Starlink: స్టార్‌లింక్ ఇంటర్‌నెట్.. నెలకు రూ.8600
ABN , Publish Date - Dec 09 , 2025 | 03:00 AM
అపర కుబేరుడు ఈలన్ మస్క్‌కు చెందిన ఉపగ్రహ ఇంటర్‌నెట్ సేవల సంస్థ ‘స్టార్‌లింక్’ సంస్థ భారత్‌లో అందించే సేవల ధరలను వెల్లడించింది.....
న్యూఢిల్లీ, డిసెంబరు 8: అపర కుబేరుడు ఈలన్ మస్క్‌కు చెందిన ఉపగ్రహ ఇంటర్‌నెట్ సేవల సంస్థ ‘స్టార్‌లింక్’ సంస్థ భారత్‌లో అందించే సేవల ధరలను వెల్లడించింది. ఎలాంటి బ్రాడ్‌బ్యాండ్, మొబైల్ డేటా సేవలూ అందని ప్రదేశాల్లో ఉపయోగపడే ఈ శాటిలైట్ ఇంటర్‌నెట్ సేవలకు.. గృహవినియోగదారులు నెలకు రూ.8,600 చెల్లించాల్సి ఉంటుందని పేర్కొంది. అలాగే.. దీనికి సంబంధించిన హార్డ్‌వేర్ కిట్‌ను రూ.34 వేలు చెల్లించి కొనుగోలు చేయాలి. ఈ ప్లాన్ కింద వినియోగదారులు అపరిమిత డేటాను అందుకుంటారు. 30రోజుల ఉచిత ట్రయల్ పీరియడ్ ఉంటుంది. గృహ వినియోగదారులకు సంబంధించి నెలవారీ సబ్‌స్ర్కిప్షన్ ప్లాన్‌ను వెల్లడించిన స్టార్‌లింక్.. వాణిజ్య వినియోగానికి సంబంధించిన ప్లాన్లను విడుదల చేయలేదు. అయితే.. మనదేశంలో అదే రూ.8600తో ఏడాది మొత్తం బ్రాడ్‌బ్యాండ్ సేవలు అందుకోవచ్చని.. ఆ ప్యాకేజీలోనే కొన్ని ఓటీటీలను కూడా ఉచితంగా చూడొచ్చని నెటిజన్లు గుర్తుచేస్తున్నారు. రూ.500కే అపరిమిత ఇంటర్‌నెట్ సేవలు లభించే ఇండియాలో.. స్టార్‌లింక్ ఈ స్థాయి ధరలతో మనుగడ సాగించడం కష్టమేనంటున్నారు.