Long Pepper Compound Effective: పిప్పళ్లతో పెద్దపేగు క్యాన్సర్ అంతం!
ABN , Publish Date - Nov 26 , 2025 | 04:11 AM
పిప్పళ్లు లేదా తోక మిరియాలు.. దేశంలోని చాలామంది వంటిళ్లలో కనిపించే ఓ మసాలా దినుసు. ఈ పిప్పళ్లకు ప్రాణాంతకమైన పెద్ద పేగు క్యాన్సర్...
ఎన్‌ఐటీ రూర్కెల పరిశోధకుల అధ్యయనం
న్యూఢిల్లీ, నవంబరు 25: పిప్పళ్లు లేదా తోక మిరియాలు.. దేశంలోని చాలామంది వంటిళ్లలో కనిపించే ఓ మసాలా దినుసు. ఈ పిప్పళ్లకు ప్రాణాంతకమైన పెద్ద పేగు క్యాన్సర్(కొలన్ క్యాన్సర్)ను అంతం చేసే శక్తి ఉందని పరిశోధకులు గుర్తించారు. పిప్పళ్లలో సహజ సిద్ధంగా ఉండే పిప్లార్టైన్(పైపర్‌లాంగమీన్) అనే పదార్థం పెద్ద పేగు క్యాన్సర్ కణాలను సమర్థంగా చంపేస్తుందని కనుగొన్నారు. ఈ పిప్లార్టైన్ క్యాన్సర్ రోగులకు ఓ వరం లాంటి ఔషధమని రూర్కెలలోని ఎన్‌ఐటీ పరిశోధకులు చెబుతున్నారు. బిహార్ సెంట్రల్ యూనివర్సిటీ, అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ నార్త్ కరోలినాకు చెందిన బృందాలతో కలిసి ఎన్‌ఐటీ రూర్కెల పరిశోధకులు చేసిన అధ్యయనంలో పిప్పళ్లలోని క్యాన్సర్ సంహారక శక్తి వెల్లడైంది. పెద్ద పేగు క్యాన్సర్ బారిన పడిన రోగులకు ప్రస్తుతం కీమోథెరపీ ద్వారా చికిత్స అందిస్తున్నారు. ప్రత్యామ్నాయ వైద్య విధానాలపై పరిశోధనలు చేస్తున్న క్రమంలో పిప్పళ్లలోని పిప్లార్టైన్‌ను పెద్ద పేగు క్యాన్సర్ కణాలపై పరీక్షించిన ఎన్‌ఐటీ రూర్కెల పరిశోధకులు అద్భుతమైన ఫలితాన్ని కనుగొన్నారు. ఈ అధ్యయనానికి సంబంధించిన వివరాలు బయోఫ్యాక్టర్స్ అనే జర్నల్‌లో ప్రచురితమయ్యాయి.