Share News

Shubhanshu Shukla: భూప్రదక్షిణకో బ్యాడ్జీ!

ABN , Publish Date - Jun 28 , 2025 | 05:12 AM

అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేరుకున్న శుభాన్షు శుక్లాకు.. యాక్సియం-4 మిషన్‌ కమాండర్‌ పెగ్గీ విట్సన్‌ 634వ బ్యాడ్జీ (బంగారు రంగు పిన్‌) బహూకరించిన సంగతి తెలిసిందే..

Shubhanshu Shukla: భూప్రదక్షిణకో బ్యాడ్జీ!

న్యూఢిల్లీ, జూన్‌ 27: అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేరుకున్న శుభాన్షు శుక్లాకు.. యాక్సియం-4 మిషన్‌ కమాండర్‌ పెగ్గీ విట్సన్‌ 634వ బ్యాడ్జీ (బంగారు రంగు పిన్‌) బహూకరించిన సంగతి తెలిసిందే! భూకక్ష్యలో తిరుగుతున్న 634వ వ్యోమగామి అని దీని అర్థం. శుభాన్షు లాగానే తొలిసారి రోదసిలోకి వెళ్లిన పోలండ్‌, హంగరీ వ్యోమగాములకు వరుసగా 635, 636 నంబర్‌ బ్యాడ్జీలు ఇచ్చారు. మొదటిసారి రోదసిలోకి వెళ్లే వ్యోమగాములకు ఇచ్చే ఈ చిన్న చిన్న పిన్‌ల వెనుక పెద్ద కథే ఉంది. ఐదు కోణాలుండే బంగారు రంగు నక్షత్రం నుంచి రెండు కిరణాలు వెలువడుతున్నట్టుగా ఉండే ఈ పిన్‌లో కింద ఉండే వృత్తాకార భాగం భూమికి గుర్తు. ఈ పిన్‌ను ధరించారంటే.. భూమిని చుట్టొచ్చారని అర్థం. 2015లో ‘అసోసియేషన్‌ ఆఫ్‌ స్పేస్‌ ఎక్స్‌ప్లోరర్స్‌ (ఏఎ్‌సఈ)’ దీన్ని డిజైన్‌ చేసింది.


దేశాలతో సంబంధం లేకుండా వ్యోమగాములందరికీ ఇచ్చే ఒక అంతర్జాతీయ చిహ్నాన్ని రూపొందించాలని భావించి దీన్ని తయారుచేశారు. అలా రూపొందించిన తొలి పిన్‌ను 2020లో జపనీస్‌ వ్యోమగామి నొగుచికి ఇచ్చారు. శుభాన్షు కన్నా ముందు రోదసిలోకి వెళ్లి భూప్రదక్షిణం చేసిన మన భారతీయ వ్యోమగాములైన రాకేశ్‌ శర్మకు 138వ బ్యాడ్జీ, కల్పనాచావాలకు 366వ నంబర్‌ బ్యాడ్జీ అందజేశారు. భూప్రదక్షిణ చేసినవారికే కాదు.. ఆకాశం అంచుల దాకా.. అంటే కర్మన్‌లైన్‌ దాకా వెళ్లొచ్చినవారికి సైతం, దాన్ని సబ్‌-ఆర్బిటల్‌ ఫ్లైట్‌గా భావించి వారికి ఒకరకం పిన్‌లు ఇస్తారు. ఇందులో భూమిని సూచించే వృత్తం ఉండదు.

Updated Date - Jun 28 , 2025 | 05:12 AM