Supreme Court Ruling: రాష్ట్రపతి, గవర్నర్లకుగడువు తగదు
ABN , Publish Date - Nov 21 , 2025 | 03:39 AM
రాష్ట్రపతి, గవర్నర్లకు బిల్లుల ఆమోదంలో గడువు విధించడం తగదని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయి నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం తేల్చి చెప్పింది. రాష్ట్ర ప్రభుత్వాలు పంపిన బిల్లుల ఆమోదంలో గవర్నర్ సొంత విచక్షణతో.....
బిల్లులపై గవర్నర్లు సొంత విచక్షణతో నిర్ణయం తీసుకోవచ్చు
మంత్రి మండలి సలహా పాటించడం తప్పనిసరి కాదు
గవర్నర్లు నిరవధికంగా బిల్లులను తొక్కి పెట్టడం కుదరదు
అయితే అసెంబ్లీకి పంపాలి... లేదంటే ఢిల్లీకి పంపాలి
గడువు మీరితే బిల్లు పాసైనట్లే అనడాన్ని రాజ్యాంగం ఒప్పుకోదు
కారణం లేకుండా పెండింగ్‌లో పెడితే కోర్టులు కలుగజేసుకోవచ్చు
రాష్ట్రపతి, గవర్నర్ల అధికారాలపై సుప్రీం రాజ్యాంగ ధర్మాసనం కీలక తీర్పు
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము లేవనెత్తిన 14 ప్రశ్నలకు సమాధానాలు
న్యూఢిల్లీ, నవంబరు 20 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రపతి, గవర్నర్లకు బిల్లుల ఆమోదంలో గడువు విధించడం తగదని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయి నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం తేల్చి చెప్పింది. రాష్ట్ర ప్రభుత్వాలు పంపిన బిల్లుల ఆమోదంలో గవర్నర్ సొంత విచక్షణతో నిర్ణయం తీసుకోవచ్చని స్పష్టం చేసింది. అయితే, గవర్నర్ ఎటువంటి కారణం చెప్పకుండా నిరవధికంగా ఆలస్యం చేయడం తగదని జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ విక్రమ్‌నాథ్, జస్టిస్ పీఎస్ నరసింహ, జస్టిస్ ఏఎస్ చంద్రశేఖర్ సభ్యులుగా ఉన్న ధర్మాసనం అభిప్రాయ పడింది. అటువంటి సమయంలో సహేతుకమైన సమయంలో నిర్ణయం తీసుకోవాలని గవర్నర్‌ను న్యాయస్థానం ఆదేశించవచ్చని చెప్పింది. రాష్ట్రాల శాసన సభలు ఆమోదించి పంపించిన బిల్లులకు గవర్నర్ సమ్మతి తెలిపే అంశానికి సంబంధించి దేశ అత్యున్నత న్యాయస్థానం గురువారం కీలక నిర్ణయాన్ని వెలువరించింది. రాష్ట్రపతి, గవర్నర్లకు న్యాయస్థానం గడువు విధించడంపై ద్రౌపది ముర్ము రాజ్యాంగంలోని 143వ నిబంధన కింద 14 ప్రశ్నలతో న్యాయ సలహా(ప్రెసిడెన్షియల్ రిఫరెన్స్) కోరిన నేపథ్యంలో సర్వోన్నత న్యాయస్థానం సమాధానమిచ్చింది. 111 పేజీలతో 11 ప్రశ్నలకు సమాధానం ఇస్తూ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. తమిళనాడుకు చెందిన పది బిల్లులను గవర్నర్ తొక్కిపట్టినప్పటికీ అవి ఆమోదం పొందినట్లు పరిగణిస్తున్నామని ఏప్రిల్ 8న సుప్రీంకోర్టు ద్విసభ్య బెంచ్ తీర్పు ఇచ్చింది. ఈ నేపథ్యంలో తీర్పును కేంద్ర ప్రభుత్వం సవాలు చేయకుండా మీకు ఆ అధికారాలు ఉన్నాయా చెప్పండంటూ సుప్రీంకోర్టును రాష్ట్రపతి ద్వారా న్యాయ సలహా కోరింది. దీనికి సమాధానంగా సుప్రీం... రాష్ట్రపతి, గవర్నర్లు తీసుకునే చర్యలు న్యాయస్థానాల పరిశీలనకు అతీతం కాదని చెబుతూనే రాజ్యాంగ అధినేతలకు బిల్లుల ఆమోదం కోసం గడువు విధించడం సరైంది కాదని స్పష్టం చేసింది.
గవర్నర్‌కు రాజ్యాంగపరంగా మూడు ఆప్షన్లు ఉంటాయని సుప్రీంకోర్టు తెలిపింది. అవి...
1) ఒక బిల్లు గవర్నర్ దగ్గరికి వచ్చినప్పుడు అన్నీ పరిశీలించి సమ్మతి తెలియజేయడం.
2) ఏదైనా సహేతుకమైన కారణం చెప్పి బిల్లును రిజర్వ్‌లో పెట్టడం లేదా రాష్ట్రపతికి పంపడం.
3) బిల్లును తిరస్కరించి అసెంబ్లీకి పంపడం
ఈ మూడు ఆప్షన్లు ఎంచుకోవడంలో రాజ్యాంగంలోని 200 నిబంధన కింద గవర్నర్ విచక్షణాధికారాన్ని ఉపయోగిస్తారని, అటువంటి సమయంలో న్యాయస్థానాలు గడువు విధించడం సరికాదని రాజ్యాంగ ధర్మాసనం అభిప్రాయ పడింది. ‘‘బిల్లులకు ఆమోదం తెలిపేటప్పుడు కానీ, ఆమోదాన్ని నిలిపివేసే సమయంలో కానీ గవర్నర్ తన సొంత విచక్షణ ప్రకారం వ్యవహరించవచ్చు. అలాంటి సమయాల్లో మంత్రి మండలి సలహా ప్రకారం నడుచుకోవాల్సిన అవసరం లేదు. అయితే, సుదీర్ఘకాలం వివరించలేని కారణాల వల్ల ఒక బిల్లుపై నిర్ణయం తీసుకోకపోతే సహేతుకమైన సమయంలో నిర్ణయం తీసుకోవలసిందిగా కోర్టు గవర్నర్‌కు పరిమితమైన ఆదేశాలు జారీ చేయవచ్చు. 361 అధికరణ కింద వారికి రక్షణ కవచం ఉన్నప్పటికీ సుదీర్ఘమైన ఆలస్యం జరిగినప్పుడు హేతుబద్థమైన సమయంలో బిల్లులను ఆమోదించేందుకు, తిరిగి పంపేందుకు న్యాయస్థానం ఆదేశాలు జారీ చేయవచ్చు. తన పరిశీలనకు వచ్చిన ప్రతి బిల్లుపై రాష్ట్రపతి రాజ్యాగంలోని 143వ అధికరణం కింద సుప్రీంకోర్టు సలహా కోరనవసరం లేదు. అయితే, ఒక బిల్లుకు ఆమోదం సుదీర్ఘ కాలం తెలపకపోతే దాన్ని ఆమోదించినట్టు భావించాల్సిందేనన్న వైఖరిని రాజ్యాంగం అనుమతించదు. అలాంటి పెండింగ్ బిల్లులను ఆమోదించినట్టే భావించాలని ఆర్టికల్ 142ను అనుసరించి న్యాయస్థానం చెప్పడం కుదరదు. గవర్నర్లు నిరవధికంగా ఒక బిల్లును తమ వద్ద ఉంచుకోరాదు అనేదే ప్రధానం. అందువల్ల పరిమితమైన న్యాయ సమీక్ష ఉండవచ్చు’’ అని రాజ్యాంగ ధర్మాసనం తన ఏకగ్రీవ తీర్పులో అభిప్రాయపడింది. రాజ్యాంగంలో బిల్లును సాధ్యమైనంత త్వరగా ఆమోదించాలని ఉన్నప్పటికీ దాన్ని గవర్నర్లకు, రాష్ట్రపతికి డెడ్‌లైన్ పెట్టేందుకు రాజ్యాంగం ఇచ్చిన అనుమతిగా భావించనక్కరలేదని రాజ్యాంగ ధర్మాసనం స్పష్టం చేసింది. డెడ్‌లైన్ పెట్టి, ఆలోగా ఆమోదం ఇవ్వకపోతే లభించినట్లుగానే భావించడం రాజ్యాంగంలోని అధికారాల విభజన సూత్రానికి భంగం కలిగిస్తుందని తెలిపింది. చట్టసభల ద్వారా నియమితులైన మంత్రివర్గం డ్రైవింగ్ సీటులో కూర్చోవాలనే విషయంలో సుప్రీంకోర్టుకు భిన్నాభిప్రాయమేమీ లేదని చెప్పింది.
రాష్ట్రపతి ప్రశ్నలు- సుప్రీంకోర్టు సమాధానాలు
1) గవర్నర్ దగ్గరకు బిల్లు వచ్చినపుడు ఆయన ముందు ఉండే ఆప్షన్లు ఏమిటి?
ఆమోదించవచ్చు. రాష్ట్రపతి పరిశీలనకు పంపొచ్చు. నిలిపి ఉంచవచ్చు. నిలిపి ఉంచితే ఆర్టికల్ 200లో చెప్పినట్లు తన సూచనలతో తప్పనిసరిగా శాసనసభకు పంపాలి. శాసనసభకు పంపడం అనేది మరో ఆప్షన్ కాదు. నిలిపిఉంచడంలో భాగమే. శాసనసభకు పంపితేనే నిలిపి ఉంచడానికి హేతువు లభిస్తుంది. కాబట్టి ఆమోదించకుండా దగ్గర పెట్టుకోవడం కుదరదు. శాసనసభకు పంపాల్సిందే. పంపకపోవడం సమాఖ్య వ్యవస్థను కించపరచడమే అవుతుంది. సభకు పంపకుండా గవర్నర్ దగ్గర పెట్టుకోవచ్చు అని కేంద్ర ప్రభుత్వం వాదించింది కానీ దాన్ని తిరస్కరిస్తున్నాం. అసెంబ్లీ రెండోసారి ఆమోదించి పంపితే గవర్నర్ తప్పనిసరిగా ఆమోదించాల్సిన పనిలేదు. కానీ, తన దగ్గర ఉంచుకోవడం కుదరదు. రాష్ట్రపతి పరిశీలనకు పంపొచ్చు.
2) గవర్నర్ బిల్లుపై నిర్ణయం తీసుకొనే సమయంలో మంత్రిమండలి సలహాకు కట్టుబడాలా?
సాధారణంగా మంత్రిమండలి సలహా మేరకు నడచుకోవాలి. అయితే, ఆర్టికల్ 200 కింద గవర్నర్‌కు విచక్షణాధికారం ఉంది. అందులో రెండో విభాగంలో ‘‘ఆయన అభిప్రాయంలో’’ అనే ప్రస్తావన ఉంది. కాబట్టి ఒక బిల్లును తిరస్కరించే అధికారం, రాష్ట్రపతి పరిశీలనకు పంపే అధికారం గవర్నర్‌కు ఉంది.
3) గవర్నర్ ఆర్టికల్ 200 కింద విచక్షణ అధికారాన్ని ప్రదర్శించడాన్ని కోర్టులు విచారించగలవా?
లేదు. ఆ విచక్షణాధికారాన్ని న్యాయస్థానాలు విచారించలేవు. తీసుకున్న నిర్ణయాల మంచీచెడును సమీక్షించలేవు. కానీ, సుదీర్ఘకాలం లేదా చెప్పుకోదగ్గ కారణం లేకుండా నిరవధికంగా ఎలాంటి చర్య లేకుండా బిల్లును దగ్గర పెట్టుకుని కూర్చుంటే కోర్టులు తమ అధికారాలను ఉపయోగించి పరిమిత ఆదేశాలు(మాండమస్) జారీ చేయవచ్చు. ఆర్టికల్ 200 కింద విధులు నిర్వర్తించమని గవర్నర్‌కు చెప్పొచ్చు. తగినంత సమయంలో నిర్ణయం తీసుకోవాలని ఆదేశాలు జారీ చేయవచ్చు. ఆ క్రమంలో ఆయన విచక్షణాధికారాల వినియోగంపై ఎలాంటి వ్యాఖ్యలు చేయరాదు.
4) ఆర్టికల్ 200 కింద గవర్నర్ల అధికారంపై న్యాయసమీక్ష విషయంలో కోర్టులకు ఆర్టికల్ 361 శిరోధార్యమా?
అవును. గవర్నర్లు, రాష్ట్రపతి తమ విధుల నిర్వహణలో కోర్టులకు జవాబుదారీ కాదు అని చెబుతున్న ఆర్టికల్ 361 కోర్టులకు శిరోధార్యం. కానీ, గవర్నర్లు ఆర్టికల్ 200 కింద నిర్ణయం తీసుకోవడంలో సుదీర్ఘంగా ఏ చర్యా లేకుండా ఉంటే కోర్టులకు ఉన్న పరిమిత న్యాయసమీక్ష అధికారాన్ని వినియోగించుకోకుండా ఈ 361 ఆర్టికల్ అడ్డుకోలేదు. విధుల నిర్వహణలో గవర్నర్‌కు వ్యక్తిగతంగా రక్షణ ఉంటుంది కానీ ఆయన కార్యాలయం కోర్టు విచారణ పరిధిలోనే ఉంది.
5) గవర్నర్ల విధుల నిర్వహణలో రాజ్యాంగంలో ఎలాంటి కాలపరిమితి లేనపుడు కోర్టులు తీర్పుల ద్వారా కాలపరిమితి నిర్ణయించవచ్చా? అధికారాలను ఎలా ఉపయోగించాలో చెప్పొచ్చా?
6) ఆర్టికల్ 201 కింద రాష్ట్రపతి అధికారాల వినియోగం మీద కోర్టులు తీర్పులు ఇవ్వొచ్చా?
7) రాష్ట్రపతి అధికారాల వినియోగానికి సంబంధించి రాజ్యాంగంలో గడువులు కానీ, ఎలా చేయాలో కానీ చెప్పనపుడు కోర్టు తీర్పుల ద్వారా రాష్ట్రపతికి నిర్దేశించవచ్చా?
(మూడు ప్రశ్నలకు ఒకే సమాధానం) ఆర్టికల్ 200, 201 రూపొందించిన విధానాన్ని చూస్తే రాజ్యాంగాధిపతులకు నిర్ణయాలు తీసుకోవడంలో పరిస్థితులను బట్టి ఎక్కువ సమయం తీసుకొనే వెసులుబాటు కల్పించినట్లే భావించాల్సి ఉంటుంది. సమాఖ్య, ప్రజాస్వామ్య దేశంలో చట్టాలు చేసే క్రమంలో తలెత్తే భిన్న సందర్భాలను, పరిస్థితులు, పర్యవసానాలను దృష్టిలో పెట్టుకొని సమతూకంగా వ్యవహరించాల్సి ఉంటుంది. కోర్టులు నిర్దిష్టమైన గడువులు పెట్టడం రాజ్యాంగం జాగ్రత్తగా ఆలోచించి రాజ్యాంగాధిపతులకు కల్పించిన వెసులుబాటుకు వ్యతిరేకం. గవర్నర్లకైనా, రాష్ట్రపతికైనా అదే వర్తిస్తుంది. కోర్టులు తీర్పులు ఇవ్వజాలవు.
8) గవర్నర్లు బిల్లును పక్కనపెట్టినపుడల్లా లేదా రాష్ట్రపతి పరిశీలనకు బిల్లులు పంపినపుడల్లా రాష్ట్రపతి ఆర్టికల్ 143 కింద సుప్రీంకోర్టును న్యాయసలహా కోరాల్సి ఉంటుందా?
కోరాల్సిన అవసరం లేదు. కారణంపై రాష్ట్రపతి సంతృప్తి చెందితే చాలు.
9) గవర్నర్, రాష్ట్రపతి నిర్ణయం తీసుకొనే దశలో ఉండగా బిల్లుపై కోర్టులు తీర్పులు చెప్పగలవా? చట్టం కాకముందే బిల్లులోని అంశాలపై కోర్టులు నిర్ణయాలు తీసుకోగలవా?
లేదు. చట్టం అమల్లోకి రావడానికి ముందు గవర్నర్లు, రాష్ట్రపతి తీసుకున్న నిర్ణయాలేవీ కోర్టుల పరిశీలన పరిధిలోకి రావు. చట్టంగా మారిన తర్వాత మాత్రమే కోర్టులో సవాలు చేయవచ్చు.
10) రాష్ట్రపతి, గవర్నర్లు జారీచేసే రాజ్యాంగబద్ధ ఆదేశాలకు బదులుగా సుప్రీంకోర్టు ఆర్టికల్ 142 కింద ఆదేశాలు జారీ చేయవచ్చా?
కుదరదు. బిల్లులను నిర్దిష్ట గడువులోగా తేల్చకపోతే ఆమోదం పొందినట్లుగా భావించాలని ఆదేశించే అధికారం ఆర్టికల్ 142 కింద సుప్రీంకోర్టుకు లేదు.
11) గవర్నర్ ఆర్టికల్ 200 కింద ఆమోదం తెలపకుండా అసెంబ్లీ ఆమోదించిన బిల్లు చట్టం అవుతుందా?
పదో ప్రశ్నకు సమాధానంలోనే ఈ విషయం ఉంది. గవర్నర్ ఆర్టికల్ 200 కింద ఆమోదం తెలపకుండా శాసనసభ ఆమోదించిన బిల్లు చట్టం కాబోదు. ఈ ఆర్టికల్ కింద గవర్నర్ అధికారాలను మరో రాజ్యాంగ వ్యవస్థ నెరవేర్చే అవకాశం లేదు.
12) ఏదైనా కేసును విచారిస్తున్నపుడు రాజ్యాంగ నిబంధనలకు వివరణ ఇవ్వాల్సిన పరిస్థితి ఉందని గ్రహిస్తే తీర్పు ఇవ్వకుండా ఆర్టికల్ 143(3) కింద ఐదుగురు జడ్జిల రాజ్యాంగ ధర్మాసనానికి నివేదించాల్సిన బాధ్యత సదరు బెంచ్‌కు లేదా?
రాష్ట్రపతి న్యాయసలహా కోరిన అంశం పరిధిలోని ప్రశ్న కాదు.
13) ఆర్టికల్ 142 కింద సుప్రీంకోర్టుకు సంక్రమించిన అధికారాలు కేవలం ఎట్టి పరిస్థితుల్లోనూ చట్టం అమలయ్యేలా చూడటానికి మాత్రమేనా లేక రాజ్యాంగంలోని నిబంధనల అమలు పద్ధతికి వ్యతిరేకంగా కూడా ఆదేశాలు ఇవ్వవచ్చా?
పదో ప్రశ్న సమాధానంలో దీనికి సమాధానం ఉంది.
14) కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమస్య వచ్చినపుడు ఆర్టికల్ 131 కింద ఒరిజినల్ జ్యూరి్‌సడిక్షన్ హోదాలో సుప్రీంకోర్టు విచారించగలదు. ఇంకా ఏఏ అంశాల అధారంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమస్యల్లో సుప్రీంకోర్టు జోక్యం చేసుకోగలదు?
అప్రస్తుతం కాబట్టి సమాధానం ఇవ్వడం లేదు.
నేపథ్యం
తమిళనాడుకు సంబంధించిన పలు బిల్లులను గవర్నర్ ఆమోదించకుండా తొక్కిపెడుతుండటంతో అక్కడి ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. సహేతుకమైన సమయంలోగా నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు గవర్నర్‌ను ఆదేశించింది. బిల్లులను తొక్కిపట్టే విధానాన్ని తప్పుబట్టింది. అయితే, గవర్నర్ మాత్రం బిల్లులను ఆమోదించడం లేదు. ఈ నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సుప్రీంకోర్టు ద్విసభ్య బెంచ్ ఈ ఏడాది ఏప్రిల్ 8న సంచలన తీర్పు వెలువరించింది. గవర్నర్ రాజ్యాంగ విరుద్ధంగా పది బిల్లులను నిరవధికంగా తొక్కిపట్టారని ప్రకటించింది. రాజ్యాంగ విధుల్లో విఫలయ్యారని, రాజ్యాంగబద్ధ పాలన కూలిపోయే పరిస్థితి కల్పించారని మండిపడింది. బిల్లులు తిప్పిపంపకుండా దగ్గర పెట్టుకోవడం కుదరదని చెప్పింది. తిప్పి పంపిన తర్వాత మళ్లీ శాసనసభ ఆమోదిస్తే గవర్నర్ ఆమోదించాల్సిందేనని స్పష్టం చేసింది. గవర్నర్‌కు పంపిన బిల్లులు ఆమోదం పొందినట్లుగా పరిగణిస్తున్నట్లు తెలిపింది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మే 13న రాష్ట్రపతి ద్వారా సుప్రీంకోర్టును 14 ప్రశ్నలతో న్యాయ సలహా కోరింది. వాటికి సుప్రీంకోర్టు గురువారం సమాధానం ఇచ్చింది. వాదనల సమయంలో ఏప్రిల్ 8 నాటి సుప్రీంకోర్టు తీర్పును తోసిపుచ్చే ఉద్దేశం లేదని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గవాయ్ పదేపదే చెప్పారు. గురువారం నాటి తీర్పు కాపీలోనూ... మరో తీర్పును తోసిపుచ్చేందుకు రాష్ట్రపతి ఆర్టికల్ 143 కింద సలహా కోరడాన్ని ఉపకరణంగా వాడటం కుదరదని పేర్కొంది.
తీర్పు రాసిందెవరు?
రెండు రోజుల్లో పదవీ విరమణ చేయబోతున్న ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ బుధ, గురువారాల్లో రెండు రాజ్యాంగ ధర్మాసనాలకు నేతృత్వం వహించి తీర్పులిచ్చారు. రాష్ట్రపతి న్యాయ సలహా కోరిన అంశంపై గురువారం ఏకాభిప్రాయంతో తీర్పు ఇచ్చినప్పటికీ తీర్పు రచయిత ఎవరో పేర్కొనలేదు. ఇలా చేయడం అసాధారణం. 2019లో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ధర్మాసనం అయోధ్య తీర్పు ఇచ్చినపుడు కూడా అందులో తీర్పు రచయిత పేరు పేర్కొనలేదు. శైలిని బట్టి న్యాయకోవిదులు అందరూ ఇది జస్టిస్ డీవై చంద్రచూడ్ తీర్పు కాపీయేనని అంచనా వేశారు.