Share News

Supreme Court: ఆ అధికారంసుప్రీంకు ఉంది

ABN , Publish Date - Sep 11 , 2025 | 04:08 AM

రాష్ట్రపతి, గవర్నర్‌ అధికారాల పరిధిపై సలహా ఇచ్చే అధికారం సుప్రీంకోర్టుకు ఉన్నదని తెలంగాణ సర్కారు సర్వోన్నత న్యాయస్థానంలో వినిపించిన వాదనల్లో పేర్కొంది. ...

Supreme Court: ఆ అధికారంసుప్రీంకు ఉంది

  • రాష్ట్రపతి, గవర్నర్ల అధికారాల పరిధిపై సలహా ఇవ్వొచ్చు

  • బిల్లులను నిరవధికంగా పెండింగ్‌లో ఉంచడం సరికాదు

  • గవర్నర్‌కు విచక్షణాధికారాలు ఇచ్చి రాష్ట్రాల అధికారాలను

  • పలుచన చేయకూడదు: సుప్రీంలో తెలంగాణ సర్కార్‌ వాదన

  • 1970 నుంచి 90ు బిల్లులకు నెలలోపే ఆమోదం

  • 20 బిల్లులకు మాత్రమే గవర్నర్లు ఆమోదం ఇవ్వలేదు

  • ఆర్టికల్‌ 200లోని ‘ఆమోదం నిలిపివేత’.. తాత్కాలికం కాదు

  • గవర్నర్లు కేవలం పోస్టుమ్యాన్లు కారు: ఎస్‌జీ తుషార్‌ మెహతా

న్యూఢిల్లీ, సెప్టెంబరు 10 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రపతి, గవర్నర్‌ అధికారాల పరిధిపై సలహా ఇచ్చే అధికారం సుప్రీంకోర్టుకు ఉన్నదని తెలంగాణ సర్కారు సర్వోన్నత న్యాయస్థానంలో వినిపించిన వాదనల్లో పేర్కొంది. రాష్ట్రపతి, గవర్నర్‌ ఏ బిల్లుకైనా ఆమోదం తెలపకుండా నిరవధికంగా పెండింగ్‌లో ఉంచడం సరైంది కాదని స్పష్టం చేసింది. శాసనసభలు ఆమోదించిన బిల్లులపై రాష్ట్రపతికి, గవర్నర్లకు గడువును విధించడంపై రాష్ట్రపతి లేవనెత్తిన ప్రశ్నలకు సంబంధించి సుప్రీంకోర్టు బుధవారం తన విచారణ కొనసాగించింది. భారత ప్రధాన న్యాయమూర్తి బీఆర్‌ గవాయ్‌, జస్టిస్‌ సూర్యకాంత్‌, జస్టిస్‌ విక్రమ్‌ నాథ్‌, జస్టిస్‌ పీఎస్‌ నరసింహ, జస్టిస్‌ ఏఎస్‌ చందూర్కర్‌లతో కూడిన ధర్మాసనం ఎదుట తెలంగాణ ప్రభుత్వం తరఫున సీనియర్‌ న్యాయవాది నిరంజన్‌ రెడ్డి వాదనలు వినిపించారు. గవర్నర్‌కు విచక్షణాధికారాలు ఇచ్చి రాష్ట్రాల అధికారాలను పలచన చేయడం సరికాదని ఆయన వాదించారు. మంత్రి మండలి సలహా మేరకే గవర్నర్‌ వ్యవహరించాలని ఆర్టికల్‌ 200తో సహా అన్ని అధికరణలూ సూచిస్తున్నాయని నిరంజన్‌ రెడ్డి గుర్తుచేశారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన మంత్రి మండలి.. గవర్నర్‌కు తప్పుడు సలహా ఇచ్చే అవకాశమే లేదని ఆయన చెప్పారు. మంత్రి మండలి సలహా లభించని సమయంలోనే గవర్నర్‌కు కానీ, రాష్ట్రపతికి కానీ విచక్షణాధికారం ఉంటుందని వాదించారు. ఎన్నికల తర్వాత లేదా ఎవరికీ మెజారిటీ రాని సందర్భంలో, మంత్రి మండలి ఉనికిలో లేనప్పుడే గవర్నర్‌, రాష్ట్రపతి వ్యక్తిగత విచక్షణతో వ్యవహరించే అవకాశం ఉందని న్యాయస్థానం కూడా భావించినట్టు ఆయన తెలిపారు. అలాంటి సందర్భాల్లో కాకుండా.. ఎన్నికైన ప్రభుత్వ చట్టబద్ధ నిర్ణయాన్ని అమలు చేయకుండా వీల్లేకుండా నిలిపివేసి, వివక్షను పాటించడం ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగానికి అపకారం చేయడమేనని తెలిపారు. ఉమ్మడి జాబితాలో ఉన్న అంశానికి ఆమోదం తెలపకపోతే కేంద్ర చట్టాలు అమలవుతాయని, అయితే అంత మాత్రాన ఏ ఆమోదమూ తెలపకుండా కొనసాగించడం సరైంది కాదని ఆయన అభిప్రాయపడ్డారు.


ఆ వాదన తప్పు..

కేంద్రం తరఫున వాదనలు వినిపించిన సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా.. 1970 నుంచి రాష్ట్రాల శాసనసభలు పంపిన బిల్లుల్లో 90 శాతం నెలరోజుల్లోపే గవర్నర్ల ఆమోదం పొందాయని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. మొత్తం 17,150 బిల్లులు గవర్నర్ల వద్దకు వస్తే కేవలం 20 సందర్భాల్లో మాత్రమే వారు వాటిపై ఎలాంటి నిర్ణయమూ తీసుకోకుండా పెండింగ్‌లో పెట్టారని తెలిపారు. అందులో ఏడు బిల్లులు.. ఇటీవలికాలంలో తమిళనాడు ప్రభుత్వం రూపొందించనవేనని వెల్లడించారు. గవర్నర్లు కేవలం ‘పోస్టుమ్యాన్‌’లు కారని.. అలా భావిస్తే గవర్నర్ల రాజ్యాంగబద్ధమైన పాత్ర కేవలం అలంకారప్రాయంగా మారుతుందని ఆందోళన వెలిబుచ్చారు. ‘‘గవర్నర్‌ అంటే బుగ్గకార్లు, పెద్ద ఇల్లు ఉండే పోస్టుమ్యాన్‌లాంటివారని వారు వాదిస్తున్నారు. ఈ వాదన రాజ్యాంగపరంగా తప్పు’’ అని పేర్కొన్నారు. ఏదైనా బిల్లు తన వద్దకు వచ్చినప్పుడు ఆర్టికల్‌ 200 ప్రకారం గవర్నర్‌ దానికి ఆమోదం తెలపొచ్చు (లేదా) ఆమోదం నిలిపివేయవచ్చు (లేదా) రాష్ట్రపతి పరిశీలనకు పంపవచ్చు (లేదా) అసెంబ్లీకి తిరిగి పంపొచ్చు అని గుర్తుచేశారు. అయితే.. విపక్ష పాలిత రాష్ట్రాలు ఈ నాలుగు ఆప్షన్లలో ‘ఆమోదం నిలిపివేత’ అనేది తాత్కాలిక ఆప్షన్‌గా భావించి.. ఆ బిల్లును గవర్నర్‌ అసెంబ్లీకి తిప్పి పంపాలనుకుంటున్నాయని.. కానీ ఆ వాదన వల్ల రాజ్యాంగంలో పేర్కొన్న ‘విత్‌హోల్డ్‌ (ఆమోదం నిలిపివేయడం)’ అనే పదమే నిరర్థకం అయిపోతుందని తుషార్‌ మెహతా వాదించారు. గవర్నర్‌ కూడా శాసనవ్యవస్థలో ఒక భాగమని.. ఆయనకు ఓటింగ్‌ హక్కులు లేకపోయినప్పటికీ, ఆర్టికల్‌ 200 ప్రకారం గవర్నర్‌ ఆమోదంతోనే బిల్లులు ఆమోదం పొందుతాయని, శాసనప్రక్రియలో గవర్నర్‌కు కూడా స్థానం ఉంటుందని గుర్తుచేశారు.


‘‘గవర్నర్‌ ప్రభుత్వ అధికారి కాదు. అధికార పక్షం ఏజెంట్‌ కూడా కాదు. గవర్నర్‌ అధికార పార్టీల ఆదేశాల ప్రకారం వ్యవహరించాల్సిన అవసరం లేదు. కొన్ని సందర్భాల్లో ఆయన ఎలాంటి పక్షపాతం లేని తటస్థుడైన మధ్యవర్తిలా ఉండాలి.. ముఖ్యంగా ఏదైనా బిల్లు విషయంలో కేంద్ర, రాష్ట్రాల ప్రయోజనాల మధ్య సంఘర్షణ నెలకొన్నప్పుడు’’ అని తుషార్‌ మెహతా పేర్కొన్నారు. అయితే, 1970 నుంచి ఆమోదం పొందిన, పొందని బిల్లులపై కేంద్రం గణాంకాలు ఇవ్వడంపై రాష్ట్రాల తరఫున వాదనలు వినిపిస్తున్న సీనియర్‌ న్యాయవాదులు కపిల్‌ సిబల్‌, అభిషేక్‌ మనుసింఘ్వి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. గతంలో తాము ఇలాంటి వివరాలను ఇవ్వకుండా అడ్డుకున్నారని.. కాబట్టి ఇప్పుడు కేంద్రాన్ని అనుమతించడం తప్పని వాదించారు. వారి వాదనతో సుప్రీం ధర్మాసనం ఏకీభవించింది. ‘‘వారు ఇలాంటి వివరాలనే ప్రస్తావించాలనుకున్నప్పుడు మీరు అభ్యంతరం తెలపడంతో మేము అందుకు వారిని అనుమతించలేదు. ఇప్పుడు మీకు అందుకు అనుమతి ఇస్తే వారికి అన్యాయం జరిగినట్టు అవుతుంది’’ అని పేర్కొంది. కాగా.. గత 55 ఏళ్లలకే కేవలం 20 బిల్లులనే గవర్నర్లుపెండింగ్‌లో పెట్టారని తుషార్‌ మెహతా చెప్పినప్పుడు.. 2014 తర్వాతే ఇలాంటి వివాదాలు ఎక్కువయ్యాయని కపిల్‌ సిబల్‌ ధర్మాసనానికి తెలిపారు.

Updated Date - Sep 11 , 2025 | 04:08 AM