Tiruvallur District: పాముతో కాటేయించి తండ్రి హత్య
ABN , Publish Date - Dec 21 , 2025 | 04:53 AM
బీమా డబ్బుల కోసం తండ్రిని పాముతో కాటు వేయించి హత్య చేసిన కుమారులను పోలీసులు అరెస్టు చేశారు.
బీమా డబ్బుల కోసం కొడుకుల ఘాతుకం
తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లాలో ఘటన
తిరుత్తణి, డిసెంబరు 20(ఆంధ్రజ్యోతి): బీమా డబ్బుల కోసం తండ్రిని పాముతో కాటు వేయించి హత్య చేసిన కుమారులను పోలీసులు అరెస్టు చేశారు. తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లాలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పొదటూరుపేటకు చెందిన గణేశన్(56) అదే ప్రాంతంలోని ప్రభుత్వ పాఠశాలలో ల్యాబ్ అసిస్టెంట్‌గా పనిచేసేవాడు. ఈ ఏడాది అక్టోబరు 22న ఇంటి బాత్రూమ్‌లో పాము కాటుకు గురై గణేశన్ మృతిచెందారు. కేసు నమోదు చేసి, విచారణ చేపట్టిన పొదటూరుపేట పోలీసులు కూడా.. గణేశన్ పాము కాటుకు గురై చనిపోయినట్లు భావించారు. గణేశన్ కుమారులు మోహన్‌రాజ్, హరిహరన్ తమ తండ్రికి బీమా డబ్బులు రావాలంటూ బీమా సంస్థలను సంప్రదించారు. విచారణ చేపట్టిన బీమా సంస్థలు.. గణేశన్ కుమారుల వైఖరిపై సందేహం వ్యక్తం చేస్తూ ఉత్తరమండల ఐజీ అస్రాగార్గ్‌కు ఫిర్యాదు చేశాయి. గుమ్మిడిపూండి డీఎస్పీ జయశ్రీ నేతృత్వంలోని పోలీసులు దర్యాప్తు చేపట్టగా విస్తుపోయే విషయాలు వెలుగుచూశాయి. ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్న మోహన్‌రాజ్, హరిహరన్.. తమ తండ్రి రూ.2.5కోట్లకు బీమా చేసిన విషయం తెలుసుకున్నారు. తండ్రిని చంపి బీమా డబ్బుతో పబ్బం గడుపుకోవాలని కుట్రపన్నారు. 3నెలల క్రితం ఓ పామును తెచ్చి తండ్రిపైకి వదిలారు. ఆ పాము కాటువేసినా గణేశన్ మరణించలేదు. దీంతో ఈసారి పనవూరుకు చెందిన బాలాజీ, ప్రశాంత్, తిరుత్తణి దినకరన్, నవీన్‌కుమార్‌తో కలిసి తాచుపామును తెచ్చి అక్టోబరు 21న నిద్రపోతున్న తండ్రి మెడకు చుట్టారు. ఆ పాముకాటు వేయడంతో గణేశన్ మరణించారు. బాత్రూంలో పాము కరచి తమ తండ్రి చనిపోయాడంటూ మోహన్‌రాజ్, హరిహరన్ అందరినీ నమ్మించారు. అయితే, ఆలస్యంగా ఈ విషయాన్ని గ్రహించిన పోలీసులు.. శుక్రవారం వారిద్దరినీ అరెస్టు చేసి పుళల్ జైలుకు తరలించారు.