Share News

Smart Terror Conspiracy: స్మార్ట్‌గా ఉగ్ర కుట్ర

ABN , Publish Date - Nov 16 , 2025 | 06:36 AM

ఢిల్లీ బాంబు పేలుడులో ఆత్మాహుతి బాంబరు ఉమర్‌ నబీ నడిపిన ‘డాక్టర్‌ మాడ్యుల్‌’లోని సభ్యులు తమ డిజిటల్‌ ఆధారాలు దొరక్కుండా జాగ్రత్తపడినట్టు నిఘా వర్గాలు తెలిపాయి.

Smart Terror Conspiracy: స్మార్ట్‌గా ఉగ్ర కుట్ర

  • నిఘా సంస్థలు వాడే టెక్నాలజీతో పరస్పరం మెయిల్‌ సంభాషణ

న్యూఢిల్లీ, నవంబరు 15: ఢిల్లీ బాంబు పేలుడులో ఆత్మాహుతి బాంబరు ఉమర్‌ నబీ నడిపిన ‘డాక్టర్‌ మాడ్యుల్‌’లోని సభ్యులు తమ డిజిటల్‌ ఆధారాలు దొరక్కుండా జాగ్రత్తపడినట్టు నిఘా వర్గాలు తెలిపాయి. దీనికోసం...ఒక ఈమెయిల్‌ను సృష్టించి, పాస్‌వర్డ్‌ను అందరి దగ్గర ఉంచుకున్నారు. మెయిల్‌ రాసి, దానిని ఎవరికైనా పంపితే ట్రాక్‌ చేయడం తేలిక. కానీ, ఆ మెయిల్‌ను ఎవరికీ పంపకపోతే డ్రాఫ్ట్‌లోకి అది చేరుతుంది. ఈ మాడ్యుల్‌లోని సభ్యులు తమ వద్ద ఉన్న పాస్‌వర్డుతో మెయిల్‌ ఓపెన్‌ చేసి డ్రాఫ్ట్‌లో తమకోసం ఉంచిన సందేశాన్ని చదువుకుంటారు. సాధారణంగా నిఘా సంస్థలు ఈ టెక్నాలజీని వాడతాయి. కాగా, ఢిల్లీ పేలుడు నేపథ్యంలో పోలీసులతో పాటు దర్యాప్తు సంస్థలు హరియాణాలోని అల్‌ ఫలాహ్‌ యూనివర్సిటీపై దృష్టి సారించాయి. ఇప్పటికే ఐదుగురిని అనుమానం మీద అదుపులోకి తీసుకోగా, శుక్రవారం రాత్రి మరో ముగ్గురిని హరియాణాలోని నుహ్‌, ఽధౌజ్‌ల్లో అదుపులోకి తీసుకున్నారు. వీరిలో అల్‌ ఫలాహ్‌ వర్సిటీకి చెందిన మొహహ్మద్‌, ముస్తాకిమ్‌ అనే ఇద్దరు వైద్యులు, లైసెన్స్‌ లేకుండా ఎరువుల వ్యాపారం చేస్తున్న దినేశ్‌ అనే వ్యక్తి ఉన్నారు. ఈ వైద్యులు ఆత్మాహుతి బాంబరు ఉమర్‌ నబీ, ఉగ్ర కుట్ర సూత్రధారి ముజమ్మిల్‌లకు సన్నిహితులని గుర్తించారు. వీరిలో ఒకరు పేలుడు జరిపిన రోజున ఢిల్లీలోనే ఉన్నాడని, ఎయిమ్స్‌లో ఇంటర్వ్యూ కోసం వచ్చినట్లు తెలిసింది. దినేశ్‌ బాంబుల తయారీ కోసం ఎరువులు అమ్మాడా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు ఉగ్ర సంస్థలతో సంబంధాలు ఉన్నాయన్న అనుమానంతో పశ్చిమబెంగాల్‌లోని ఉత్తర దినాజ్‌పూర్‌ జిల్లాలో జనీసూర్‌ ఆలం అనే ఎంబీబీఎస్‌ విద్యార్థిని ఎన్‌ఐఏ అరెస్టు చేసింది.


ఇతను అల్‌ ఫలాహ్‌ వర్సిటీలో చదువుతున్నట్టు గుర్తించారు. పంజాబ్‌లోని పఠాన్‌కోట్‌లో ఒక వైద్యుడిని దర్యాప్తు సంస్థలు అదుపులోకి తీసుకున్నాయి. ఇతడు గతంలో అల్‌ ఫలా్‌హలో పనిచేశారు. షహీన్‌ నేతృత్వంలోనే ‘మాడ్యుల్‌’ ఉగ్ర కుట్రలో అరెస్టయిన మహిళా వైద్యురాలు షహీన్‌ షాహిద్‌.. అల్‌ ఫలాహ్‌ యూనివర్సిటీ కేంద్రంగా నడిచిన తీవ్రవాద మాడ్యూల్‌కు నాయకత్వం వహించారని, ఈ గ్రూపులోని వైద్యుల మధ్య అంతర్గత విభేదాలను పరిష్కరించేందుకు ఆమె తరచుగా జోక్యం చేసుకొనే వారని దర్యాప్తు అధికారులు చెబుతున్నాయి. ఫరీదాబాద్‌లో సీసీ కెమెరాకు చిక్కిన ఉమర్‌ ఉగ్ర కుట్ర బయటపడిపోవడంతో తప్పించుకునే ప్రయత్నం చేసిన ఆత్మాహుతి బాంబరు ఉమర్‌ నబీ ఈ క్రమంలో పలు మొబైళ్లను వాడాడు. కారు బాంబుపేలుడుకు ముందురోజు అతడు ఫరీదాబాద్‌లోనే ఉన్నట్టు తెలిపే సీసీ కెమెరా ఫుటేజీ తాజాగా పోలీసుల చేతికి అందింది. ఫరీదాబాద్‌లోని ఓ షాపులో ఉమర్‌ నబీ ఫోన్‌ చార్జింగ్‌ పెట్టడం దానిలో కనిపించింది. ఆ సమయంలో అతడు ఒత్తిడిలో ఉన్నట్టు అనిపించాడు. ఢిల్లీలోకి ప్రవేశించడానికి ముందే తన ఫోన్లను అతడు మాయంచేయడంగానీ లేక నిర్వీర్యం చేయడంగానీ చేసి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. కాగా, పుల్వామాలోని ఉమర్‌ ఇంటిని అధికారులు కూల్చివేశారు.

Updated Date - Nov 16 , 2025 | 06:38 AM