Share News

Supreme Cour: ప్రాజెక్టులు పూర్తయ్యాకా పర్యావరణ అనుమతులు!

ABN , Publish Date - Nov 19 , 2025 | 04:28 AM

రియల్‌ ఎస్టేట్‌, మైనింగ్‌ తదితర ప్రాజెక్టులకు ఎక్స్‌ పోస్ట్‌ ఫ్యాక్టో పూర్తయ్యా పర్యావరణ అనుమతులు ఇవ్వడాన్ని నిషేధిస్తూ గతంలో జస్టిస్‌ అభయ్‌ ఎస్‌ ఓకా, జస్టిస్‌ ఉజ్జల్‌.....

Supreme Cour: ప్రాజెక్టులు పూర్తయ్యాకా పర్యావరణ అనుమతులు!

  • తీసుకోవచ్చన్న అత్యున్నత న్యాయస్థానం

  • అలా అనుమతించడాన్ని నిషేధిస్తూ గతంలో ఇచ్చిన తీర్పు ఉపసంహరణ

న్యూఢిల్లీ, నవంబరు 18: రియల్‌ ఎస్టేట్‌, మైనింగ్‌ తదితర ప్రాజెక్టులకు ‘ఎక్స్‌ పోస్ట్‌ ఫ్యాక్టో (పూర్తయ్యా)’ పర్యావరణ అనుమతులు ఇవ్వడాన్ని నిషేధిస్తూ గతంలో జస్టిస్‌ అభయ్‌ ఎస్‌ ఓకా, జస్టిస్‌ ఉజ్జల్‌ భుయాన్‌ ధర్మాసనం ఇచ్చిన తీర్పును.. తాజాగా సీజేఐ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం 2:1 మెజారిటీతో ఉపసంహరించింది. ఈ ధర్మాసనంలోనూ ఉన్న న్యాయమూర్తి జస్టిస్‌ ఉజ్జల్‌ భుయాన్‌ మాత్రం తాను గతంలో ఇచ్చిన తీర్పునకే కట్టుబడి ఉన్నారు. మిగతా ఇద్దరు న్యాయమూర్తుల తీర్పుతో ఆయన విభేదించారు. ఎలాంటి అనుమతులూ లేకుండా ప్రాజెక్టులు చేపట్టి.. అవి పూర్తయ్యాక పర్యావరణ అనుమతులు (ఎక్స్‌ పోస్ట్‌ ఫ్యాక్టో) తీసుకుంటామనడం పర్యావరణచట్టానికి విరుద్ధమని ఈ ఏడాది మేలో జస్టిస్‌ అభయ్‌ ఎస్‌ ఓకా, జస్టిస్‌ ఉజ్జల్‌ భయాన్‌ ధర్మాసనం తీర్పునిచ్చింది. దీనికి సంబంధించి.. ‘ముందు కట్టేసినా తర్వాత అనుమతులు ఇస్తాం’ అనే మార్గదర్శకాలతో కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన 2017, 2021 నాటి ఆఫీస్‌ మెమొరాండాలను, ఒక నోటిఫికేషన్‌ను కొట్టివేసింది. భవిష్యత్తులో ఏ ప్రాజెక్టుకూ పోస్ట్‌-ఫ్యాక్టో పర్యావరణ అనుమతులు ఇవ్వరాదని తేల్చిచెప్పింది. అయితే, ఆ తీర్పు వల్ల ఎన్నో ప్రాజెక్టులను కూల్చేయాల్సి వస్తుంది, దీనివల్ల రూ.వేల కోట్ల నష్టం వాటిల్లుతుందని పేర్కొంటూ.. పలు కంపెనీలు సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్‌ వేశాయి. దానిపై సీజేఐ జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌, జస్టిస్‌ ఉజ్జల్‌ భుయాన్‌, జస్టిస్‌ కె.వినోద్‌ చంద్రన్‌లతో కూడిన త్రిసభ్య ధర్మాసనం విచారణ జరిపి.. ఆ తీర్పును రీకాల్‌ చేసింది. 2020లో అలెంబిక్‌ ఫార్మాస్యూటికల్స్‌ లిమిటెడ్‌ కేసును విచారించిన సుప్రీం ద్విసభ్య ధర్మాసనం.. పోస్ట్‌ ఫ్యాక్టో పర్యావరణ అనుమతులు ఇవ్వకూడదని చెప్పినప్పటికీ, అప్పటికే ఇచ్చిన అనుమతులను రద్దు చేయలేదని, జరిమానా వేసి ఆ అనుమతులను క్రమబద్ధీకరించిందని సీజేఐ జస్టిస్‌ గవాయ్‌ తన తీర్పులో గుర్తుచేశారు. అలాగే డాక్టర్‌ స్వామి వర్సెస్‌ కర్ణాటక కాలుష్య నియంత్రణ బోర్డు, ఎలకో్ట్రస్టీల్‌ స్టీల్స్‌ లిమిటెడ్‌ వర్సెస్‌ యూనియన్‌ ఆఫ్‌ ఇండియా, పహ్వా ప్లాస్టిక్స్‌ కేసుల్లో సైతం.. అసాధారణ సందర్భాల్లో పోస్ట్‌ ఫ్యాక్టో అనుమతులు ఇవ్వొచ్చని తీర్పులు వచ్చిన సంగతి గుర్తుచేశారు.


ఈ కేసులు వేటినీ పరిగణనలోకి తీసుకోకుండా వనశక్తి కేసులో ద్విసభ్య ధర్మాసనం తీర్పునిచ్చిందని ఆయన అభిప్రాయపడ్డారు. 2017, 2021లో కేంద్రం జారీ చేసిన ఆఫీస్‌ మెమొరాండాల్లో.. అనుమతించదగ్గ ప్రాజెక్టులకు మాత్రమే పోస్ట్‌ ఫ్యాక్టో అనుమతులు ఇవ్వొచ్చని ఉందని కూడా ఆయన గుర్తుచేశారు. వనశక్తి తీర్పు ప్రకారం అలా ఇవ్వకూడదు కాబట్టి.. కట్టిన నిర్మాణాల్ని కూల్చేయాల్సి వస్తుందని.. దానివ్లల పర్యావరణ కాలుష్యం తగ్గకపోగా మరింత పెరుగుతుందని, అది ప్రజాప్రయోజనాలకు అనుకూలం కాదని సీజేఐ అభిప్రాయపడ్డారు. వనశక్తి కేసులో సైతం ద్విసభ్య ధర్మాసనం.. ‘భవిష్యత్తు ప్రాజెక్టులకు’ పోస్ట్‌ ఫ్యాక్టో అనుమతులు ఇవ్వొద్దని తీర్పునిచ్చింది తప్ప, పోస్ట్‌ ఫ్యాక్టో అనుమతులు పొందిన ప్రాజెక్టులను కూల్చాలని చెప్పలేదని గుర్తుచేశారు. ఆ తీర్పు వల్ల... సాంకేతిక కారణాలతో, కోర్టు మధ్యంతర ఉత్తర్వులతో అనుమతులు పొందలేకపోయిన ప్రాజెక్టులకు తీవ్ర నష్టం వాటిల్లుతుంది కాబట్టి వనశక్తి తీర్పును రీకాల్‌ చేస్తున్నట్టు పేర్కొన్నారు. ఈ అంశాన్ని తగిన బెంచ్‌ ముందుకు పంపించాలని ఆదేశించారు. కాగా.. ధర్మాసనంలోని మిగతా ఇద్దరి (మెజారిటీ) తీర్పుతో విభేదించిన ఉజ్జల్‌ భుయాన్‌.. ముందస్తు పర్యావరణ అనుమతులు తప్పనిసరి అయిన ప్రాజెక్టులకు పోస్ట్‌ ఫ్యాక్టో అనుమతులు ఇవ్వకూడదని, కానీ పలు కేసుల్లో సుప్రీం ధర్మాసనాలు ఆ నిబంధనను అనుసరించకుండా తీర్పునిచ్చాయని పేర్కొన్నారు. ‘‘కాబట్టి అవి వాస్తవాలను, చట్టాలను పరిగణనలోకి తీసుకోకుండా ఇచ్చిన తీర్పులు. తర్వాత అలాంటి కేసులను విచారించే సమానస్థాయి ధర్మాసనాలు ఆ తీర్పులకు కట్టుబడాల్సిన అవసరం లేదు’’ అని ఆయన స్పష్టం చేశారు. అలాగే.. ప్రాజెక్టులను కూల్చివేయడం వల్ల కాలుష్యం మరింత పెరుగుతుందన్న వాదనను కూడా అంగీకరించకూడదని, ఉల్లంఘనలకు పాల్పడిన వారు తమ అక్రమాలను కప్పిపుచ్చుకోవడానికి ఇలాంటి వాదనలను ముందుకు తెస్తారని ఆయన పేర్కొన్నారు.

Updated Date - Nov 19 , 2025 | 04:28 AM