Share News

Shinde Fadnavis Clash: మహాయుతిలో స్థానిక చిచ్చు

ABN , Publish Date - Nov 29 , 2025 | 03:19 AM

మహారాష్ట్రలో పాలక మహాయుతి కూటమిలో చిచ్చురేగింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమిలోని ప్రధాన పక్షాలైన బీజేపీ, షిండే శివసేన మధ్య సయోధ్య కుదరలేదు..

Shinde Fadnavis Clash: మహాయుతిలో స్థానిక చిచ్చు

  • షిండే, ఫడణవీస్‌ మాటల యుద్ధం

  • బీజేపీ అహంకారాన్ని రావణ లంకలా దహనం చేస్తామన్న డిప్యూటీ సీఎం షిండే

  • తాము లంకలో జీవించడం లేదన్న సీఎం

ముంబై, నవంబరు 28: మహారాష్ట్రలో పాలక మహాయుతి కూటమిలో చిచ్చురేగింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమిలోని ప్రధాన పక్షాలైన బీజేపీ, షిండే శివసేన మధ్య సయోధ్య కుదరలేదు. దీంతో కొన్ని మున్సిపాలిటీల్లో విడివిడిగా పోటీచేస్తున్నాయి. ముఖ్యంగా దహాను, పాల్‌ఘర్‌ పురపాలక సంఘాల్లో పరస్పరం ఢీకొంటున్నాయి. శివసేన అధిపతి, ఉపముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ షిండే దహానులో తాజాగా స్థానిక బీజేపీ నేతలను టార్గెట్‌ చేశారు. ఈ ఎన్నికల్లో వారి గుత్తాధిపత్యాన్ని, అహంకారాన్ని రావణుడి లంకలా దహించివేస్తామని హెచ్చరించారు. 2వ తేదీన జరిగే ఎన్నికల్లో ప్రజలు ఆ పనిచేయాలని కోరారు. ఆయన వ్యాఖ్యలపై అదే ప్రాంతంలో బీజేపీ తరఫున ప్రచారం చేస్తున్న సీఎం దేవేంద్ర ఫడణవీస్‌ తీవ్రంగా స్పందించారు. ‘లంకను కాల్చేయబోతున్నారా? ఇలాంటి మాటలు ఎవరు ఎంత గట్టిగా అన్నా పట్టించుకోవద్దు. ఎందుకంటే మనం లంకలో జీవించడం లేదు. మనం శ్రీరాముడి భక్తులం. రావణుడిని విశ్వసించడం లేదు’ అని వ్యాఖ్యానించారు. ఇటీవల కొందరు శివసేన కార్పొరేటర్లు, పదాధికారులను బీజేపీ చేర్చుకుంది. దీనిపై షిండే కుమారుడు, ఎంపీ శ్రీకాంత్‌ షిండే, ఆ పార్టీకి చెందిన మంత్రులు బహిరంగ విమర్శలు గుప్పించారు. ఈ అంశంపై వారం కిందట షిండే కేంద్ర హోం మంత్రి అమిత్‌షాను కలిశారు కూడా. అయితే కార్పొరేటర్లు, పదాధికారులను కాపాడుకోవలసింది ఆయనేనని షా స్పష్టంచేశారు. దీంతో షిండే రగిలిపోతున్నారు. ఇప్పుడు ఫడణవీస్‌ తీవ్ర స్థాయిలో స్పందించడంతో కాస్త వెనక్కి తగ్గారు. తాను రావణుడు-అహంకారం అన్నది బీజేపీని ఉద్దేశించి కాదని.. ఉద్ధవ్‌ ఠాక్రే సారథ్యంలోని శివసేనను అన్నానని వివరణ ఇచ్చారు. మరోవైపు.. స్థానిక ఎన్నికల్లో ఓటర్లను బీజేపీ ప్రలోభాలకు గురిచేస్తోందని శివసేన ఎమ్మెల్యే నీలేశ్‌ రాణే ఆరోపించారు. సింధ్‌దుర్గ్‌లో ఓ కార్యకర్త ఇంట్లో డబ్బులు పట్టుబడ్డాయంటూ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయిన వీడియోను ఆయన శుక్రవారం పోస్టుచేశారు. ఎన్నికల కమిషన్‌ ఎలాంటి చర్యా చేపట్టలేదని, ఎఫ్‌ఐఆర్‌ కూడా నమోదుచేయలేదని ధ్వజమెత్తారు. ఈ ఆరోపణలను ఆయన సోదరుడైన బీజేపీ ఎమ్మెల్యే, మంత్రి నితేశ్‌ రాణా ఖండించారు. అందరికీ వ్యాపారాలున్నాయని.. సొంత వ్యాపారాల కోసం కార్యకర్తలు ఇంట్లో డబ్బులు పెట్టుకుంటే తప్పేమిటని ప్రశ్నించారు.

Updated Date - Nov 29 , 2025 | 03:19 AM