోర్టు రాష్ట్రాలతో పాటు కేంద్ర ప్రభుత్వానికి పలు ఆదేశాలు జారీ చేసింది. ఉచిత నిర్బంధ విద్యా హక్కు చట్టం-2009 కింద ఎంతమందికి చదువును నిరాకరించారో సర్వే చేసి....

Supreme Court: అనాథ పిల్లల్లో ఎంతమందికి విద్యను నిరాకరించారు

  • ఎందరికి అడ్మిషన్లు ఇచ్చారు

  • డేటాతో అఫిడవిట్‌ దాఖలు చేయండి

  • రాష్ట్రాలకు సుప్రీం కోర్టు ఆదేశం

  • జనాభా లెక్కల్లో అనాథలను చేర్చాలని సూచన

న్యూఢిల్లీ, ఆగస్టు 6: అనాథ పిల్లలకు విద్యపై సుప్రీం కోర్టు రాష్ట్రాలతో పాటు కేంద్ర ప్రభుత్వానికి పలు ఆదేశాలు జారీ చేసింది. ఉచిత నిర్బంధ విద్యా హక్కు చట్టం-2009 కింద ఎంతమందికి చదువును నిరాకరించారో సర్వే చేసి గుర్తించాలని అన్ని రాష్ట్రాలకు స్పష్టం చేసింది. వచ్చే జనాభా లెక్కల్లో అనాథలను కూడా చేర్చేందుకు చర్యలు తీసుకోవాలని కేంద్రానికి సూచించింది. అనాథల సంరక్షణ, రక్షణపై ఆందోళన వ్యక్తం చేస్తూ దాఖలైన పిటిషన్‌ను జస్టిస్‌ బీవీ నాగరత్న, జస్టిస్‌ కేవీ విశ్వనాథన్‌లతో కూడిన ధర్మాసనం బుధవారం విచారించింది. ఉచిత నిర్బంధ విద్యా హక్కు చట్టం ప్రకారం ఎంత మం ది అనాథ పిల్లలకు అడ్మిషన్లు కల్పించారు, అలాగే ఎంతమందికి నిరాకరించారు.. దానికి గల కారణాలేమిటి అనే దానిపై సర్వే చేయాలని రాష్ట్రాలకు ధర్మాసనం నిర్దేశించింది. సర్వే సందర్భంగా అర్హులైన పిల్లలను గుర్తిస్తే సమీ ప పాఠశాలల్లో చేర్చాలని చెప్పింది. ఈ వివరాలన్నింటితో అఫిడవిట్‌ దాఖలు చేయాలని రాష్ట్రాలకు స్పష్టం చేసింది. తమ ఆదేశాలు అమలు చేయడానికి అధికారులకు 4 వారాల గడువు ఇచ్చింది. పాఠశాలల్లో బలహీనవర్గాలకు కేటాయించిన 25 శాతం కోటా సీట్లలో అనాథ పిల్లలకు కూడా స్థానం కల్పించాలంటూ నోటిఫికేషన్‌ జారీ చేసిన గుజరాత్‌, ఢిల్లీ, మేఘాలయ, సిక్కిం రాష్ట్రాలను ప్రస్తావి స్తూ.. అలాంటి నోటిఫికేషన్‌ ఇతర రాష్ట్రాలు కూడా ఇవ్వాలని బెంచ్‌ ఆదేశించింది.


తదుపరి విచారణను సెప్టెంబరు 9కి వాయిదా వేసింది. వచ్చే జనాభా లెక్కల్లో అనాథలకు కూడా చోటు కల్పించేలా కేంద్రాన్ని ఆదేశించాలని విచారణ సందర్భంగా పిటిషనర్‌ కోర్టును అభ్యర్థించారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ.. జనాభా లెక్కల సందర్భంగా అనాథల కోసం కూడా ప్రత్యేక బాక్స్‌ ఉండాలని, అప్పుడు వారి డేటాను సులువుగా పొందవచ్చని సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతాకు సూచించింది. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళతామని ఆయన హామీ ఇచ్చారు. దేశంలో అనాథ పిల్లలు ఎంతమంది ఉన్నారో చెప్పే అధికారిక డేటా కూడా లేదన్నారు. యునిసెఫ్‌ లెక్కల ప్రకారం 2.5 కోట్ల మంది ఉన్నట్లు తెలుస్తోందన్నారు.

Updated Date - Aug 07 , 2025 | 05:50 AM