Sonia Gandhi Criticizes: ఉపాధి హామీపై బుల్డోజర్
ABN , Publish Date - Dec 23 , 2025 | 03:48 AM
మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ‘విధ్వంసం చేయడం’ వల్ల దేశంలోకి కోట్లాది మంది గ్రామీణులు దారుణమైన విపత్తును ఎదుర్కోవాల్సి ఉంటుందని కాంగ్రెస్....
పథకం మొత్తం ధ్వంసం
ఇకపై నిర్ణయాలు తీసుకునేది పల్లెల్లో కాదు...ఢిల్లీలో
పని హక్కు పరిరక్షణకు ఏకం కావాలి
సోనియా గాంధీ వ్యాఖ్యలు
న్యూఢిల్లీ, డిసెంబరు 22: మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ‘విధ్వంసం చేయడం’ వల్ల దేశంలోకి కోట్లాది మంది గ్రామీణులు దారుణమైన విపత్తును ఎదుర్కోవాల్సి ఉంటుందని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆందోళన వ్యక్తం చేశారు. అందరికీ ఉపాఽధి కల్పించే హక్కును కాపాడుకోవడానికి ఏకం కావాలని పిలుపునిచ్చారు. ఉపాధి పథకం స్థానంలో కేంద్ర ప్రభుత్వం ‘వీబీ- జీ రాం జీ’ పథకాన్ని తీసుకొచ్చిన నేపథ్యంలో ఆమె ఓ ఆంగ్ల దినపత్రికలో వ్యాసం రాశారు. మహాత్మాగాంధీ ఆశయమైన సర్వోదయ స్ఫూర్తితో, రాజ్యాంగంలోని 41వ అఽధికరణంలో పొందుపరిచిన ‘పని హక్కు’కు అనుగుణంగా ఉపాధి హామీ పథకాన్ని రూపొందించారని తెలిపారు. దానిని నరేంద్ర మోదీ ప్రభుత్వం బుల్డోజర్‌తో విధ్వంసం చేసిందని ఆరోపించారు. ‘‘ఎలాంటి చర్చలు లేవు. సంప్రదింపులు లేవు. పార్లమెంటరీ సంప్రదాయాలనుగానీ, కేంద్ర-రాష్ట్ర సంబంధాలనుగానీ గౌరవించినదీ లేదు. ఈ ప్రక్రియలో మహాత్మా గాంధీ పేరును తొలగించడం చాలా చిన్న అంశం. జీవితాలపై ప్రభావం చూపే మొమత్తం పథకాన్నే నాశనం చేయడం గమనించదగ్గది’’ అని పేర్కొన్నారు. నూతన వీబీ- జీ రాం జీ పథకం చాలా ఆంక్షలతో కూడుకున్నదని సోనియా అభిప్రాయపడ్డారు. దీంట్లోని నిబంధనలు అధికారుల ఆదేశాల్లాంటివి తప్ప ప్రజల ప్రమేయంతో కూడుకున్నవి కావని తెలిపారు. ‘‘కేంద్ర ప్రభుత్వ విచక్షణ అధికారంతో ఇది అమలవుతుంది. నిధుల కేటాయింపుపై బడ్జెట్‌లో పరిమితి విధిస్తారు. దీనివల్ల పని దినాలపైనా ఆంక్షలు ఉంటాయి. ప్రజల అవసరాలకు అనుగుణంగా కాకుండా కేంద్ర ప్రభుత్వ ప్రాధాన్యతల మేరకు పనులు ఉంటాయి. ఏడాది పొడవునా ఉపాఽధి కల్పిస్తామన్న హామీకి చెల్లుచీటి పలికారు’’ అని వివరించారు. ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామాల్లో భూమి లేని పేదల బేరమాడే శక్తి పెరిగిందని, అందువల్ల వ్యవసాయ కూలీ పెరిగిందని సోనియా తెలిపారు. ఈ పథకం కనబరిచిన పెద్ద ప్రభావం ఇదేనని పేర్కొన్నారు. కొత్త చట్టం ద్వారా ఈ బేరమాడే శక్తిని ఇప్పుడు కోల్పోతారని అభిప్రాయపడ్డారు. వ్యవసాయ రంగంపై ఆధారపడ్డవారి సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో వేతనాల పెరుగుదలను అడ్డుకోవడం సరికాదని తెలిపారు. కొత్త పథకం అమలుకు భారీ స్థాయిలో నిధులు సమకూర్చాల్సిన బాధ్యతను మోదీ ప్రభుత్వం రాష్ట్రాలపై ఉంచిందని సోనియా తెలిపారు.
అసలే ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్రాలపై మరింత భారం మోపినట్టయిందని పేర్కొన్నారు. గతంలో కేంద్ర నిధులు 90శాతం మేర, రాష్ట్ర నిధులు 10 శాతం మేర ఉండగా; ఇప్పుడు కేంద్ర వాటా 60 శాతం, రాష్ట్ర వాటా 40 శాతంగా ఉందని తెలిపారు. అందువల్ల ఈ పథకాన్ని అమలు చేయవద్దన్నట్టుగా కేంద్రం ధోరణి ఉందని ఆరోపించారు. ఉపాధి కల్పన కాలాన్ని 100 నుంచి 125 రోజులకు పెంచినట్టు మోదీ ప్రభుత్వం చెబుతున్నా నిజానికి గత పదేళ్ల కాలంలో నిర్ణీత లక్ష్యాన్ని చేరుకున్న సందర్భం లేదని తెలిపారు. నిధులు కేటాయించకపోవడం, సకాలంలో కూలీ సొమ్ము విడుదల చేయకపోవడం, సాంకేతిక పరిజ్ఞానం పేరుతో జాబితాల నుంచి కూలీల పేర్లు తొలగించడం వంటి తిరోగమన చర్యలను చేపట్టిందని వివరించారు. ఉపాధి, పనుల కోసం ప్రజలు డిమాండు చేసే అవకాశం లేకుండా పోయిందని తెలిపారు. దీనిని కేవలం ఒక పథకం రద్దుగా చూడకూడదని, పని హక్కును తొలగించి, రాజ్యాంగంపై దాడి చేయడానికి అధికార పార్టీ చేస్తున్న ప్రయత్నంగా భావించాలని అన్నారు.
నేషనల్ హెరాల్డ్ కేసులో ఢిల్లీ హైకోర్టు నోటీసులు
నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలపై దాఖలు చేసిన చార్జిషీట్‌ను పరిగణనలోకి తీసుకోవడానికి నిరాకరిస్తూ ట్రయల్ కోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ ఈడీ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. ఈడీ పిటిషన్‌పై స్పందనను కోరుతూ సోమవారం సోనియా, రాహుల్‌లకు కోర్టు నోటీసులు జారీ చేసింది. ప్రధాన పిటిషన్‌తోపాటు ఈనెల 16న ట్రయల్ కోర్టు ఇచ్చిన ఆదేశాలపై స్టే కోరుతూ ఈడీ దరఖాస్తు చేయడంతో సోనియా, రాహుల్, ఇతరులకు జస్టిస్ రవీందర్ నోటీసులు జారీ చేశారు. తదుపరి విచారణను మార్చి 16కు వాయిదా వేశారు. ఎఫ్‌ఐఆర్ లేనందున మనీలాండరింగ్ నేరానికి సంబంధించిన దర్యాప్తు, తదనంతర ప్రాసిక్యూషన్ ఫిర్యాదు చెల్లదని ట్రయల్ కోర్టు తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే.