Sabarimala Gold Discrepancy Case: శబరిమలలో బంగారం మాయంపై సిట్
ABN , Publish Date - Oct 07 , 2025 | 02:14 AM
శబరిమల అయ్యప్ప దేవాలయంలో బంగారం మాయమయినట్టు ప్రాథమిక విచారణలో తేలడంతో దీనిపై లోతుగా దర్యాప్తు చేయించాలని సోమవారం కేరళ హైకోర్టు నిర్ణయించింది....
కేరళ హైకోర్టు ఆదేశం
నెల రోజుల్లో నివేదిక ఇవ్వాలని సూచన
తిరువనంతపురం, అక్టోబరు 6: శబరిమల అయ్యప్ప దేవాలయంలో బంగారం మాయమయినట్టు ప్రాథమిక విచారణలో తేలడంతో దీనిపై లోతుగా దర్యాప్తు చేయించాలని సోమవారం కేరళ హైకోర్టు నిర్ణయించింది. పోలీసు ఏడీజీ హెచ్.వెంకటేశ్ ఆధ్వర్యంలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. బంగారు తాపడం ఉన్న రాగి రేకుల మరమ్మతు పనుల్లో అక్రమాలు జరిగినట్టు కనిపిస్తోందని జస్టిస్ రాజా విజయ రాఘవన్, జస్టిస్ కె.వి.జయకుమార్‌ల ధర్మాసనం తెలిపింది. ఈ కుట్రలో బెంగుళూరులో నివసిస్తున్న మలయాళీ ఉన్నికృష్ణన్ పొట్టితో పాటు ట్రావంకోర్ దేవస్వోం బోర్డు అధికారులకు సంబంధం ఉన్నట్టు అనుమానాలు వ్యక్తం చేసింది. సంపూర్ణంగా విచారణ జరిపి నెల రోజుల్లో నివేదిక అందజేయాలని ‘సిట్’ను ఆదేశించింది. ఉన్ని కృష్ణన్ 2019లో అప్పటి దేవస్వోం బోర్డు చైర్మన్ ఎ.పద్మకుమార్‌కు పంపిన ఈ-మెయిల్ అక్రమాలకు కీలక ఆధారంగా ఉందని హైకోర్టు అభిప్రాయపడింది. ‘ద్వారపాలక విగ్రహాలకు బంగారు తాపడం రేకులను అమర్చిన తరువాత ఇంకా కొన్ని రేకులు నా వద్ద ఉన్నాయి. వాటిని ఓ బాలిక వివాహానికి వాడుకోవచ్చా?’ అని ఆ మెయిల్‌లో ఉందని, దానిపై చర్యలు తీసుకున్నట్టు కనిపించడం లేదని కోర్టు అభిప్రాయపడింది.