Siddaramaiah: అధిష్ఠానం నా వైపే.. ఐదేళ్లూ నేనే సీఎం!
ABN , Publish Date - Dec 20 , 2025 | 04:23 AM
అధిష్ఠానం నా వైపే ఉంది. నేనే ఐదేళ్లు సీఎంగా ఉంటా. రెండున్నరేళ్ల తీర్మానం అనేది లేదు. నాకు రాజకీయ నిరాసక్తత అనేది ఉండదు.
రెండున్నరేళ్ల తీర్మానం లేదు
శాసనసభలో సిద్దరామయ్య
బెంగళూరు, డిసెంబరు 19(ఆంధ్రజ్యోతి): ‘అధిష్ఠానం నా వైపే ఉంది. నేనే ఐదేళ్లు సీఎంగా ఉంటా. రెండున్నరేళ్ల తీర్మానం అనేది లేదు. నాకు రాజకీయ నిరాసక్తత అనేది ఉండదు. ఇప్పుడూ నేనే, భవిష్యత్తులో నేనే సీఎం’ అని కర్ణాటక సీఎం సిద్దరామయ్య కుండ బద్ధలు కొట్టారు. బెళగావిలో జరుగుతున్న శాసనసభ శీతాకాల సమావేశాల చివరి రోజు శుక్రవారం డిప్యూటీసీఎం డీకే శివకుమార్ సభలో లేని సమయంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఉత్తర కర్ణాటక సమస్యలపై సభలో చర్చకు సీఎం వివరణ ఇస్తున్న సమయంలో ప్రతిపక్ష నేత అశోక్‌తోపాటు పలువురు సీఎం మార్పు అంశాన్ని ప్రస్తావించారు. ‘ఐదేళ్లు మీరే సీఎం అని ప్రకటించండి’ అని డిమాండ్ చేశారు. దీంతో సీఎం సిద్దరామయ్య ఆగ్రహానికి గురయ్యారు. బీజేపీ కర్ణాటకలో ఎప్పటికీ అధికారంలోకి రాదన్నారు. తన పదవికి ఢోకా లేదన్నట్టు వ్యాఖ్యలు చేశారు. అంతలోనే అశోక్ మాట్లాడుతూ.. ‘మీరు సీఎంగా 2023లో ప్రమాణం చేసినప్పుడు.. రెండున్నరేళ్లు అని రాసి ఇచ్చారేమో ఒకసారి పరిశీలించుకోండి’ అని సూచించారు. అందుకు సీఎం స్పందిస్తూ, ‘మేం బాగున్నాం. మాది హైకమాండ్ పార్టీ. అధిష్ఠానం నావైపు ఉంది. వారు ఏం తీర్మానం చేస్తారో దాని ప్రకారం నడుచుకుంటాం’ అని తెలిపారు. సీఎం వ్యాఖ్యలపై ప్రతిపక్ష బీజేపీ సభ్యుడు సునీల్ కుమార్‌తోపాటు పలువురు స్పందించారు. ‘తొలుత నేనే సీఎం అన్నారు. ఇప్పుడు అధిష్ఠానం నిర్ణయం అంటున్నారు’ అని ప్రశ్నించారు. రెండున్నరేళ్లు అని ఎక్కడా చెప్పలేదని, అవటువంటి తీర్మానం ఏదీ లేదన్న సిద్దరామయ్య.. నేడు, రేపు ముఖ్యమంత్రిని తానే అని స్పష్టం చేశారు.
ఒప్పందం నిజమే: డీకే
సిద్దరామయ్యతో తనకు ఒప్పందం జరిగిందని, అందుకు అనుగుణంగా ఇద్దరం కలసి అధిష్ఠానాన్ని ఒప్పించామని డిప్యూటీ సీఎం శివకుమార్ తెలిపారు. ఉత్తరకన్నడ జిల్లా గోకర్ణ ఆలయంలో ఆయన శుక్రవారం పూజలు నిర్వహించారు. తర్వాత మీడియాతో మాట్లాడారు. సిద్దరామయ్య ఐదేళ్లు ముఖ్యమంత్రిగా కొనసాగరని తానెప్పుడూ చెప్పలేదన్నారు. అధిష్ఠానం నిర్ణయం మేరకు ఆయన సీఎం అయ్యారని తెలిపారు. అధిష్ఠానం సూచనలకు అనుగుణంగా చర్చలు జరిపి కలసి ముందుకెళ్తామని స్పష్టంచేశారు.