Share News

Supreme Court: జడ్జి అభిశంసనపై దర్యాప్తు కమిటీని స్పీకర్‌ ఏకపక్షంగా ఎలా ఏర్పాటు చేస్తారు?

ABN , Publish Date - Dec 17 , 2025 | 03:50 AM

అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న అలహాబాద్‌ హైకోర్టు జడ్జి జస్టిస్‌ యశ్వంత్‌ వర్మ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది....

Supreme Court: జడ్జి అభిశంసనపై దర్యాప్తు కమిటీని స్పీకర్‌ ఏకపక్షంగా ఎలా ఏర్పాటు చేస్తారు?

  • జస్టిస్‌ వర్మ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన సుప్రీం

న్యూఢిల్లీ, డిసెంబరు 16: అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న అలహాబాద్‌ హైకోర్టు జడ్జి జస్టిస్‌ యశ్వంత్‌ వర్మ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. తనపై వచ్చిన అవినీతి ఆరోపణలపై దర్యాప్తు జరిపేందుకు లోక్‌సభ స్పీకర్‌ ముగ్గురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేయడాన్ని సవాలు చేస్తూ వర్మ పిటిషన్‌ వేశారు. జస్టిస్‌ వర్మ ఢిల్లీ హైకోర్టు జడ్జిగా ఉన్న సమయంలో ఈ ఏడాది మార్చి 14న ఆయన అధికారిక నివాసంలో అగ్నిప్రమాదం జరగ్గా.. సగం కాలిన నోట్ల కట్టలు భారీగా బయటపడిన సంగతి తెలిసిందే. ఆయన్ను పదవి నుంచి తొలగించాలని కోరుతూ వివిధ పార్టీల నేతలు నోటీసులు ఇవ్వడంతో లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా జస్టిస్‌ వర్మపై అభిశంసన ప్రక్రియను ప్రారంభించేందుకు గాను ఆగస్టు 12న ముగ్గురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ ఏర్పాటును సవాలు చేస్తూ జస్టిస్‌ వర్మ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌ను మంగళవారం ధర్మాసనం విచారణకు స్వీకరించింది. అభిశంసన తీర్మానం పార్లమెంటు ఉభయసభల్లో ఇవ్వాల్సి ఉండగా, అలాంటిదేమీ జరగలేదని వర్మ తరఫున సీనియర్‌ న్యాయవాది ముకుల్‌ రోహత్గి సుప్రీం ధర్మాసనానికి తెలిపారు. జస్టిస్‌ వర్మపై అభిశంసన ప్రక్రియ ప్రారంభించే ముందు లోక్‌సభ స్పీకర్‌, రాజ్యసభ చైర్మన్‌ సంయుక్తంగా దర్యాప్తు కమిటీని ఏర్పాటు చేయాలని గుర్తుచేశారు. కానీ, లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా ఏకపక్షంగా కమిటీ ఏర్పాటు చేశారని ధర్మాసనానికి తెలిపారు. ఈ కమిటీకి చట్టబద్ధత లేదన్నారు. వాదనలు విన్న ధర్మాసనం.. ఈ అంశంపై వివరణ ఇవ్వాలంటూ లోక్‌సభ స్పీకర్‌ కార్యాలయానికి, ఉభయ సభల సెక్రటరీ జనరళ్లకు నోటీసులు జారీ చేసింది.

Updated Date - Dec 17 , 2025 | 04:10 AM