Supreme Court: ఈసీ-పార్టీల మధ్య అనుమానాలు
ABN , Publish Date - Sep 02 , 2025 | 01:43 AM
బిహార్ రాష్ట్రంలో ఓటర్ల జాబితా సవరణ(సర్)పై సందేహాలకు ప్రధాన కారణం రాజకీయ పార్టీలు - ఎన్నికల సంఘం మధ్య నెలకొన్న అనుమానాలేనని సుప్రీం కోర్టు సోమవారం పేర్కొంది.
బిహార్‌లో గందరగోళానికి కారణమిదే : సుప్రీం
సర్ పొడిగింపునకు నిరాకరణ
న్యూఢిల్లీ, సెప్టెంబరు 1 : బిహార్ రాష్ట్రంలో ఓటర్ల జాబితా సవరణ(సర్)పై సందేహాలకు ప్రధాన కారణం రాజకీయ పార్టీలు - ఎన్నికల సంఘం మధ్య నెలకొన్న అనుమానాలేనని సుప్రీం కోర్టు సోమవారం పేర్కొంది. ఆ కార్యక్రమం గడువును పొడిగించేందుకు నిరాకరించింది. ఓటర్లు, రాజకీయ పార్టీలు తమ అభ్యంతరాలు, దరఖాస్తులు ఎన్నికల సంఘానికి అందించడంలో సహకరించేందుకు పారా లీగల్ వలంటీర్లను నియమించాలని బిహార్ న్యాయ సేవల అథారిటీని ఆదేశించింది. ఆధార్ సహా ఎన్నికల సంఘం గుర్తించిన 11 ధ్రువపత్రాలను ఓటర్ల జాబితాలో చేర్పులకు అంగీకరించాలని ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. ఆర్జేడీ, ఏఐఎంఐఎం సర్‌లో ఓటర్లు తమ దరఖాస్తులు, అభ్యంతరాలు సమర్పించడానికి గడువు పొడిగించాలని కోరుతూ సుప్రీంలో పిటిషన్లు దాఖలు చేశాయి. అయితే సర్ గడువు తేదీ సెప్టెంబరు ఒకటవ తేదీతో ముగిసింది.
ఎన్నికల సంఘం సుప్రీంలో తన వాదన వినిపిస్తూ.. సర్ ద్వారా సిద్ధం చేసిన ఓటర్ల జాబితాలో చేర్పులు, తొలగింపులు, సవరణలు, అభ్యంతరాలకు సెప్టెంబరు ఒకటవ తేదీ తర్వాతా దరఖాస్తు చేసుకోవచ్చని వెల్లడించింది. బిహార్ ఓటర్ల జాబితాలో ఉన్న 7.24 కోట్ల మంది ఓటర్లలో 99.5 శాతం మంది సర్‌లో తమ ధ్రువపత్రాలు సమర్పించారని పేర్కొంది. కాగా సర్ ముగింపు రోజు(సెప్టెంబరు 1) సోమవారం 2.17 లక్షలకు పైగా దరఖాస్తులు ఓటర్ల జాబితా నుంచి అనర్హులను తొలగించాలని అందాయి. 36,000కు పైగా దరఖాస్తులు చేర్పులకు అందాయి.