Supreme Court: లాస్ట్ ఓవర్‌లో జోరుగా సిక్సర్లు!
ABN , Publish Date - Dec 19 , 2025 | 03:52 AM
పదవీ విరమణ చేయడానికి ముందు జడ్జీలు వరుసపెట్టి ఆదేశాలు ఇస్తున్న ధోరణి పెరిగిపోతుండడంపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది.....
పదవీ విరమణకు ముందు వరుస ఉత్తర్వులు
అలాంటి ఆదేశాల్లో అవినీతికి ఆస్కారం: సుప్రీం ధర్మాసనం
న్యూఢిల్లీ, డిసెంబరు 18: పదవీ విరమణ చేయడానికి ముందు జడ్జీలు వరుసపెట్టి ఆదేశాలు ఇస్తున్న ధోరణి పెరిగిపోతుండడంపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ఇందులో అవినీతి, నిబంధనల ఉల్లంఘన చోటు చేసుకునే అవకాశం ఉందని సూచనప్రాయంగా తెలిపింది. ఇది బ్యాట్స్‌మన్ లాస్ట్ ఓవర్‌లో సిక్సర్లు కొట్టడంలాంటిదని వ్యాఖ్యానించింది. పదవీ విరమణ చేయడానికి 10రోజుల ముందు మధ్యప్రదేశ్ హైకోర్టు ఫుల్ కోర్టు తనను సస్పెండ్ చేయడాన్ని సవాలు చేస్తూ ఆ రాష్ట్రానికి చెందిన ప్రిన్సిపల్, జిల్లా జడ్జి ఒకరు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. ఆ జిల్లా జడ్జి జారీ చేసిన రెండు జ్యుడీషియల్ ఉత్తర్వులు ప్రశ్నార్థకంగా ఉండడంతో ఫుల్ కోర్టు ఆయనను సస్పెండ్ చేసింది. దీనిని సవాలు చేస్తూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌పై బుధవారం సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్‌మాల్యా బాగ్చీ, జస్టిస్ విపుల్ ఎం పంచోలీల ధర్మాసనం విచారణ జరిపింది. ‘‘పదవీ విరమణకు ముందు ఆయన సిక్సర్లను బాదడం ప్రారంభించారు. ఇది దురదృష్టకరమైన ధోరణి. ఇంతకుమించి వివరించలేం’’ అని అభిప్రాయపడింది. లాస్ట్ ఓవర్‌లో జోరుగా సిక్సర్లు!