Supreme Court: వరుస రోడ్డు ప్రమాదాలు అసమర్థతకు పరాకాష్ఠ
ABN , Publish Date - Nov 11 , 2025 | 02:06 AM
దేశంలో వరుస రోడ్డు ప్రమాదాలు జరుగుతుండడంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఇవి వ్యవస్థలోని వైఫల్యాలకు నిదర్శనం కాదా...
వ్యవస్థ వైఫల్యం కాదా?
టోల్ వసూలు దేనికి? ప్రజల ప్రాణాలు తీయడానికా?
సుప్రీంకోర్టు ఆగ్రహం
తెలంగాణ, రాజస్థాన్‌ల్లో జరిగిన ప్రమాదాలపై సుమోటో విచారణ
న్యూఢిల్లీ, నవంబరు 10 (ఆంధ్రజ్యోతి): దేశంలో వరుస రోడ్డు ప్రమాదాలు జరుగుతుండడంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఇవి వ్యవస్థలోని వైఫల్యాలకు నిదర్శనం కాదా? అని ప్రశ్నించింది. టోల్ వసూలు దేనికి, ప్రజల ప్రాణాలు తీయడానికా? అంటూ అసహనం వ్యక్తం చేసింది. ప్రమాదాలపై రెండు వారాల్లోగా సమగ్ర నివేదిక ఇవ్వాలని నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఎన్‌హెచ్‌ఏఐ), కేంద్రంతోపాటు తెలంగాణ, రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. తెలంగాణ, రాజస్థాన్‌లలో ఇటీవల జరిగిన ఘోర రోడ్డు ప్రమాదాలపై సుప్రీంకోర్టు సుమోటోగా విచారణకు స్వీకరించింది. సోమవారం విచారణ జరిపింది. ఈ సందర్భంగా రోడ్ల నిర్వహణపై కీలక వ్యాఖ్యలు చేసింది. ‘రోడ్ల పరిస్థితి దారుణంగా తయారైంది. నిర్వహణ లోపంతో రోడ్లన్నీ గుంతలమయం అయ్యాయి. రెండు ప్రమాదాల్లో నలభై మంది చనిపోయారు. ఇది ముమ్మాటికీ అసమర్థకు పరాకాష్ఠ కాకపోతే మరేమిటి? ఇది సహించరాని, భరించలేని దారుణం’ అని ఽవ్యాఖ్యానించింది. తెలంగాణలో నవంబర్ 3న హైదరాబాద్ - బీజాపూర్ జాతీయ రహదారి (ఎన్‌హెచ్ -163)పై 20 మంది మరణించిన విషయాన్ని ధర్మాసనం గుర్తు చేసింది. ‘పత్రికల కథనాల ప్రకారం హైవేపై ఉన్న ఓ పెద్ద గుంతను తప్పించే ప్రయత్నంలోనే లారీ అదుపుతప్పి బస్సును ఢీకొట్టింది. ఇది వ్యవస్థ వైఫల్యం కాదా?’ అని ప్రశ్నించింది. ఆ జాతీయ రహదారికి సంబంధించిన భద్రతా ప్రమాణాలు, నిర్వహణ, కాంట్రాక్టర్ల పనితీరుపై తక్షణమే ఆరా తీయాయని ఆదేశించింది. రాజస్థాన్‌లోని ఫలోడి వద్ద 18 మంది మృతికి అక్రమ దాబాలే కారణమని ధర్మాసనం అభిప్రాయపడింది. ‘జాతీయ రహదారుల పక్కన గుర్తింపులేని అక్రమ దాబాలు వెలుస్తున్నాయి. ట్రక్కులు ప్రమాదకర రీతిలో వాటి పక్కనే నిలిపివేస్తున్నారు. దీనివల్లే తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. దీనిని ఎలా నియంత్రిస్తారు?’ అని ప్రశ్నించింది. ఈ రెండు జాతీయ రహదారులు విస్తరించి ఉన్న అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు నోటీసులు జారీ చేసింది. వాటి పరిధిలోని అక్రమ దాబాలు, రోడ్ల వాస్తవ పరిస్థితి, కాంట్రాక్టర్ల నిర్వహణ నిబంధనలపై రెండు వారాల్లో సమగ్ర నివేదిక అందించాలని ఆదేశించింది.