Medical Education: ఒక్క కాలేజీకే పీపీపీ బిడ్!
ABN , Publish Date - Dec 24 , 2025 | 04:23 AM
పబ్లిక్-ప్రైవేట్-పార్టనర్‌షి్‌ప(పీపీపీ) విధానంలో మెడికల్ కాలేజీలను నిర్మించేందుకు పిలిచిన టెండర్లలో ఒకే ఒక సంస్థ బిడ్ దాఖలు చేసింది....
ఆదోని మెడికల్ కళాశాల నిర్మాణానికి బిడ్ దాఖలు చేసిన ‘కిమ్స్’ సంస్థ
మార్కాపురం, మదనపల్లె, పులివెందుల కాలేజీలకు ఒక్కరూ ముందుకు రాని వైనం
ముగిసిన టెండర్ల గడువు
అమరావతి, డిసెంబరు 23(ఆంధ్రజ్యోతి): పబ్లిక్-ప్రైవేట్-పార్టనర్‌షి్‌ప(పీపీపీ) విధానంలో మెడికల్ కాలేజీలను నిర్మించేందుకు పిలిచిన టెండర్లలో ఒకే ఒక సంస్థ బిడ్ దాఖలు చేసింది. ఉమ్మడి కర్నూలు జిల్లా ఆదోనిలో మెడికల్ కాలేజీని నిర్మించేందుకు హైదరాబాద్‌కు చెందిన ‘కిమ్స్’ సంస్థ ముందుకు వచ్చింది. మిగిలిన మార్కాపురం, మదనపల్లె, పులివెందుల కళాశాలలను చేపట్టేందుకు ఎవరూ ముందుకురాలేదు. మొత్తం 4 కాలేజీలను పీపీపీ విధానంలో నిర్మించేందుకు ఏపీఎంఎ్‌సఐడీసీ(ఆంధ్రప్రదేశ్ వైద్య సేవలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి కార్పొరేషన్) టెండర్లను ఆహ్వానించింది. దీనికి సంబంధించిన గడువు సోమవారం ముగిసింది. అయితే.. ఈ నాలుగు కళాశాలల్లో ఒక్క ఆదోని కాలేజీకి మాత్రమే ‘కిమ్స్’ సంస్థ బిడ్ దాఖలు చేసింది. దీనికి కారణాలపై చర్చిస్తామని అధికారులు తెలిపారు. వాస్తవానికి టెండర్ల ప్రకటన అనంతరం.. వైద్య ఆరోగ్య శాఖ అధికారులు నిర్వహించిన ప్రీబిడ్ సమావేశాలకు 5 సంస్థలు హాజరయ్యాయి. ఆయా సంస్థలు పలు కీలక అంశాలపై ప్రభుత్వం నుంచి వివరణ కూడా తీసుకున్నాయి. అదేవిధంగా టెండర్ల దాఖలు గడువును పొడిగించాలని కోరగా.. రెండుసార్లు గడువు కూడా పొడిగించారు. దీంతో నాలుగు కాలేజీలకు ఆశించిన విధంగా బిడ్లు దాఖలవుతాయని అధికారులు భావించారు. కానీ, సోమవారం టెండర్ల గడువు ముగిసే సమయానికి కేవలం ఆదోని ఆసుపత్రికి మాత్రమే బిడ్ దాఖలుకావడం గమనార్హం.