Siddaramaiah Invites Deputy CM DK Shivakumar: నేడు సిద్దూ, డీకే భేటీ!
ABN , Publish Date - Nov 29 , 2025 | 03:16 AM
కర్ణాటకలో సీఎం మార్పుపై తీవ్ర చర్చ జరుగుతున్న వేళ అనూహ్య పరిణామం చోటు చేసుకుంటోంది. అధిష్ఠానం సూచనతో డిప్యూటీ సీఎం శివకుమార్‌ను శనివారం ఉదయం అల్పాహార....
హైకమాండ్ సూచనతో డిప్యూటీ సీఎం శివకుమార్‌ను అల్పాహార విందుకు ఆహ్వానించిన సీఎం సిద్దరామయ్య
బెంగళూరు, నవంబరు 28(ఆంధ్రజ్యోతి): కర్ణాటకలో సీఎం మార్పుపై తీవ్ర చర్చ జరుగుతున్న వేళ అనూహ్య పరిణామం చోటు చేసుకుంటోంది. అధిష్ఠానం సూచనతో డిప్యూటీ సీఎం శివకుమార్‌ను శనివారం ఉదయం అల్పాహార విందుకు ఆహ్వానించినట్లు సీఎం సిద్దరామయ్య శుక్రవారం వెల్లడించారు. తమ ఇద్దరికీ హైకమాండ్ నుంచి ఫోన్ కాల్స్ వచ్చాయని, ఇద్దరూ సమావేశమై మాట్లాడుకోవాలని సూచించారని పేర్కొన్నారు. బ్రేక్‌ఫా్‌స్టకు డీకే వచ్చినప్పుడు.. తామిద్దరం అక్కడ ‘అన్ని విషయాల’పై చర్చించుకుంటామని తెలిపారు. అధిష్ఠానం పిలిస్తే ఢిల్లీకి వెళ్తానని, హైకమాండ్ ఏం చెప్పినా పాటిస్తామనే విషయాన్ని తామిద్దరం ఇప్పటికే చెప్పామన్నారు. అయితే, శుక్రవారం ఓ ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొన్న డీకే శివకుమార్.. సిద్దరామయ్య నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని, మద్దతు ఇవ్వాలని ప్రజలను కోరడం గమనార్హం. అంతకుముందు డీకే బెంగళూరులో మీడియాతో మాట్లాడుతూ తాను దేనికీ ఆత్రుత చూపనని, అన్నీ పార్టీ అధిష్ఠానమే నిర్ణయిస్తుందని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే రెండు రోజుల క్రిందట బెంగళూరు నుంచి ఢిల్లీకి చేరుకున్నా.. సోనియాగాంధీ విదేశాల్లో ఉండడంతో సీఎం మార్పు అంశంపై చర్చలు జరగలేదని తెలుస్తోంది. ఆమె ఢిల్లీ చేరుకున్న తర్వాత ఆదివారం ఖర్గే, రాహుల్, కేసీ వేణుగోపాల్‌లతో సమావేశం కానున్నారు. ఆ తర్వాత, సిద్దరామయ్య, శివకుమార్‌ను ఢిల్లీకి పిలిచి, వారికి దిశానిర్దేశం చేయనున్నట్లు సమాచారం. కాగా, సిద్దరామయ్యను పదవి నుంచి తొలగిస్తే కాంగ్రె్‌సకు మద్దతు ఇచ్చేది లేదని కురుబ సామాజికవర్గం ప్రకటించింది.