Electric Vehicles: ఈవీలకు సౌండ్ అలర్ట్ సిస్టమ్
ABN , Publish Date - Sep 30 , 2025 | 04:00 AM
రోడ్డు ప్రమాదాలను తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. శబ్దం లేకుండా దూసుకెళ్లే ఎలక్ట్రిక్ వాహనాల వల్ల ఇతర వాహనదారులకు ప్రమాదాలు....
2027 నుంచి కొత్త నిబంధన
న్యూఢిల్లీ, సెప్టెంబరు 29: రోడ్డు ప్రమాదాలను తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. శబ్దం లేకుండా దూసుకెళ్లే ఎలక్ట్రిక్ వాహనాల వల్ల ఇతర వాహనదారులకు ప్రమాదాలు జరగకుండా.. ఇకపై అన్ని ఎలక్ట్రిక్ కార్లు, బస్సులు, ట్రక్కులకు ‘సౌండ్ అలర్ట్ సిస్టమ్’ (ఏవీఏఎ్‌స)ను తప్పనిసరి చేయాలని రోడ్డు రవాణా, రహదారుల శాఖ ప్రతిపాదించింది. ఈ కొత్త నిబంధన 2027, అక్టోబరు 1 నుంచి అమలులోకి రానుంది. ఈ మేరకు మంత్రిత్వ శాఖ ఒక ముసాయిదా నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎలక్ట్రిక్ వాహనాలు నిశ్శబ్దంగా నడుస్తాయి. దీంతో అవి వస్తున్నాయన్న విషయం పాదచారులకు, ఇతర వాహనదారులకు తెలియదు. ఈ పరిస్థితి వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని, ఎలక్ట్రిక్ వాహనాలు వస్తున్నప్పుడు కృత్రిమంగా శబ్దం చేసే ఏవీఏఎస్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని రవాణా శాఖ నోటిఫికేషన్‌లో పేర్కొంది. 2026 అక్టోబరు తర్వాత తయారయ్యే కొత్త మోడల్ ఎలక్ట్రిక్ వాహనాలు (కార్లు, బస్సులు, ట్రక్కులు) వెంటనే ఈ సౌండ్ సిస్టమ్‌తో రావాలని సూచించింది. అలాగే, ప్రస్తుతం నడుస్తున్న పాత మోడల్ వాహనాలు ఈ సిస్టమ్‌ను అమర్చుకోవడానికి 2027 అక్టోబరు 1 వరకు గడువు ఇచ్చింది. అమెరికా, జపాన్, కొన్ని యూరోపియన్ దేశాలు ఇప్పటికే ఏవీఏఎస్ వినియోగాన్ని తప్పనిసరి చేశాయి.