Supreme Court Clears Banu Mushtaq: బాను ముస్తాక్‌కు సుప్రీం గ్రీన్ సిగ్నల్
ABN , Publish Date - Sep 20 , 2025 | 04:13 AM
మైసూరు దసరా ఉత్సవాలను ప్రారంభించేందుకు బుకర్ ప్రైజ్ విజేత బాను ముస్తాక్‌కు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.....
మైసూరు దసరా ఉత్సవాలపై దాఖలైన పిటిషన్ కొట్టివేత
బెంగళూరు, సెప్టెంబరు 19(ఆంధ్రజ్యోతి): మైసూరు దసరా ఉత్సవాలను ప్రారంభించేందుకు బుకర్ ప్రైజ్ విజేత బాను ముస్తాక్‌కు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆమెతో ఉత్సవాలను ప్రారంభించాలని కర్ణాటక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్‌ను ధర్మాసనం కొట్టివేసింది. బెంగళూరుకు చెందిన హెచ్‌ఎ్‌స గౌరవ్ దాఖలు చేసిన పిటిషన్‌ను ద్విసభ్య ధర్మాసనం శుక్రవారం విచారించింది. ఒక మతాన్ని అనుసరించే వ్యక్తి ఇతర మతాలకు సంబంధించిన వేడుకల్లో భాగస్వామ్యం కావడం రాజ్యాంగ హక్కుల ఉల్లంఘన కాదని స్పష్టం చేసింది. ఒక మతానికి సంబంధించిన ధార్మిక కార్యక్రమాలను మరో మతం వారితో ప్రారంభించడం సరికాదని గౌరవ్ తరఫు న్యాయవాదులు వాదించారు. హిందూ మతానికి వ్యతిరేకంగా ఆమె గతంలో వ్యాఖ్యలు చేశారన్నారు. దసరా ఉత్సవాల్లో ఇతర మతాల వారు ఆ పూజలు చేయడం సాధ్యం కాదని తెలిపారు. ఈ సందర్భంగా జోక్యం చేసుకున్న ధర్మాసనం.. 2017లో ప్రముఖ కవి నిస్సార్ అహ్మద్ మైసూరు దసరా ఉత్సవాలను ప్రారంభించినప్పుడు పిటిషనర్ హక్కులు దెబ్బతినలేదా అని ప్రశ్నించింది. రాజ్యాంగ పీఠికను ఒకసారి చదవాలని సూచించింది.