Supreme Court: పత్రాలను పరిశీలించాకే నిర్ణయం తీసుకోండి
ABN , Publish Date - May 03 , 2025 | 04:40 AM
భారత్‌లోని బెంగళూరులో సాఫ్ట్‌వేర్ కంపెనీలో పనిచేస్తున్న అహ్మద్ తారిక్ భట్ కుటుంబాన్ని పాకిస్థాన్‌కు పంపాలని చేసిన నిర్ణయంపై సుప్రీంకోర్టు ఊరట కల్పించింది. అధికారుల నిర్ణయానికి ముందు వారికి ఇచ్చిన పత్రాలను పరిశీలించాలని ధర్మాసనం ఆదేశించింది.
పాక్‌లో పుట్టి శ్రీనగర్‌లో స్థిరపడ్డ కుటుంబానికి సుప్రీం ఊరట
న్యూఢిల్లీ, మే 2: భారత్‌ను వీడాల్సిన ఓ పాకిస్థానీ కుటుంబానికి సుప్రీంకోర్టు ఊరట కల్పించింది. బెంగళూరులో ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో పనిచేస్తున్న అహ్మద్ తారిక్ భట్, ఆయన కుటుంబ సభ్యులు ఆరుగురిని దేశం విడిచి వెళ్లాలని అధికారులు ఆదేశించారు. భట్ బెంగళూరులో ఉంటుండగా.. ఆయన కుటుంబం జమ్మూకశ్మీరులోని శ్రీనగర్‌లో ఉంటోంది. పహల్గాం ఉగ్రదాడి తర్వాత కేంద్ర ప్రభుత్వం పాకిస్థానీల వీసాలు రద్దు చేసిన సంగతి తెలిసిందే. దీంతో శ్రీనగర్‌కు చెందిన భట్ కుటుంబం కూడా పాకిస్థాన్ వెళ్లిపోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో భట్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఎన్‌కే సింగ్ ధర్మాసనం శుక్రవారం వాదనలు విన్నది. తమవద్ద భారత ప్రభుత్వం ఇచ్చిన ఆధార్, పాన్, ఓటర్ ఐడీతో పాటు పాస్‌పోర్టు ఉన్నాయని భట్ సుప్రీంకోర్టుకు తెలిపారు. స్పందించిన ధర్మాసనం.. ‘‘ఈ కుటుంబాన్ని పాక్ పంపించే అంశంలో అధికారులు నిర్ణయం తీసుకునే ముందు వారు చూపుతున్న పత్రాలను తనిఖీ చేయాలి’’ అని ఆదేశించింది. అధికారుల నిర్ణయంతో సంతృప్తి చెందకపోతే పిటిషనర్లు జమ్మూకశ్మీర్ హైకోర్టును ఆశ్రయించవచ్చని సూచించింది.
ఇవి కూడా చదవండి..