Share News

Sonia Gandhi: ఉపాధిపై బుల్డోజర్‌ ప్రయోగం

ABN , Publish Date - Dec 21 , 2025 | 06:15 AM

నిరుపేదలు, అణగారిన ప్రజలకు జీవనాధారంగా ఉన్న మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని దెబ్బతీసేందుకు మోదీ సర్కారు దానిపై బుల్డోజర్‌ను ప్రయోగిస్తోందని...

Sonia Gandhi: ఉపాధిపై బుల్డోజర్‌ ప్రయోగం

  • మోదీ ప్రభుత్వంపై సోనియా గాంధీ మండిపాటు

న్యూఢిల్లీ, డిసెంబరు 20(ఆంధ్రజ్యోతి): నిరుపేదలు, అణగారిన ప్రజలకు జీవనాధారంగా ఉన్న మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని దెబ్బతీసేందుకు మోదీ సర్కారు దానిపై బుల్డోజర్‌ను ప్రయోగిస్తోందని కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ చైర్‌పర్సన్‌ సోనియాగాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పథకాన్ని నిర్వీర్యం చేసేందుకు 11 ఏళ్లుగా నిరంతరం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఈ మేరకు ఆమె శనివారం ఒక ప్రత్యేక వీడియోను విడుదల చేశారు. కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో పేదలకు ‘సంజీవని’లా పనిచేసిన పథకాన్ని ఇప్పుడు మోదీ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందన్నారు. ఎవరినీ సంప్రదించకుండా, విపక్షాలను విశ్వాసంలోకి తీసుకోకుండా ఈ పథకం స్వరూపాన్ని మార్చేశారని విమర్శించారు. పథకం పేరు నుంచి ‘మహాత్మా గాంధీ’ పేరును తొలగించడాన్ని ఆమె తీవ్రంగా తప్పుబట్టారు. కొత్త మార్పులతో గ్రామ పంచాయతీల అధికారం పోయి, అంతా ఢిల్లీ నుంచే శాసించే పరిస్థితి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఎవరికి, ఎక్కడ పని ఇవ్వాలో క్షేత్రస్థాయి పరిస్థితులతో సంబంధం లేకుండా ఢిల్లీలో కూర్చున్న వారు నిర్ణయిస్తారా అని సోనియా నిలదీశారు. ఈ పథకం కోట్ల మంది నిరుపేదలు, అణగారిన వర్గాలకు జీవనాధారంగా మారిందన్నారు. పేదలకు ఉపాధి హక్కు కల్పించేందుకు గతంలో పోరాడిన విధంగానే నేడు ఈ నల్ల చట్టంపైనా పోరాడేందుకు అంతే నిబద్ధతతో ఉన్నామని సోనియా గాంధీ స్పష్టం చేశారు.

Updated Date - Dec 21 , 2025 | 06:38 AM