Darshan bail cancelled: సుప్రీం కోర్టులో దర్శన్‌కు చుక్కెదురు
ABN , Publish Date - Aug 15 , 2025 | 04:23 AM
చిత్రదుర్గ రేణుకాస్వామి హత్య కేసులో రెండో నిందితుడు, నటుడు దర్శన్ బెయిల్‌ను సుప్రీంకోర్టు రద్దు చేసింది. ..
రేణుకాస్వామి హత్య కేసులో ఏడుగురి బెయిల్ రద్దు
దర్శన్, పవిత్ర గౌడ అరెస్టు
బెంగళూరు, ఆగస్టు 14(ఆంధ్రజ్యోతి): చిత్రదుర్గ రేణుకాస్వామి హత్య కేసులో రెండో నిందితుడు, నటుడు దర్శన్ బెయిల్‌ను సుప్రీంకోర్టు రద్దు చేసింది. న్యాయమూర్తులు జస్టిస్ జేబీ పార్ధివాలా, జస్టిస్ ఆర్.మహదేవన్‌తో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఈ మేరకు గురువారం తీర్పునిచ్చింది. దర్శన్ తొలుత వైద్యం కోసం హైకోర్టు నుంచి బెయిల్ పొందారు. ఆ తర్వాత గతేడాది డిసెంబరు 13న రెగ్యులర్ బెయిల్ లభించింది. దర్శన్‌తో పాటు కేసులో ఎ1 నిందితురాలు పవిత్ర గౌడతో పాటు మరో ఐదుగురు నిందితులు బెయిల్‌పై విడుదలయ్యారు. వీరికి బెయిల్ ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ పోలీసులు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ విచారణ సమయంలో ‘హైకోర్టు చేసిన తప్పిదం మేం చేయబోము’ అని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. హత్య కేసు దర్యాప్తు విధానం, వివరాలను సమగ్రంగా పరిశీలించామని పేర్కొంది. దీంతో దర్శన్ సహా అందరి బెయిల్ రద్దు అవుతుందన్న ప్రచారం జరిగింది. విచారణ జూలై 24న పూర్తి కాగా.. ఆ రోజు తీర్పు రిజర్వు చేసిన సుప్రీం కోర్టు ధర్మాసనం, గురువారం కోర్టు కార్యకలాపాలు ప్రారంభం కాగానే తీర్పు వెలువరించింది. ఎ-1 పవిత్ర గౌడ, ఎ-2 దర్శన్ తూగుదీప్, మరో ఐదుగురి బెయిల్‌ను రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. పరప్పన అగ్రహార జైలులో దర్శన్ విచారణ ఖైదీగా ఉన్నప్పుడు ఆయనకు విలాసవంతమైన సౌకర్యాలు కల్పించిన అధికారులను సస్పెండ్ చేయాల్సిందని ధర్మాసనం వ్యాఖ్యానించింది. నిందితులందరినీ కస్టడీలోకి తీసుకుని త్వరగా దర్యాప్తు పూర్తి చేయాలని ఆదేశించింది. కాగా.. కోర్టు తీర్పుపై రేణుకాస్వామి భార్య సహనా స్పందించారు. తప్పు చేసిన వారికి తగిన శిక్ష పడాలని, కోర్టు న్యాయం చేస్తుందనే నమ్మకం ఉందని అన్నారు. తల్లి రత్నప్రభ స్పందిస్తూ, హత్యకు గురైన తన కుమారుడి విషయంలో న్యాయం లభిస్తుందనే నమ్మకం ఉందని తెలిపారు. బెయిల్ రద్దు పట్ల ఆమె హర్షం వ్యక్తం చేశారు. కాగా, ధర్మాసనం తీర్పునకు కాసేపు ముందు ‘సత్యం అన్నింటికంటే శక్తిమంతమైనది. న్యాయం లభిస్తుంది’ అని ఇన్‌స్టాలో పోస్టు చేసిన పవిత్ర గౌడ, తీర్పు వెలువడిన వెంటనే డిలీట్ చేశారు.
తీర్పు అనంతరం నాటకీయ పరిణామాలు
సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పు వెలువరించిన వెంటనే బెంగళూరు నగర పోలీసులు నిందితులను అరెస్టు చేసేందుకు రంగంలోకి దిగారు. సాయంత్రం 4.30 గంటలకు లొంగిపోతానని, గడువు ఇవ్వాలని దర్శన్ కోరినా పోలీసులు ససేమిరా అన్నారు. దర్శన్ కోసం రాజరాజేశ్వరీనగర్‌లోని ఇంటికి వెళ్లగా అక్కడ లేకపోవడంతో, హొసకెరహళ్లిలోని ఆయన భార్య విజయలక్ష్మి నివాసంలో ఉన్నట్టు గుర్తించారు. తమ నుంచి తప్పించుకుని, కోర్టులో లొంగిపోవాలనే ఆలోచనలో దర్శన్ ఉన్నట్టు సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని ఆయన్ను అరెస్టు చేశారు. అనంతరం అన్నపూర్ణేశ్వరి నగర్ స్టేషన్‌కు, అక్కడి నుంచి బళ్లారి జైలుకు తరలించారు. పవిత్రగౌడను ఆమె ఇంట్లోనే అరెస్టు చేసి, పరప్పన అగ్రహార జైలుకు తరలించారు. మైసూరులో ఉన్న లక్ష్మణ్ నేరుగా పోలీ్‌సస్టేషన్‌కు వెళ్లి లొంగిపోయారు. జగదీష్, అనుకుమార్ చిత్రదుర్గలోని పోలీసుస్టేషన్‌లో లొంగిపోయారు. దర్శన్ మేనేజర్ నాగరాజు కూడా లొంగిపోయారు. మరో నిందితుడు ప్రద్యూష్ కూడా లొంగిపోయేందుకు సిద్ధమైనట్టు సమాచారం.